చిన్నమ్మ మృతదేహం వద్ద మాధవ్, కుటుంబ సభ్యులు
బుచ్చిరెడ్డిపాళెం: తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ తల్లి గుండె ఆగిపోయింది. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెనుబల్లికి చెందిన నన్నెం మాధవ్ డీవైðఎఫ్‌ఐ మండల కార్యదర్శిగా ఉన్నారు. కాగా, నిరుద్యోగ సమస్యలపై బుధవారం ‘ఛలో విజయవాడ’ పేరిట డీవైఎఫ్‌ఐ కార్యక్రమం తలపెట్టింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లు మాధవ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. తాను విజయవాడకు వెళ్లడం లేదని, పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం ఏముందని ఆయన వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా తన తల్లి అనారోగ్యంతో ఉందని వారితో చెప్పడంతో కానిస్టేబుళ్లు ఎస్సైకు విషయాన్ని వివరించారు. దీంతో ఎస్సై ప్రసాద్‌రెడ్డి మంగళవారం రాత్రి పెనుబల్లికి వెళ్లి మాధవ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి బైండోవర్ చేశారు. కాగా, మాధవ్ తల్లి చిన్నమ్మ (60) ఏడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది.
మాధవ్ ఆర్‌ఎంపీ వైద్యుడు కావడంతో తన తల్లికి స్వయంగా వైద్యసేవలు అందిస్తున్నారు. తన కళ్లముందే కుమారుడ్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. వైద్యసేవలు కూడా అందకపోవడంతో చిన్నమ్మ గుండెపోటుతో మరణించింది. బుధవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి మాధవ్‌కు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను వదిలిపెట్టారు. ఇంటికెళ్లిన మాధవ్ విగతజీవిగా మారిన తన తల్లిని చూసి విలపించారు. సీపీఎం నేతలతో కలసి తన తల్లి మృతదేహంతో పెనుబల్లి రోడ్డుపై ధర్నాకు దిగారు.
పోలీసులు ప్రవర్తించిన తీరుపై సీపీఎం నేతలు మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ మాట్లాడుతూ ‘ఛలో విజయవాడ’కు వెళ్లడం లేదని చెప్పినా ఎస్సై ప్రసాద్‌రెడ్డి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించడం దారుణమన్నారు. తల్లి కళ్ల ముందు మాధవ్‌ను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మాధవ్‌తో అమానుషంగా వ్యహరించడంతోపాటు ఆయన తల్లి మృతికి కారకుడైన ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఎం నేతలు జొన్నలగడ్డ వెంకమరాజు, ముత్యాల గురునాధం, గండవరపు శ్రీనివాసులు, తాళ్ల వెంకయ్య, మన్నూరు భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment