కిర్లంపూడిలో ఇంటర్నెట్ సేవలు బంద్!
కిర్లంపూడి: ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో తలపెట్టిన కాపు సత్యాగ్రహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. సత్యాగ్రహ అనుమతి నిరాకరించిన పోలీసులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. కోనసీమ, కిర్లంపూడిలో భారీగా పోలీసులను మోహరించారు. కర్ణాటక నుంచి ర్యాపిడ్ యాక్షన్ బలగాలను రంగంలోకి దించారు.
మీడియాపైనా పోలీసులు ఆంక్షలు విధించారు. సత్యాగ్రహ యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఆదేశించారు. కోనసీమ, కిర్లంపూడిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని సర్వీసు ప్రొవైడర్లకు సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ సత్యాగ్రహ యాత్ర చేపట్టాలని కాపు జేఏసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
కోనసీమలోని కాపులను ఆ రోజు రావులపాలెం చేరుకోకుండా చూడడమే కాకుండా జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి యాత్రకు వచ్చే కాపు నాయకులు, కార్యకర్తలు కూడా అడుగు పెట్టేందుకు వీలు లేకుండా పలుచోట్ల పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.