pongal holidays
-
పుట్టినగడ్డ వీడి.. పుట్టెడు దుఃఖం మిగిల్చి..
పండుగ నవ్వులు వారి పెదవులపై ఇంకా చెదిరిపోలేదు.. అందరూ ఒక్క చోట చేరిన వేళ పంచుకున్న తల్లీబిడ్డల మమకారం, అక్కా చెల్లెళ్ల అనురాగం మాసిపోలేదు. మిత్రులు, కుటుంబ సభ్యుల కోలాహలం వారిని వీడిపోలేదు.. మూడు రోజుల తర్వాత సంక్రాంతి సంబరాలను గుండెల్లో పదిలంగా దాచుకుని బాధ్యతలు పెంచిన దూరాలకు పయనమయ్యారు నరసరావుపేటకు చెందిన అన్నదమ్ముల కూతుళ్లు. సొంత గడ్డపై నుంచి బయలుదేరి 24 గంటలు తిరగకుండానే తెలంగాణలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులయ్యారు. ముచ్చటైన వేడుకల్లో మునిగిన కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచెత్తారు. ఆ కుటుంబ సభ్యులంతా ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. విద్యాభ్యాసం, ఉద్యోగాల కోసం కర్ణాటక, పూణె ప్రాంతాల్లో ఉంటున్నారు. సంక్రాంతి పర్వదిన వేడుకలు జరుపుకునేందుకు సొంత ఊరైన నర్సరావుపేటకు వచ్చారు. ఐదు రోజులపాటు పట్టణంలోనే ఆనందోత్సాహాల నడుమ పండగను జరుపుకున్నారు. గురువారం ఉదయం ఇంటి నుంచి తమ సొంత కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరో గంటలో ఇంటికి చేరుకుంటామనగా బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబళించింది. మరో ముగ్గురిని ఆస్పత్రిపాలు చేసింది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చౌటుప్పల్(మునుగోడు)/ నరసరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కట్ట పద్మజ (49) అక్కడే ఎస్ఎస్ఎన్ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈమె కుమారుడు రామచంద్రారెడి, కుమార్తె వాసంతి కర్ణాటకలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వీరితోపాటు పద్మజ, ఆమె బాబాయి కూతురు లక్ష్మీప్రియాంక (28) హైదరాబాద్ బయలుదేరారు. లక్ష్మీప్రియాంక పూణెలో పీడియాట్రిక్ చదివింది. అక్కడే ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమైంది. వీరందరూ కలిసి కారులో బయలుదేరారు. పిల్లలు ముగ్గురిని హైదరాబాద్ నుంచి పంపించేందుకు పద్మజ డ్రైవర్ కృష్ణారెడ్డి(27)ని తీసుకొని వస్తున్నారు. లక్ష్మీప్రియాంక విమానంలో పూణెకు, వాసంతి, రాంచంద్రారెడ్డిలు బస్సులో కర్ణాటకకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చి సాయంత్రం వరకు బంధువుల ఇంట్లో ఉండి సాయంత్రం పిల్లలను పంపించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వారంతా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైకును తప్పించే క్రమంలో.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి 25 మంది ప్రయాణికులతో మిర్యాలగూడకు బయలుదేరింది. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళ్తున్న మరో బస్సు వెనుక నుంచి ఈ బస్సు వెళ్తుంది. ఇదే సమయంలో పంతంగి గ్రామ స్టేజీ వద్ద ఓ ద్విచక్ర వాహనం ఒక్కసారిగా బస్సులకు అడ్డుగా వచ్చింది. ముందున్న బస్సు బైకును తప్పించుకుని వెళ్లాడు. వెనుక ఉన్న ఈ బస్సుకు తప్పించే అవకాశం లేకపోవడంతో చేసేదేమి లేక డ్రైవర్ జావిద్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా జంక్షన్ నుంచి బస్సును అదే వేగంతో హైదరాబాద్ వెళ్లే మార్గంలోకి మళ్లిం చాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న కారు బస్సుకు ఢీకొట్టింది. బలంగా తగలడంతో కారు బస్సు కిందకు ఇరుక్కుపోయింది. అందులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదే వేగంతో రోడ్డు కిందకు దూసుకుపోయింది. బస్సులోని ప్రయాణికులు పూర్తిగా సురక్షితంగా బయటపడినప్పటికీ భయభ్రాంతులకు గురయ్యారు. ఐదుగురిలో ఇద్దరు దుర్మరణం ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారులో డ్రైవర్‌తోపాటు ముందు సీట్లో కూర్చున్న రామచంద్రారెడ్డిలతో పోలిస్తే వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. వారిని కారులో నుంచి బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నం చేసి క్రేన్ సాయంతో బయటకు తీశారు. హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించగానే పద్మజ మృతి చెందింది. మిగతావారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. వారిలో లక్ష్మిప్రియాంకను కామినేని ఆస్పత్రికి, మిగతా ముగ్గురుని సన్‌రైజ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స ప్రారంభించగానే కామినేని ఆసుపత్రిలో లక్ష్మిప్రియాంక సైతం మృతి చెందింది. మిగతా ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మిప్రియాంకకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త పూణేలో ఉద్యోగం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ రమేష్ ఏసీపీ రామోజు రమేష్, సీఐ వెంకటయ్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కారును క్రేన్ సాయంతో బస్సు కింద నుంచి తప్పించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పద్మజ భర్త శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీలో 12నుంచి సంక్రాంతి సెలవులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 22వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈమేరకు విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. -
సంక్రాంతి సెలవులు
పాఠశాలలకు 11 నుంచి.. జూనియర్ కాలేజీలకు 13 నుంచి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ఇంటర్మీడియెట్ కోర్సు నిర్వహించే కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులుంటాయని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సెలవుల్లో ప్రైవేటు యాజమాన్యాలు తరగతులు నిర్వహించడానికి వీల్లేదని, నిర్వహిస్తే కాలేజీ యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 16వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. -
నీటికుంటలో పడి చిన్నారుల దుర్మరణం
జగదేవ్‌పూర్: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారులు నీటికుంటలో పడి మృతిచెందారు. జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమరెల్లికి చెందిన ప్రేమ కుమార్ (17), అదే మండలం పెద్దరాజుపేటకు చెందిన రాహుల్(14) సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ ఊరైన చాట్లపల్లి వచ్చారు. ఇరువురు వరుసకు సోదరులు. ప్రేమ కుమార్ ఇంటర్ చదువుతుండగా... రాహుల్ 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం పొలంలో ఉన్న నీటికుంటలో దిగగా, లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. స్థానిక రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. -
రైళ్లు.. బస్సులు.. ఖాళీల్లేవ్ !
ప్రయాణాలపై సంక్రాంతి ప్రభావం టిక్కెట్లు అమ్మకాలు నిలిపేసిన ప్రైవేటు బస్ ఆపరేటర్లు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్‌లు తణుకు : సంక్రాంతికి ఊరు వెళదామనుకున్నా, యాత్రలకు వెళ్లాలనుకున్నా రిజర్వేషన్ చేయించుకునేందుకు వెళ్లే వారికి మాత్రం చుక్కెదురవుతోంది. ప్రధాన నగరాల నుంచి బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లలో బెర్తుల రిజర్వేషన్ పూర్తయిపోయింది. రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉండటంతో ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి కావడంతో తర్వాత ప్రయత్నించిన వారికి నిరాశే మిగులుతోంది. రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే