అధికార పక్షం గుండెల్లో పిడుగులు కురిపిస్తూ ఒక్కో అడుగు ముందుకు సాగుతోంది. ఆ అడుగులకు ఆటంకాలు సృష్టించాలని ఎన్నో వ్యూహాలు... అయినా తడబడని ఆ పాదం ప్రభంజనంలా పదపదమంటూ పరుగులు తీస్తోంది. తూర్పున ఉదయించే సూర్యుడితో పోటీ పడుతూ ఈ నెల 12న అంటే మంగళవారం మంగళప్రదంగా రాజమహేంద్రవరం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో తొలి అడుగు పడనుంది. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్న అధికార యంత్రాంగం అడుగడుగునా అవరోధాలు కల్పించేందుకు అన్ని అవకాశాలనూ వెదుకుతోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మహోన్నత ఆశయంతో చేపడుతున్న బృహత్తర కార్యక్రమం ప్రజా సంకల్ప యాత్ర... స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి కష్టాలు విని...నేనున్నాంటూ భరోసా ఇచ్చే పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. బెదిరింపులకు దిగుతోంది. జగన్ పాదయాత్ర చేసే రహదారిలో ప్రజలు తిరగొద్దంటూ ఆంక్షలు విధిస్తోంది. ఈ నెల 12న జిల్లాకు వస్తున్న వైఎస్ జగన్ పాదయాత్రపై మరో కుట్రకు తెరలేపింది. ఈ మహత్తర ఘట్టానికి వేదికయ్యే రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి విషయంలో కుట్రలకు వ్యూహం పన్నుతోంది. బ్రిడ్జి పరిస్థితి సరిగా లేదని, పుట్‌ఫాత్, పారఫిట్ గోడలు బలహీన స్థితిలో ఉన్నాయని అభ్యంతరాలు సృష్టించే యత్నం చేసింది. ప్రత్యామ్నాయం చూసుకోవాలని పాదయాత్ర దగ్గర పడుతున్న సమయంలో గందరగోళం సృష్టించేందుకు వ్యూహరచన చేసింది.
పాదయాత్ర కోసం ఎదురు చూపులు...
జగన్ ఇప్పటికే ఎనిమిది జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. పశ్చిమ గోదావరి పాదయాత్ర రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 12న ఈ జిల్లాలో అడుగు పెట్టనుంది. ఆయన ఎప్పుడొస్తారా...తమ సమస్యలు చెప్పుకుందామని ఉత్సుకతతో ప్రజ లుండగా...
ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఉండేందుకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో కుట్రలకు తెర లేపుతోంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్రకు మహోన్నత వేదికగా, చారిత్రాత్మక ఘట్టంగా నిలిచే రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదిపింది.
బ్రిడ్జి బలహీనంగా ఉందని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని పాదయాత్రకు మూడు రోజుల ముందు గందరగోళానికి తెరలేపింది. అయితే, వైఎస్సార్ సీపీ నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మొక్కవోని దీక్షతో తమ అభిమాన నాయకుడి పాదయాత్ర కోసం పోలీసు యంత్రాంగానికి హామీ ఇచ్చి ఆ బ్రిడ్జిపై నుంచే పాదయాత్ర సాగేలా లైన్ క్లియర్ చేసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకుని, రెట్టింపు ఉత్సాహంతో పాదయాత్ర కోసం సమాయత్తమవుతున్నారు. జననేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గ్రాండ్ వెల్‌కమ్ చెప్పండి : తలశిల రఘురాం
చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలవబోతున్న రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై సాగే పాదయాత్రకు ‘తూర్పు’ ప్రజలు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం పిలుపునిచ్చారు. జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా సాగేలా శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ముందుకొస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాలన్నారు. ఆయన అడుగులో అడుగులేసి ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment