వీడు సామాన్యుడు కాడు..!
► అనుచరులతో ఫోన్‌లో టచ్‌లో ఉన్న చింటూ
► కడప నుంచి చిత్తూరుకు నిత్యం ఫోన్లు
► కోర్టు బాంబు పేలుడులో కొత్త కోణం
► బాంబు’ ఘటనపై రాష్ట్ర హోంశాఖకు చింటూ లేఖ
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ తన అనుచరులతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నాడా..? జిల్లా కోర్టుల సముదాయంలో జరిగిన బాంబు పేలుడులో తనను ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చింటూ రాష్ట్ర హోంశాఖకు లేఖ రాశాడా..? ఇలాంటి పలు ప్రశ్నలకు పోలీసుల నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా చిత్తూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడు ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు దిమ్మతిరిగే వాస్తవాలు గుర్తించారు.
కేసు బదిలీ చేసుకోవడానికేనా..?
గత నెల 7న చిత్తూరులోని జిల్లా కోర్టుల సముదాయంలో బాంబు పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో పోలీసులు ప్రధానంగా చింటూనే అనుమానిస్తున్నారు. జంట హత్యల కేసులో చింటూ ప్రధాన నిందితుడిగా ఉండడం, కోర్టులో కేసు విచారణ వేగంగా జరుగుతుండడంతో కేసును ఇతర జిల్లాల కోర్టుకు బదిలీ చేసుకోవడానికి ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తొలుత పోలీసులు చిత్తూరు కోర్టు పరిధిలో ఉన్న పలు సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ల టవర్ల నుంచి బాంబు పేలుడు జరిగిన రోజున 20 నిముషాల అవుట్ గోయింగ్, ఇన్‌కమింగ్ ఫోన్‌కాల్స్ జాబితాను తీసుకున్నారు. ఇందులో చింటూ అనుచరులకు వచ్చిన కొన్ని నంబర్లపై ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.
తమ బాస్ అప్పుడప్పుడు ఫోన్‌లో టచ్‌లోకి వస్తున్నారని వారు వివరించారు. పోలీసులు కడప కేంద్ర కారాగారానికి వెళ్లి విచారించారు. అక్కడి జైలు అధికారులు అలాంటిదేమీ లేదని కొట్టేపారేసినా పోలీసులకు పక్కా సాక్ష్యాలు సాధించారు. చింటూ కళాశాలలో పనిచేసిన ఓ అధ్యాపకుడు, మేయర్ దంపతుల హత్య కేసులో ఇటీవల బెయిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు, చిత్తూరు జైలులో ఉన్న మరో నిందితుడితో చింటూ ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు.
బాంబు పేల్చింది వీళ్లే..
కోర్టులో పేలిన బాంబు కారు తాళాలకు ఉన్న చిన్నపాటి రిమోట్‌తో పేల్చినట్లు దర్యాప్తులో తేలింది. ఇది పేల్చిన వాళ్లు పక్కా ప్రొఫెషనల్స్‌గా గుర్తించారు. నక్సలైట్, సాంకేతిక పరిజ్ఞానంపై అనుభవం ఉన్న వ్యక్తి, పోలీసు, ఆర్మీలో పనిచేసిన వాళ్లల్లో ఎవరైనా ఒకరు బాంబు పెట్టి, పేల్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మామూలు వ్యక్తులు ఎలక్ట్రానిక్ బోర్డు ద్వారా బాంబును పెట్టడం సాధ్యం కాదని చెబుతున్నారు.
చింటూ లేఖ...
కోర్టులో జరిగిన బాంబు పేలుడులో తనను ఇరికించాలని చూస్తున్నారని చింటూ రాష్ట్ర హోంశాఖ, చిత్తూరులోని న్యాయస్థానాలకు లేఖ రాశాడు. పేలుడుకు తనకు ఎలాంటి సంబంధంలేదని, పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసులో తన పేరు ప్రస్తావిస్తున్నారని అందులో పేర్కొన్నాడు.