State home department
-
పోలీస్ 'స్పందన'కు మహిళల వందనం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘స్పందన’ పేరిట చేపట్టిన ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ ప్రత్యేక కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ 90 శాతానికి పైగా పోలీస్ స్టేషన్లలో ‘స్పందన’ రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో స్వీకరించే ఫిర్యాదులను డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి వరకు పంపించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ‘స్పందన’ను ఆశ్రయిస్తున్న వారిలో 52 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. మహిళలకు మేలు చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల స్పందన లభిస్తుండగా.. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు వస్తోంది. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్న పోలీస్ శాఖకు ఇటీవల ‘స్కోచ్’ అవార్డు లభించింది. తాజాగా జి–ఫైల్స్ గవర్నెన్స్ అవార్డు–2019కు ‘స్పందన’ కార్యక్రమం ఎంపికైనట్టు రాష్ట్ర హోంశాఖ వర్గాలు ఆదివారం తెలిపాయి. నేషనల్ పోలీస్ మిషన్(ఢిల్లీ)కి చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ) సంస్థ జి–ఫైల్స్ గవర్నెన్స్ అవార్డు అందించనుంది. ప్రకాశం జిల్లా పోలీస్‌కు ‘జి–ఫైల్స్ అవార్డు’ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను అత్యంత వేగంగా పరిష్కరిస్తున్న ప్రకాశం జిల్లా పోలీస్ విభాగం ‘జి–ఫైల్స్ గవర్నెన్స్ అవార్డు–2019’ అందుకోనుంది. స్పందన–ప్రతిస్పందన అంటూ ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అనేక వినూత్న ఆవిష్కరణలు చేశారు. కార్యక్రమంలో పారదర్శకతను పెంచేందుకు అనేక అవగాహన కార్యక్రమాల ప్రోగ్రామ్‌లోని వీడియోలను ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి విస్తృతంగా ప్రచారం చేశారు. వాటిని 40 లక్షలకు పైగా ప్రజలు వీక్షించారు. 18 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసుకున్న వీడియో కాన్ఫరెన్స్ నెట్వర్క్ ద్వారా 40 లక్షల జనాభాతో ఆన్లైన్ లో మాట్లాడేలా ప్రకాశం జిల్లా పోలీసులు మంచి ప్రయత్నం చేశారు. ‘స్పందన’ బియాండ్ బోర్డు ఏర్పాటు ప్రకాశం జిల్లాకు చెందిన వారు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ సమస్య చెప్పుకునేందుకు వీడియో కాన్ఫరెన్సింగ్‌తో స్పందన బియాండ్ బోర్డును నవంబర్ 25న ప్రారంభించారు. దీని ద్వారా యూఎస్, జర్మనీ, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, దుబాయ్, యుఏఈ, సింగపూర్ దేశాలతోపాటు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల నుంచి ప్రజలు ‘స్పందన’ ద్వారా ప్రకాశం పోలీసు సేవలను ఉపయోగించుకోవడం విశేషం. ఒక్కో సమస్యకు 8.5 నిమిషాలే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో ఒక్కొక్క సమస్య పరిష్కారానికి సగటున 8.5 నిమిషాల సమయం పట్టింది. సోషల్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగించుకుని ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎస్సై నుంచి ఎస్పీ స్థాయి వరకు ప్రధాన కార్యాలయాలతో ప్రజలు నేరుగా ఇంటరాక్ట్ అయ్యేలా 84 టెర్మినల్స్ ఏర్పాటు చేశాం. మహిళలు పోలీస్ స్టేషన్లకు రావడానికి ఇష్టపడరు. కానీ వారు ‘స్పందన’ ద్వారా సహాయం పొందేందుకు ముందుకొస్తున్నారు. – సిద్ధార్థ్ కౌశల్, ప్రకాశం జిల్లా ఎస్పీ -
హోదా ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించిన వారిపై నమోదైన అన్ని కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్.ఎం. కిశోర్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఆందోళన చేసిన వేలాది మందిపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా పోరాటాలకు సంబంధించి కేసుల్లో ఉన్న నిందితులందరిపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునేలా పిటిషన్ దాఖలు చేయాలని సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సూచించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో ఉద్యమకారులపై జిల్లాల వారీగా ఎన్ని కేసులు నమోదయ్యాయనే వివరాలను సేకరించే పనిలో పోలీసు శాఖ నిమగ్నమైంది. -
వీడు సామాన్యుడు కాడు..!
► అనుచరులతో ఫోన్లో టచ్‌లో ఉన్న చింటూ ► కడప నుంచి చిత్తూరుకు నిత్యం ఫోన్లు ► కోర్టు బాంబు పేలుడులో కొత్త కోణం ► బాంబు’ ఘటనపై రాష్ట్ర హోంశాఖకు చింటూ లేఖ చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ తన అనుచరులతో ఫోన్లో టచ్‌లో ఉన్నాడా..? జిల్లా కోర్టుల సముదాయంలో జరిగిన బాంబు పేలుడులో తనను ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చింటూ రాష్ట్ర హోంశాఖకు లేఖ రాశాడా..? ఇలాంటి పలు ప్రశ్నలకు పోలీసుల నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా చిత్తూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడు ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు దిమ్మతిరిగే వాస్తవాలు గుర్తించారు. కేసు బదిలీ చేసుకోవడానికేనా..? గత నెల 7న చిత్తూరులోని జిల్లా కోర్టుల సముదాయంలో బాంబు పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో పోలీసులు ప్రధానంగా చింటూనే అనుమానిస్తున్నారు. జంట హత్యల కేసులో చింటూ ప్రధాన నిందితుడిగా ఉండడం, కోర్టులో కేసు విచారణ వేగంగా జరుగుతుండడంతో కేసును ఇతర జిల్లాల కోర్టుకు బదిలీ చేసుకోవడానికి ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తొలుత పోలీసులు చిత్తూరు కోర్టు పరిధిలో ఉన్న పలు సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ల టవర్ల నుంచి బాంబు పేలుడు జరిగిన రోజున 20 నిముషాల అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఫోన్‌కాల్స్ జాబితాను తీసుకున్నారు. ఇందులో చింటూ అనుచరులకు వచ్చిన కొన్ని నంబర్లపై ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తమ బాస్ అప్పుడప్పుడు ఫోన్లో టచ్‌లోకి వస్తున్నారని వారు వివరించారు. పోలీసులు కడప కేంద్ర కారాగారానికి వెళ్లి విచారించారు. అక్కడి జైలు అధికారులు అలాంటిదేమీ లేదని కొట్టేపారేసినా పోలీసులకు పక్కా సాక్ష్యాలు సాధించారు. చింటూ కళాశాలలో పనిచేసిన ఓ అధ్యాపకుడు, మేయర్ దంపతుల హత్య కేసులో ఇటీవల బెయిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు, చిత్తూరు జైలులో ఉన్న మరో నిందితుడితో చింటూ ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. బాంబు పేల్చింది వీళ్లే.. కోర్టులో పేలిన బాంబు కారు తాళాలకు ఉన్న చిన్నపాటి రిమోట్‌తో పేల్చినట్లు దర్యాప్తులో తేలింది. ఇది పేల్చిన వాళ్లు పక్కా ప్రొఫెషనల్స్‌గా గుర్తించారు. నక్సలైట్, సాంకేతిక పరిజ్ఞానంపై అనుభవం ఉన్న వ్యక్తి, పోలీసు, ఆర్మీలో పనిచేసిన వాళ్లల్లో ఎవరైనా ఒకరు బాంబు పెట్టి, పేల్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మామూలు వ్యక్తులు ఎలక్ట్రానిక్ బోర్డు ద్వారా బాంబును పెట్టడం సాధ్యం కాదని చెబుతున్నారు. చింటూ లేఖ... కోర్టులో జరిగిన బాంబు పేలుడులో తనను ఇరికించాలని చూస్తున్నారని చింటూ రాష్ట్ర హోంశాఖ, చిత్తూరులోని న్యాయస్థానాలకు లేఖ రాశాడు. పేలుడుకు తనకు ఎలాంటి సంబంధంలేదని, పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసులో తన పేరు ప్రస్తావిస్తున్నారని అందులో పేర్కొన్నాడు. -
ఖైదీల విడుదలకు గ్రీన్‌సిగ్నల్
అరగంటలోనే ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: జైళ్లలో మగ్గుతున్న జీవితఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే ఆనవాయితీ ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఖైదీల విడుదల అంశాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఖైదీల కుటుంబీకుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను రాష్ట్ర హోం శాఖలోని న్యాయ విభాగం బుధవారం జారీ చేసింది. విడుదలకు అర్హులైన ఖైదీల సంఖ్యను గుర్తించేందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో అయిదుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. తాజా నిబంధనల ప్రకారం రిమాండ్‌తో కలిపి అయిదేళ్ల శిక్షను అనుభవించిన మహిళాఖైదీలు విడుదల కానున్నారు. రిమాండ్‌తో కలిపి ఏడేళ్ల శిక్ష అనుభవించిన పురుష ఖైదీలు విముక్తికి అర్హులవుతారు. అరవై ఏళ్లు దాటిన మహిళలు, 65 ఏళ్లు నిండిన పురుష ఖైదీలకు వెసులుబాటు ఉంటుంది. ఈ అర్హత కాలాన్ని ఈ ఏడాది జనవరి 26ను కట్ ఆఫ్ డేట్‌గా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ ఉత్తర్వులపై మీడియాలో ప్రచారం కావటంతో అరగంట వ్యవధిలోనే వెనక్కి తీసుకుంది. 65 మంది ఖైదీలు విడుదలయ్యే అవకాశం.. ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి గైడ్‌లైన్స్ ప్రకారం చర్లపల్లి నుంచి సుమారు 40 మంది ఖైదీలు, చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుంచి 25 మంది ఖైదీలు క్షమాభిక్ష కింద విడుదలయ్యే అవకాశమున్నట్లు జైలు అధికారులు అంటున్నారు. గతంలో సత్తయ్య అనే పోలీసు అధికారి ఓ ముస్లిం వ్యక్తి పట్ల అనుచితంగా వ్యవహరించారనే నెపంతో అతడిని అంగరక్షకుడు ఖదీర్ కాల్చి చంపాడు. చర్లపల్లి జైలులో 23 ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్న ఖదీర్ ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డాడు. ఇలాంటి కేసులో శిక్ష అనుభవించేవారికి క్షమాభిక్ష వర్తించదు. ఖదీర్తోపాటుగా ఇలాంటి పలువురు ఖైదీలకు ఊరట కలిగే విధంగా ప్రభుత్వ గైడ్‌లైన్స్ రూపొందించినట్లు సమాచారం. -
త్వరలో 7 వేల ఖాళీల భర్తీ
హోంశాఖలో 14 వేల ఖాళీలున్నాయి: చినరాజప్ప సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర హోం శాఖలో 14 వేల ఖాళీలున్నాయని, త్వరలో 7 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆయన బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఖాళీల భర్తీ ఫైలు ముఖ్యమంత్రి వద్ద ఉందని, త్వరలో దానికి ఆమోదం లభిస్తుం దని తెలిపారు. హోంగార్డులకు జీతాలు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వర్సిటీల్లో ర్యాగింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. -
హోం శాఖకు రూ.3,739 కోట్లు
వాహనాల కొనుగోలుకు రూ. 100 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హోం శాఖకు 2014-15 బడ్జెట్లో ప్రభుత్వం రూ.3,739 కోట్లు కేటాయించింది. ఇందులో కొత్త రాష్ట్రంలో పోలీసు శాఖ వాహనాలు ఖరీదు చేయడానికి రూ.100 కోట్లు ఇచ్చింది. కొత్తగా పోలీసు స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణము, ప్రస్తుతం ఉన్న వాటిని అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లు అవసరమని ప్రతిపాదించగా కేవలం రూ.12 కోట్లు కేటాయించింది. డీజీపీకి రూ.121.8 కోట్లు, జైళ్ల శాఖకు రూ.20 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.7.96 కోట్లు, సైనిక సంక్షేమ శాఖకు రూ.7.56 లక్షలు, ఏపీ పోలీసు అకాడెమీకి రూ.3.52 కోట్లు, గ్రేహౌండ్స్‌కు రూ.1.25 కోట్లు కేటాయించారు.