సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కర్నూలు జిల్లా కాంగ్రెస్, టీడీపీ నేతలను కలవరపెడుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న పరిణామాలతో ఇరు పక్షాలకు చెందిన కొందరు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. రెండు పార్టీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉండటంతో వారు తీవ్ర గందరగోళానికి గురువుతున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో వారు తమ రాజకీయ భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలా అని మధన పడుతున్నారు. పార్టీ మారితే ఎలా ఉంటుంది.. లేకుంటే పరిస్థితి ఏమిటి అనే అంశంపై అనుభవజ్ఞులై రాజకీయ నేతల సలహాలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేక తెలంగాణాకు అధికార కాంగ్రెస్ ఓకే చెప్పటం జిల్లాకు చెందిన ముఖ్యనాయకులను సంకటస్థితిలోకి నెట్టింది. అదే విధంగా అధికార కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించని ప్రతిపక్ష టీడీపీ నేతల పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది.
ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీ నేతలు ఎటువైపు అడుగులు వేయాలో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు. దీంతో విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ అందులో పాల్గొనలేకపోయారు. ఉద్యమకారులకు కనీసం మద్దతు తెలియజేయటానిక్కూడా సాహసించలేదు. ఉద్యమంలో పాల్గొంటే తమ అధినేత చంద్రబాబు ఆగ్రహానికి గురవుతామని తెలుగు తమ్ముళ్లు దూరంగా ఉండిపోయిన విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్టు అధినేత బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని భావిస్తున్నారనే వార్తలు జిల్లా టీడీపీ నేతలను మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. అదే జరిగితే ముస్లిం మైనర్టీలు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలో తమ పార్టీ దెబ్బతినే అవకాశం లేకపోలేదని వారి ఆవేదన. దీనితో టీడీపీకి చెందిన ముఖ్యనేతలు కొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ నేతల వింత ఆలోచన: పార్టీలో ఉంటే భవిష్యత్ లేదని టీడీపీ నేతలు భావిస్తుంటే.. అధికార కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యనేతలు నలుగురు టీడీపీ వైపు చూస్తున్నారు. వారు నలుగురూ ఎమ్మెల్యేలే కాగా వారిలో ఇద్దరు కీలకవ్యక్తులు కావడం విశేషం. విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్‌లో ఉంటే తమకు భవిష్యత్ లేదని ఆ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఓ ముఖ్యనేతైతే ‘కాంగ్రెస్ నాశనమైపోతుంది’ అని శపించారు కూడా. వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకుని వచ్చే ఎన్నికల్లో పోటీచేసి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. దీనితో వీరు టీడీపీలోని ముఖ్యనాయకులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే ఇన్నాళ్లూ తాము కష్టపడి పార్టీకోసం శ్రమిస్తుంటే మధ్యలో వీరొచ్చి తమ సీట్లు ఎక్కడ తన్నుకు పోతారోనని వీరి రాకను కొందరు టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఇన్నాళ్లు జెండాను మోసిన తమను పక్కనపెట్టి విభజన పాపానికి కారకులైన వారిని పార్టీలోకి తీసుకొస్తే డైలమాలో ఉన్న తామంతా పార్టీ మారక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
కార్యకర్తలైతే విభజన ద్రోహులైన కాంగ్రెస్ నేతలు పార్టీలోకి వస్తే అస్సలు క్షమించేది లేదని తేల్చిచెపుతున్నారు.ఇలా ఇరు పార్టీల పెద్దల ఎత్తుగడలను పరిశీలిస్తున్న కింది స్థాయి కేడర్ మాత్రం ఎవరు ఎటువైపు వెళ్లినా విభజన ప్రకటన చేసిన కాంగ్రెస్‌ను, అందుకు మద్దతు లేఖ ఇచ్చిన టీడీపీ ద్రోహులను క్షమించేది లేదని కుండబద్దలుగొడుతున్నారు. దీనితో జంపింగ్ బాబుల పరిస్థితి ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కు వెళ్తే నుయ్యిలా మారింది.