కుర్చీలాట! | political leaders agitation about seats | Sakshi
Sakshi News home page

కుర్చీలాట!

Published Wed, Feb 5 2014 3:52 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

political leaders agitation about seats

మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: రాజకీయ నాయకులు కుర్చీకోసం కొట్లాడం విన్నాం.. కా నీ పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయినులు కూడా కుర్చీకోసం కొట్లాడుతున్నారు. కుర్చీ నాదంటే నాదంటూ ఆధిపత్యపో రు రగులుతోంది. పాత మేడం ఆడుకోమ్మని చెబితే..కొత్తమేడం చదువుకోమ్మని చెబుతోంది. ఇదీ ప్రస్తుతం కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో జరుగుతోన్న తతంగం. విద్యాలయాల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారుల(ఎస్‌ఓ)ను నియమించారు. జిల్లాలో 65 కస్తూర్బా విద్యాలయాల్లో 6 నుంచి 10 తరగతి వరకు 11,955 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించడంతో వృత్తివిద్యతో కూడిన శిక్షణను అందిస్తున్నారు.
 
 ప్రా రంభం నుంచి కొంతమంది టీచర్లకు డిప్యూటేషన్‌పై ఎస్‌ఓలుగా నియమించారు. అదేవిధంగా పదవి విరమణ పొందిన, గెజిటెడ్ హెచ్‌ఎంలకు ఎస్‌ఓలుగా అవకాశం ఇచ్చారు. గతేడాది కొత్తగా ఎ స్‌ఓలను నియమించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన పరీక్షలో 65 మంది ఎస్‌ఓలుగా ఎంపికయ్యారు. కాగా, పాతవారిని రిలీవ్ చేయకుండానే ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. పైగా పాతవారు 9,10 తరగతులు బోధిస్తూ అక్కడే ఉండాలని ఆదేశాలిచ్చారు.
 
 కానీ పాత ఎస్‌ఓలు తాము విధుల నుంచి వెళ్లేదిలేదని కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. విద్యాలయాలను ప్రస్తుతం పాతవారే నిర్వహిస్తున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించుకున్న ఎస్‌ఓలకు ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. పెద్దమందడి, తలకొండపల్లి, కొల్లాపూర్‌లలో పాత ఎస్‌ఓలే విధులు నిర్వహిస్తున్నారు. అలంపూర్, మానవపాడు, కొత్తూరులో మాత్రమే కొత్త ఎస్‌ఓలు విధులు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మిగతా 60 కస్తూర్బాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
 
  ఖిల్లాఘనపురం కస్తూర్బా విద్యాలయంలో 180 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ప్రారంభం నుంచి ఎస్‌ఓగా అభిషేకమ్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మరో ఎస్‌ఓ ప్రశాంతిని అధికారులు నియమించారు. కొత్త అధికారి వచ్చిననాటి నుంచి అసలు కథ ప్రారంభమైంది. ఓ మేడం ఆడుకోమని చెబితే మరో మేడం చదువుకోమ్మని చెబుతున్నారు. గతకొన్ని రోజులుగా వీరిద్దరు వేర్వేరు గదుల్లో కుర్చీలు విధులు నిర్వహిస్తున్నారు. ఒకరంటే మరొకరి పడటం లేదు. దీంతో  ఇద్దరి మధ్య విద్యార్థినులు నలిగిపోతున్నారు.
  మిడ్జిల్ కస్తూర్బా విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు ఉన్నారు. గతేడాది నుంచి వెల్దండ మండలం పెద్దపూర్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న జయకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇదిలాఉండగా, గతనెల రోజుల క్రితం రోజా అనే ప్రత్యేకాధికారికి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు.
 
 కానీ జయకు మాత్రం రిలీవ్‌ఆర్డర్ ఇవ్వలేదు. తానే ప్రత్యేకాధికారిని అంటూ కొత్త అధికారిణి కుర్చీలో కూర్చోగా, పాత అధికారిణి కూడా తనకు ఇంకా రిలీవ్‌ఆర్దర్ రాలేదని మొండికేసి కూర్చున్నారు. విద్యాలయంలో రికార్డులను నేటికీ అప్పగించకపోవడంతో కొత్త అధికారిణి అందులో పనిచేసే సిబ్బందిచేత కొత్త రిజిస్టర్‌లో సంతకాలు పెట్టిస్తున్నారు. పాత ప్రత్యేకాధికారి మరో రిజిస్టర్‌లో సంతకాలు చేయిస్తున్నారు.
 
 ఏజేసీ ఏమన్నారంటే.. ఆర్వీఎం ఇన్‌చార్జి పీఓ, ఏజేసీ డాక్టర్ రాజారాంను వివరణ కోరగా.. ఘనపూర్ సంఘటన దృష్టికి వచ్చిందని పాతవారిని తొలగించి కొత్తవారిని నియమించాలనే ఉద్దేశంతోనే కొత్తవారిని నియమించాం. కానీ కోర్టు నుంచి పాతవారు స్టే తెచ్చుకోవడం వల్ల ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఘనపూర్‌లో పాత ఎస్‌ఓ కొత్త ఎస్‌ఓకు చార్జీ ఇచ్చి మళ్లీ ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. సమన్వయంతో పనిచేయాలి.
 
 రోడ్డెక్కిన కేజీబీవీ విద్యార్థినులు
 ఖిల్లాఘనపురం : ఇద్దరు ప్రత్యేకాధికారుల మధ్య నలిగిపోతున్నామని, ఎవరి మాట వినాలో తెలియక సతమతమవుతున్నామని స్థానిక కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులు మంగళవారం రోడ్డెక్కారు. ప్లకార్డులు చేతబూని నిరసనకు దిగారు. టిఫిన్‌చేయకుండా తమ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థునులు తమ ఆక్రందనను వెళ్లగక్కారు. పాఠశాల ప్రారంభం నుంచి ఎస్‌ఓగా అభిషేకమ్మ ఉన్నారని, ఇటీవల మరో ఎస్‌ఓగా ప్రశాంతి వచ్చారని తెలిపారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పాఠశాలలో గొడవలు ప్రారంభమయ్యాయని వాపోయారు.
 
 ‘పాత ఎస్‌ఓ కూర్చోమంటే కొత్త ఎస్‌ఓ నిల్చోమంటారు. ఒకరు ఆడుక్కోమంటే మరొకరు వద్దంటున్నారు. ఎవరిమాట వినాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం’ అని పలువురు కన్నీరుపెట్టారు. కొత్త ఎస్‌ఓ తమపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పాత ఎస్‌ఓను కొనసాగించాలని కోరారు. పరీక్షలు దగ్గరపడుతున్నాయని, తమను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తిచేశారు. తహశీల్దార్ రమేష్, ఏఎస్‌ఐ ప్రేమ్‌రాజ్‌లు విద్యార్థినుల వద్దకు చేరుకుని వారికి నచ్చజెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement