33 రోజుల సమ్మె కాలపు పనిదినాలు సర్దుబాటు
సెలవు దినాల్లో పని చేసేందుకు టీచర్ల అంగీకారం
వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం
ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి సమావేశం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలోని ఉపాధ్యాయులు సెలవు దినాల్లో పనిచేస్తారు. సంక్రాంతి సందర్భంగా ఇచ్చే ప్రధాన సెలవులతోపాటు ఇతర సెలవు దినాలు కూడా వారికి రద్దు కానున్నాయి. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సెలవు దినాల్లోనూ స్కూళ్లు పని చేస్తాయి. ఇందుకు ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు అంగీకరించారు. దీంతో వారు సమ్మె చేసిన కాలానికి కూడా వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. శుక్రవారం సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి సమక్షంలో జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో 13 జిల్లాల్లోని టీచర్లు పని చేయాల్సిన సెలవు దినాల వివరాలు, సమ్మె కాలానికి వేతనాల చెల్లింపు వంటి అంశాలతో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సెకండరీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ జిల్లాల్లోని టీచర్లు సకల జనుల సమ్మెలో పాల్గొన్న సమయంలోనూ ప్రభుత్వం ఈ విధంగానే చేసింది. సిలబస్ పూర్తి చేసేందుకు సెలవు దినాల్లో పని చేసినందుకు గాను వారు సమ్మెలో పాల్గొన్న రోజులకు వేతనాలు చెల్లించింది. ప్రస్తుతం సీమాంధ్ర టీచర్లకు కూడా అదే విధానం అమలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో సీమాంధ్రలోని ఉపాధ్యాయులు దాదాపు 50 రోజులపాటు సమ్మె చేశారు. ఇందులో 33 రోజులు పాఠశాలల పని దినాలు ఉన్నాయి. ప్రస్తుతం సమ్మె విరమించిన టీచర్లు రెండో శనివారం, ఆదివారాల్లో పని చేయనున్నారు. అలాగే డిసెంబర్ 24 నుంచి 2014 జనవరి 2 వరకు మిషనరీ పాఠశాలలకు క్రిస్‌మస్ సెలవులు ఉన్నాయి. క్రిస్ట్టియన్ యాజమాన్య పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలకు జనవరి 8 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులున్నాయి. డిసెంబరు 25న క్రిస్‌మస్ రోజున, సంక్రాంతి పండుగ రోజున మాత్రమే సెలవు ఇస్తారు. మిగితా రోజులన్నీ పని చేయాల్సిందే. మొత్తానికి మార్చి 9వ తేదీలోగా ఈ 33 రోజులను సర్దుబాటు చేస్తారు.
తాత్కాలికంగా సమ్మె విరమణ
సీమాంధ్ర జిల్లాల్లోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీవైఎస్సార్‌టీఎఫ్) స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఓబుళపతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అందుకే సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు.
సీమాంధ్ర టీచర్లకు సంక్రాంతి సెలవులు రద్దు!
Published Sat, Oct 12 2013 1:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement