పొలిటికల్ ఎండ్ | Political End | Sakshi
Sakshi News home page

పొలిటికల్ ఎండ్

Published Wed, Mar 12 2014 2:29 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM

Political End

సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల వ్యూహంలో దిట్టగా పేరుగాంచిన మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడింది. మైదుకూరు నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన పలు మార్లు మంత్రిగా చేశారు.
 
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అంతటి నేతకు సైతం రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వెరసి రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1978లో ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ వ్యూహాల్లో ఆరితేరారు. తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 335 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
 
 ఆ తర్వాత 1983, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రివర్గంలో  రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ జిల్లా గ్రూపు రాజకీయాల్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గీయుడిగా డీఎల్ రవీంద్రారెడ్డికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. అయితే పదవి కోసం దివంగత నేత వైఎస్సార్‌ను తూలనాడటంతోనే రాజకీయ ఉన్నతి నుంచి క్రమేపి కనుమరుగు అవుతూ వచ్చారని పరిశీలకుల అంచనా.
 
 రాజకీయంలో ఎత్తు పల్లాలు...
 1978 ఎన్నికల్లో 335 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన డీఎల్ తన రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనే చెప్పవచ్చు. 1994 ఎన్నికల్లో ఓటమి అంచులకు వెళ్లిన ఆయన స్వల్పంగా 28 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అత్యధికంగా 1989లో 33,358 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మైదుకూరులో ప్రతి ఎన్నికల్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభావం డీఎల్‌కు కలిసి వచ్చేదని విశ్లేషకులు పేర్కొనేవారు. అయితే 2009 సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆకస్మికంగా మృతి చెందారు.

అనంతరం ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన ఆయన ప్రతి సందర్భంలోను విమర్శిస్తూ వచ్చారు. ఈ పరిణామం రాజకీయంగా జవసత్వాలు కోల్పోవాల్సిన స్థితికి తీసుకొచ్చిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అందులో భాగంగానే 2011 మే8న కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన డిపాజిట్ లాస్ అయ్యారు. ఈ అంశం డీఎల్ రాజకీయ జీవితంలో చెరగని మచ్చగా పలువురు పేర్కొంటున్నారు.
 
 అవకాశం వస్తే కూకట్‌పల్లిలో పోటీ...
 మరో ఛాన్సు దక్కితే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి డీఎల్ తన అనుచరులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు పోటీ చేయాల్సివస్తే కూకట్‌పల్లి నుంచే పోటీ చేస్తానని, మైదుకూరులో పోటీ చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నిర్వహిస్తానని వివరించినట్లు తెలుస్తోంది. మరో అవకాశం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
 
 ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి...
 ఇంతకాలం పరస్పర సహకారంతో పయనించాం. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పటి రాజకీయాల్లో కొనసాగలేను. ఇకపై నా మనుగడ కష్టసాధ్యం. మీ సహకారానికి కృతజ్ఞతలు. రాజకీయంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ మంగళవారం మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు సమాచారం. ఖాజీపేటలో ఈనెల 5న కార్యకర్తల సమావేశం పెట్టిన ఆయన అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఖాజీపేటకు చేరుకోవడంతో పలువురు అనుచరులు వెళ్లి కలిశారు. ఇకపై మైదుకూరులో పోటీ చేసేది లేదంటూ తేల్చి చెప్పినట్లు తెలిసింది. మీరంతా మీ రాజకీయ ఉన్నతికి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపండని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
 
 ఆ మేరకు ఎవరి రాజకీయదారులను వారు ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా దువ్వూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది. మాజీ జెడ్‌పీటీసీ సభ్యుడు గుడిపాడు బాబు, మాజీ సర్పంచ్‌లు వెంకటేశ్వరరెడ్డి (భీమునిపాడు), రామచంద్రారెడ్డి (జొన్నవరం), రామసుబ్బారెడ్డిలతో బాటు మరో 10 పంచాయతీల్లో కాంగ్రెస్ నేతలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు పొందిన డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ చాప్టర్‌కు తెర పడిందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement