సాక్షి, ఒంగోలు : రాజకీయ వాతావరణం వేడెక్కింది. సార్వత్రిక (లోక్‌సభ, శాసనసభ) ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. జిల్లాలో రెండు మున్సిపాల్టీలు, నాలుగు నగర పంచాయతీల్లో రాజకీయ హడావుడి మొదలవగా, తాజాగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌తో గ్రామాల్లో రాజకీయ చర్చలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో అలుపెరగని ఉద్యమాలు నడిపించిన నేతలకు కాస్తంత విశ్రాంతి దక్కకుండానే, ఎన్నికల ‘తంతు’ భారం భుజాలకెక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం.. జిల్లాలో ఏప్రిల్ 12వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 19వ తేదీతో గడువు పూర్తవుతుంది. 21న నామినేషన్ పత్రాల పరిశీలన, 23వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణతో బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారవనుంది. ‘మే’ నెల ఏడో తేదీన ఎన్నికలు నిర్వహించి..ఫలితాలను అదేనెల 16న వెల్లడించనున్నారు. ఒకపక్క మున్సిపాల్టీలు..మరోపక్క లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీలతో సమానంగా జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.
కాంగ్రెస్, టీడీపీ డీలా..
2009 ఎన్నికల్లాగానే ఈసారీ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించి, ప్రజలతో మమేకమవుతూ దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ మాత్రం క్షేత్రస్థాయిలో ‘ఉనికి’ని ఆరాతీసే ప్రయత్నాల్లోనే ఉండటం గమనార్హం. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయస్ఫూర్తిగా ఆవిర్భవించిన వైఎస్సార్ సీపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న కొద్దీ.. టీడీపీ, కాంగ్రెస్ నేతలపై వ్యతిరేకత సైతం పెరుగుతూ ఉంది.
రాష్ట్ర విభజన విషయంలో ఆ రెండు పార్టీల ద్వంద్వవైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్సార్ సీపీ నేతలు సఫలీకృతులయ్యారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. నేడు మూడోస్థానానికి దిగజారిపోవడమే ఇందుకు నిదర్శనంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీడీపీది దాదాపూ అదే పరిస్థితి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని జిల్లా ప్రజలు ఛీత్కరిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఏదో ఒక కార్యక్రమం పేరిట ప్రజలముందుకెళ్లిన టీడీపీ నేతల్ని ఏహ్యభావంతో చూస్తున్నారని.. అధినేత నిర్ణయాలు స్థానిక నేతలకు తలనొప్పిగా మారుతున్నాయని ఆపార్టీ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి.
అభ్యర్థుల ఎంపికపై మల్లాగుల్లాలు:
జిల్లావ్యాప్తంగా అన్నిచోట్లా కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి ముందునుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది. అభ్యర్థుల ఎంపిక కానాకష్టమైంది. కొన్నిచోట్ల నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జులే కరువైన ఆ రెండు పార్టీలకు సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. ఈవిషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించి.. ఎక్కడికక్కడ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించుకుంది. వివిధ అంశాల ఆధారంగా అభ్యర్థుల జాబితా కొద్దిరోజుల్లోనే ఖరారు చేయనున్నారు.
2009 ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో ఈసారి చాలామంది బరినుంచి తప్పుకుంటారనేది రాజకీయ వర్గాల అంచనా. మొత్తం 12 నియోజకవర్గాల్లో అప్పట్లో పది స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. ఇప్పటికే ఆపార్టీ నుంచి ముగ్గురు (అద్దంకి, దర్శి, ఒంగోలు) ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీకి వచ్చారు. మరో ఏడుగురు ఎమ్మెల్యేల్లో..ప్రస్తుతం ఏఒక్కరూ కాంగ్రెస్ తరఫున పోటీకి సిద్ధంగా లేరని సమాచారం. వారు పక్కపార్టీల్లో చేరేందుకు శతవిధాల ప్రయత్నిస్తుండగా..ఒకరిద్దరికి టీడీపీ అధినేత నుంచి ఫోన్‌లు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, మహీధర్‌రెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బీఎన్ విజయకుమార్, జీవీ శేషు, ఉగ్ర నరసింహారెడ్డి, ఆదిమూల సురేష్‌ల రాజకీయ భవితవ్యం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది.
మరోవైపు మార్కాపురం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా, గిద్దలూరు నుంచి అప్పట్లో పీఆర్పీ తరఫున గెలిచి..కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు సైతం పక్కపార్టీల వైపు చూస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువై.. టీడీపీ మాత్రం ప్రజల విశ్వసనీయత చూరగొనే అభ్యర్థులు దొరక్క డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మారుతోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్నివిధాలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్లు మొగ్గుచూపుతున్నారని.. మున్సిపల్, లోక్‌సభ, శాసనసభ స్థానాలన్నింటినీ ఆపార్టీ కైవసం చేసుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు.
నిన్న ‘స్థానికం’.. నేడు ‘సార్వత్రికం’
Published Thu, Mar 6 2014 3:04 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement