కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రెవెన్యూ అధికారుల బదిలీల్లో పైరవీల మార్కు కనిపిస్తోంది. పాలన వ్యవహారాలన్నీ తమ కనుసన్నల్లో కొనసాగాలన్న అధికార పార్టీ నేతల ఆరాటం అధికారుల బదిలీల్లో పైరవీలకు తావిస్తోంది. చెప్పినమాట వినేవారికే పోస్టింగ్ ఇప్పించేందుకు వీరు జిల్లా యంత్రాంగాన్ని శాసిస్తున్నారు. డిమాండ్ ఉన్న పోస్టులు కోరుకునే అధికారులు సైతం ఆ పోస్టు దక్కించుకునేందుకు రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. నేతల కోరికలు, అధికారుల అవసరాలకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుండడంతో ఉద్యోగుల బదిలీల్లో పైరవీలే రాజ్యమేలుతున్నాయి.
సీనియారిటీ ప్రాతిపదికన జరిగిన బదిలీల్లో కూడా రాజకీయ ఒత్తిళ్లు మితిమీరుతున్నాయి కలెక్టర్‌గా వీరబ్రహ్మయ్య బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి నిర్వహించిన తహశీల్దార్ల బదిలీల్లో పైరవీలకు అవకాశం కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 11 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ శనివారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో మూడు నెలల క్రితమే బదిలీ అయిన వారితోపాటు ఇతర అధికారులకు కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చారని రెవెన్యూ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఏ క్షణమైనా తహశీల్దార్లను బదిలీ చేసే అధికారం కలెక్టర్‌కు ఉన్నప్పటికీ కొత్తగా ఇచ్చిన పోస్టింగ్‌లు చూస్తే సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
మూడు నెలల క్రితమే బదిలీ అయిన పద్మయ్య, ఈశ్వర్, శంకరయ్యను మళ్లీ బదిలీ చేయడం, మంచి పోస్టులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రామగుండం తహశీల్దార్‌గా ఉన్న బైరం పద్మయ్య గంగాధర తహశీల్దార్‌గా బదిలీ అయ్యారు. మూడు నెలలు తిరగకముందే ఈయనను గంగాధర నుంచి మళ్లీ రామగుండంకు బదిలీ చేయడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. మహదేవపూర్ తహశీల్దారుగా ఉన్న నర్సయ్య మంత్రి శ్రీధర్‌బాబుకు అనుకూలంగా లేకపోవడం వల్లే బదిలీ అయ్యారని చర్చించుకుంటున్నారు. ఏ రాజకీయ నేతతో చెప్పించుకోకపోవడం వల్లే సుల్తానాబాద్ తహశీల్దార్ మధుసూదన్‌ను దూరంగా ఉన్న మహదేవపూర్‌కు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. అధికార పార్టీ నేతతో చెప్పించుకోవడం వల్లే సారంగపూర్ తహశీల్దార్‌కు వేరే చోట పోస్టింగ్ దక్కినట్లు తెలుస్తోంది.
రాజకీయ బదిలీలు
Published Mon, Sep 2 2013 5:46 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement