వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివరామరెడ్డి, పక్కనే సీఐ వేణుగోపాల్ (ఇన్‌సెట్‌లో హెచ్‌సీ రామయ్య)
సాక్షి, కాశీబుగ్గ: క్షణికావేశానికి లోనై ఓ మహిళ అర్ధరాత్రి వేళ రైలు పట్టాలపైకి చేరుకుంది. దీన్ని ఓ అపరిచిత వ్యక్తి గమనించి సంకోచించకుండా వెంటనే 100 కాల్‌కు ఫోన్ చేశాడు. అప్పుడే విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు సమాచారం చేరడంతో నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకుని ఆమెను ప్రాణాలతో రక్షించాడు. ఈ ఘటన పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ తాళభద్ర రైల్వేగేట్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అత్యవసర సమయంలో 100 కాల్ చేస్తే విలువైన ప్రాణాలు కాపాడవచ్చని ఈ ఘటన నిరూపించింది.
కాశీబుగ్గ పోలీసు డివిజన్ కార్యాలయంలో గురువారం కాశీబుగ్గ డీఎస్పీ ఎన్ శివరామరెడ్డి ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు తన భర్తతో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపైకి చేరుకుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 3వ వార్డులో తాళభద్ర రైల్వేగేట్ సమీపంలో అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడింది. దీన్ని గమనించిన ఓ అపరిచిత వ్యక్తి వెంటనే 100కు డయల్ చేసి విషయం చెప్పాడు. తక్షణమే కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందడంతో కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలిలో రాత్రి విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామయ్య నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.
అయితే భువనేశ్వర్ నుంచి వైజాగ్ వైపు వెళ్లే ఈస్టుకోస్టు రైలు రావడం ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో ఆ మహిళను రక్షించగలిగారు. లేదంటే ప్రాణాలు పోయి ఉండేవి. అనంతరం కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. ఆపద సమయంలో డయల్ 100 సేవలను ప్రజలకు వినియోగించుకోవాలని డీఎస్పీ తెలిపారు. ఈమెను ప్రాణాలతో రక్షించినట్లుగా హెడ్ కానిస్టేబుల్ రామయ్య విషయం తెలియడంతో ఎస్పీ అమ్మిరెడ్డి రూ.5 వేలు రివార్డు ప్రకటించి అభినందనలు తెలిపారు. 100 కాల్ చేసిన వ్యక్తిని సైతం అభినందించారు. అయితే ఆయన వివరాలు ఇంతవరకు పోలీసులకు తెలియరావడం లేదు. ఈ సమావేశంలో కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment