
క్రీడలతో పోలీసులకు మనోస్థైర్యం: బి.ప్రసాదరావు
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో తీరికలేకుండా ఉండే పోలీసులకు, భద్రతా సిబ్బందికి క్రీడలు మానసిక స్థైర్యాన్ని కలిగిస్తాయని డీజీపీ బి.ప్రసాదరావు అన్నారు. బుధవారమిక్కడి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మైదానంలో బీఎన్ మాలిక్ స్మారక 62వ అఖిలభారత పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్-2013 పోటీలను ఆయన ప్రారంభించారు. పోలీసులు, పారామిలటరీ జవాన్లు సంఘవిద్రోహక శక్తులను ఎదుర్కొంటుంటూ దేశ సమగ్రతకు పాటుపడుతున్నారని, వారికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని డీజీపీ చెప్పారు.
ఈ నెల 22న ముగిసే ఈ ఫుట్‌బాల్ పోటీల్లో వివిధ రాష్ట్రాల పోలీసు టీమ్‌లు, పారామిలటరీ బలగాలకు చెందిన వెయ్యిమంది క్రీడాకారులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. పోటీల ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథిగా దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్ మిట్టల్ హాజరయ్యారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చైర్మన్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్ పచర్వాల్, హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ సంజయ్‌కుమార్, రాష్ర్ట పోలీసు క్రీడా విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది తదితరులు పాల్గొన్నారు.