బెర్తులన్నీ భర్తీ అవుతున్నాయి. మరోవైపు వెయిటింగ్ లిస్టు సైతం నిండిపోవడంతో ఒక్కో రైలులో నో రూం అని వస్తోంది. వేలాది మందిపై ప్రభావం జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా సుమారు 25 వరకు ముఖ్యమైన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాకు చెందినవారు ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్టణం, ముంబయి, చెన్నై వంటి నగరాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. సాధారణంగా రెండు, మూడు రోజుల పాటు వరుస సెలవులు వస్తేనే సొంతూరుకు రావాలని ఉవ్విళ్లూరుతుంటారు. సంక్రాంతికి ఈసారి విద్యాసంస్థలకు రెండు వారాలపాటు సెలవులు రావడంతో స్వస్థలాలకు చేరుకోవాలని పలువరు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన నగరాల నుంచి వచ్చే రైళ్లన్నీ నిండిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో ప్రధాన పట్టణాలైన ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నరసాపురం, నిడదవోలు పట్టణాల మీదుగా నిత్యం మూడు వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. పండగ సమయాల్లో అయితే ఈ సంఖ్య నాలుగు రెట్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే రైళ్లలో కనీసం టిక్కెట్టు తీసుకునే స్థితి లేకుండా పోయింది. దీంతో తాత్కాల్‌పై గంపెడాశలు పెట్టుకుంటున్నారు. ఆర్టీసీదీ అదే తంతు ఆర్టీసీ అధికారులు పండగ రద్దీ కారణంగా అదనపు బస్సులు నడపాలనే యోచనలో ఉన్నారు. కొందరు తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకోగా మిగిలిన వారంతా పండగ తర్వాత ఆయా నగరాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులపై ఆధార పడక తప్పదు. ఈ పరిస్థితుల్లో జనవరి 20 వరకు ఖాళీల్లేవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేట్ బస్సుల్లో సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు టిక్కెట్టు ధర రూ.450 నుంచి రూ.500 వరకు ఉంటే పండుగ తర్వాత రూ. వెయ్యి పైబడి చెబుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ అదనపు సర్వీసులు నడిపినా టిక్కెట్టు ధర మాత్రం భారీగానే పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు రైళ్లన్నీ నిండుకోవడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొందరు బస్సు ఆపరేటర్లు టిక్కెట్లు బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పందెం కోడి రె’ఢీ’
సంక్రాంతి కోడిపందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో సంక్రాంతి రానుండటంతో ఇప్పటినుంచే పందెపురాయుళ్లు పాత సరంజామను సిద్ధం చేసుకుంటున్నారు. బరిలో దిగే పుంజులకు రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ఏడాది భారీ బరులు ఏర్పాటు చేయాలనే తలంపుతో రాజకీయ నాయకుల అనుచరులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అభయంతో పందేలు ఈ ఏడాది కోట్లకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కైకలూరు : కోడిపందేల సమరం ఆరంభం కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఇటు పందెపురాయుళ్లు, అటూ వీక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కోడిపందేలు పెద్ద ఎత్తున జరిగే ప్రాంతాల్లో లాడ్జీలు బుక్ అయిపోయాయి. ఏడాది పాటు కంటికి రెప్పలా పెంచిన కోళ్లను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఐ-భీమవరం, నరసాపురం, ఉండి, సీసలి, గండిగుంట, ఎంట్రప్రగడ, రుద్రపాక, బైరపట్నం, చింతపాడు, ఇంగిలిపాకలంక, భుజబలపట్నం గ్రామాల్లో భారీ కోడిపందేలకు రంగం సిద్ధమైంది. మెనూ మస్ట్.. పందెం బరిలో దిగే కోడిపుంజులు రాజ వైభవాన్ని అనుభవిస్తున్నాయి. వ్యాయామం కోసం ఉదయం 7 గంటలకు చెరువుల్లో ఈత కొట్టిస్తున్నారు. కిస్మిస్, జీడిపప్పు, బాదంను పెస్ట్గా చేసి రోజుకు మూడు ఉండల చొప్పున తినిపిస్తున్నారు. వారానికి రెండు రోజులు తాటిబెల్లం, నల్లనూనె తాగిస్తున్నారు. సొన తీసేసిన కోడిగుడ్డును ఆహారంగా ఇస్తున్నారు. పిక్కలు బలంగా అవ డానికి వారానికి రెండు రివిటల్ మాత్రలు వేస్తున్నారు. పందెం ఒక్కరోజు ముందు వేప, ఎదురు, అవిశ జామ ఆకులను బాగా మరగబెట్టి అందులో పసుపు పోసి స్నానం చేయిస్తారు. పందెంలో పాల్గొనే ఒక్కో పుంజుకు రోజుకు రూ.100 ఖర్చు చేస్తున్నారు. రంగును బట్టి డిమాండ్ కోడిపుంజుల్లో వాటి ఈకల ఆధారంగా రకాలను విభజించి ధరలు నిర్ణయిస్తారు. సాధారణంగా పచ్చకాకి, నెమలి, డేగ, కాకి, పూల, పర్ల, సేతువ, రసింగి, నెమలి, గేరువా, కాకి నెమలి, మైలా, కాకిడేగ, తీతువా, నల్లబొట్ల తీతువా, అబ్రాస్లకు డిమాండ్ ఉంది. పచ్చకాకి ధర రూ.25వేల నుంచి రూ.లక్షా 50 వేలు పలుకుతోంది. నెమలి, డేగ, కాకి, నల్లబొట్ల తీతువాలకు రూ.20వేల నుంచి రూ.70వేల వరకూ డిమాండ్ ఉంది. ముసుగుపందెం, చూపుడు పందెం, జోడీలు, గుంపు పందెం వంటి నాలుగు పద్ధతుల్లో పోటీలు జరుగుతాయి. ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.10లక్షలు, ఒక్కోసారి రూ.50లక్షల వరకు జరుగుతాయి. నున్నలో జోరుగా విక్రయాలు నున్న గ్రామంలో సంక్రాంతి పండుగకు కోడిపుంజులు సిద్ధంగా ఉన్నాయి. ఎంతో బలిష్టంగా పెంచిన పుంజులను అమ్మకానికి సన్నద్ధం చేశారు. జాతి పుంజులు రూ.10వేల నుంచి 70వేల ఖరీదు చేస్తున్నారు. సంవత్సరం వయస్సు పైబడి ఉన్న కోడిపుంజులకు బాదంపిస్తా, కిస్మిస్, నువ్వులు, రాగులు, సజ్జలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పెట్టి పెంచుతున్నారు. వ్యాయామం కోసం చెరువుల్లో ఈత కొట్టిస్తున్నారు. ఏటా సంక్రాంతి పండుగకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నున్న గ్రామానికి వచ్చి పుంజులను కొంటుంటారు. ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని పెంపకందారులు చెబుతున్నారు. - నున్న (విజయవాడ రూరల్) పల్నాడులోనూ జోరు సాక్షి, గుంటూరు : పల్నాడులో కోడిపందేల జోరు పెరుగుతోంది. జిల్లాలోని అటవీ, సముద్ర తీర ప్రాంతాలు అధికంగా ఉన్న మండలాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటుచేసి పోలీసులు రాకుండా జాగ్రత్తపడుతూ ఈ పందేలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చిన పందెపురాయుళ్లు ఈ పందేల్లో పాల్గొంటున్నారు. పోలీసులకు భారీ మామూళ్లు కోడిపందేలవైపు రాకుండా ఉండేందుకు ఎస్సై, సీఐ స్థాయి అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెబుతున్నారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. పోలీసులు తమ మాట వినకపోతే అధికార పార్టీ నేతల ద్వారా హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు. పల్నాడులోని ఓ మండలంలో సీఐ బందోబస్తు విధుల్లో ఉన్న సమయం చూసి కోడి పందేలు నిర్వహించిన టీడీపీ నేతలు పందెం రాయళ్లు, విలేకరులకు మాత్రం తాము సీఐ అనుమతితోనే నిర్వహిస్తున్నామంటూ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ తీవ్ర ఆగ్రహంతో ఆ నేతలను హెచ్చరించారు. అధికార పార్టీ అండతో.. జిల్లాలో అధికార పార్టీ నేతల అండదండలతో కోడి పందేలు జరుగుతున్నాయి. గత సంక్రాంతి రోజు రేపల్లెలో కోడిపందేల నిర్వహణకు సమాయత్తం కాగా, పోలీసులు అడ్డుకున్నారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చర్నకోళా పట్టుకుని బరిలో నిలబడి పోటీలు నిర్వహించారు. పోలీసులు ఆవైపు రాకుండా హైదరాబాద్ స్థాయి ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల్లోని మండలాలతోపాటు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని అటవీ ప్రాంతాలు ఉన్న మండలాల్లో కోడి పందేలు యథేచ్ఛగా జరగడానికి టీడీపీ నేతలు సహకరిస్తున్నారు. -
12 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు
తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవుల్లో మార్పు జరిగింది. ఇంతకుముందు కేవలం పండుగ మూడు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయని చెప్పినా.. మళ్లీ ఇప్పుడు మార్చి వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈనెల 12వ తేదీ సోమవారం నుంచి 18వ తేదీ ఆదివారం వరకు సంక్రాంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. దీంతో ముందు ఆదివారంతో కలుపుకొంటే మొత్తం 8 రోజుల పాటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు సెలవులు వచ్చినట్లయింది. అయితే, కొన్ని కార్పొరేట్ కళాశాలలు మాత్రం ముందుగానే ఆ వారం రోజులకు సంబంధించి ప్రాజెక్టు వర్కులు కూడా ఇచ్చేశారు. -
సీమాంధ్ర టీచర్లకు సంక్రాంతి సెలవులు రద్దు!
33 రోజుల సమ్మె కాలపు పనిదినాలు సర్దుబాటు సెలవు దినాల్లో పని చేసేందుకు టీచర్ల అంగీకారం వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి సమావేశం సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలోని ఉపాధ్యాయులు సెలవు దినాల్లో పనిచేస్తారు. సంక్రాంతి సందర్భంగా ఇచ్చే ప్రధాన సెలవులతోపాటు ఇతర సెలవు దినాలు కూడా వారికి రద్దు కానున్నాయి. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సెలవు దినాల్లోనూ స్కూళ్లు పని చేస్తాయి. ఇందుకు ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు అంగీకరించారు. దీంతో వారు సమ్మె చేసిన కాలానికి కూడా వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. శుక్రవారం సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి సమక్షంలో జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో 13 జిల్లాల్లోని టీచర్లు పని చేయాల్సిన సెలవు దినాల వివరాలు, సమ్మె కాలానికి వేతనాల చెల్లింపు వంటి అంశాలతో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సెకండరీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ జిల్లాల్లోని టీచర్లు సకల జనుల సమ్మెలో పాల్గొన్న సమయంలోనూ ప్రభుత్వం ఈ విధంగానే చేసింది. సిలబస్ పూర్తి చేసేందుకు సెలవు దినాల్లో పని చేసినందుకు గాను వారు సమ్మెలో పాల్గొన్న రోజులకు వేతనాలు చెల్లించింది. ప్రస్తుతం సీమాంధ్ర టీచర్లకు కూడా అదే విధానం అమలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో సీమాంధ్రలోని ఉపాధ్యాయులు దాదాపు 50 రోజులపాటు సమ్మె చేశారు. ఇందులో 33 రోజులు పాఠశాలల పని దినాలు ఉన్నాయి. ప్రస్తుతం సమ్మె విరమించిన టీచర్లు రెండో శనివారం, ఆదివారాల్లో పని చేయనున్నారు. అలాగే డిసెంబర్ 24 నుంచి 2014 జనవరి 2 వరకు మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. క్రిస్ట్టియన్ యాజమాన్య పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలకు జనవరి 8 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులున్నాయి. డిసెంబరు 25న క్రిస్మస్ రోజున, సంక్రాంతి పండుగ రోజున మాత్రమే సెలవు ఇస్తారు. మిగితా రోజులన్నీ పని చేయాల్సిందే. మొత్తానికి మార్చి 9వ తేదీలోగా ఈ 33 రోజులను సర్దుబాటు చేస్తారు. తాత్కాలికంగా సమ్మె విరమణ సీమాంధ్ర జిల్లాల్లోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీవైఎస్సార్‌టీఎఫ్) స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఓబుళపతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అందుకే సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు.