పందెం కోడి రె’ఢీ’ | Hen ready to fight | Sakshi
Sakshi News home page

పందెం కోడి రె’ఢీ’

Published Tue, Dec 29 2015 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

పందెం కోడి రె’ఢీ’

పందెం కోడి రె’ఢీ’

సంక్రాంతి కోడిపందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో సంక్రాంతి రానుండటంతో ఇప్పటినుంచే పందెపురాయుళ్లు పాత సరంజామను సిద్ధం చేసుకుంటున్నారు. బరిలో దిగే పుంజులకు రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ఏడాది భారీ బరులు ఏర్పాటు చేయాలనే తలంపుతో రాజకీయ నాయకుల అనుచరులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అభయంతో పందేలు ఈ ఏడాది కోట్లకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
కైకలూరు : కోడిపందేల సమరం ఆరంభం కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఇటు పందెపురాయుళ్లు, అటూ వీక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కోడిపందేలు పెద్ద ఎత్తున జరిగే ప్రాంతాల్లో లాడ్జీలు బుక్ అయిపోయాయి. ఏడాది పాటు కంటికి రెప్పలా పెంచిన కోళ్లను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఐ-భీమవరం, నరసాపురం, ఉండి, సీసలి, గండిగుంట, ఎంట్రప్రగడ, రుద్రపాక, బైరపట్నం, చింతపాడు, ఇంగిలిపాకలంక, భుజబలపట్నం గ్రామాల్లో భారీ కోడిపందేలకు రంగం సిద్ధమైంది.
 
మెనూ మస్ట్..
 పందెం బరిలో దిగే కోడిపుంజులు రాజ వైభవాన్ని అనుభవిస్తున్నాయి. వ్యాయామం కోసం ఉదయం 7 గంటలకు చెరువుల్లో ఈత కొట్టిస్తున్నారు. కిస్మిస్, జీడిపప్పు, బాదంను పెస్ట్‌గా చేసి రోజుకు మూడు ఉండల చొప్పున తినిపిస్తున్నారు. వారానికి రెండు రోజులు తాటిబెల్లం, నల్లనూనె తాగిస్తున్నారు. సొన తీసేసిన కోడిగుడ్డును ఆహారంగా ఇస్తున్నారు. పిక్కలు బలంగా అవ డానికి వారానికి రెండు రివిటల్ మాత్రలు వేస్తున్నారు. పందెం ఒక్కరోజు ముందు వేప, ఎదురు, అవిశ జామ ఆకులను బాగా మరగబెట్టి అందులో పసుపు  పోసి స్నానం చేయిస్తారు. పందెంలో పాల్గొనే ఒక్కో పుంజుకు రోజుకు రూ.100 ఖర్చు చేస్తున్నారు.
 
రంగును బట్టి డిమాండ్
కోడిపుంజుల్లో వాటి ఈకల ఆధారంగా రకాలను విభజించి ధరలు నిర్ణయిస్తారు. సాధారణంగా పచ్చకాకి, నెమలి, డేగ, కాకి, పూల, పర్ల, సేతువ, రసింగి, నెమలి, గేరువా, కాకి నెమలి, మైలా, కాకిడేగ, తీతువా, నల్లబొట్ల తీతువా, అబ్రాస్‌లకు డిమాండ్ ఉంది. పచ్చకాకి ధర రూ.25వేల నుంచి రూ.లక్షా 50 వేలు పలుకుతోంది.
 
నెమలి, డేగ, కాకి, నల్లబొట్ల  తీతువాలకు రూ.20వేల నుంచి రూ.70వేల వరకూ డిమాండ్ ఉంది. ముసుగుపందెం, చూపుడు పందెం, జోడీలు, గుంపు పందెం వంటి నాలుగు పద్ధతుల్లో పోటీలు జరుగుతాయి. ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.10లక్షలు, ఒక్కోసారి రూ.50లక్షల వరకు జరుగుతాయి.
 
నున్నలో జోరుగా విక్రయాలు
నున్న గ్రామంలో సంక్రాంతి పండుగకు కోడిపుంజులు సిద్ధంగా ఉన్నాయి. ఎంతో బలిష్టంగా పెంచిన పుంజులను అమ్మకానికి సన్నద్ధం చేశారు. జాతి పుంజులు రూ.10వేల నుంచి 70వేల ఖరీదు చేస్తున్నారు. సంవత్సరం వయస్సు పైబడి ఉన్న కోడిపుంజులకు బాదంపిస్తా, కిస్మిస్, నువ్వులు, రాగులు, సజ్జలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పెట్టి పెంచుతున్నారు. వ్యాయామం కోసం చెరువుల్లో ఈత కొట్టిస్తున్నారు. ఏటా సంక్రాంతి పండుగకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నున్న గ్రామానికి వచ్చి పుంజులను కొంటుంటారు. ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని పెంపకందారులు చెబుతున్నారు. - నున్న (విజయవాడ రూరల్)
 
 
పల్నాడులోనూ జోరు

సాక్షి, గుంటూరు : పల్నాడులో కోడిపందేల జోరు పెరుగుతోంది. జిల్లాలోని అటవీ, సముద్ర తీర ప్రాంతాలు అధికంగా ఉన్న మండలాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటుచేసి పోలీసులు రాకుండా జాగ్రత్తపడుతూ ఈ పందేలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చిన పందెపురాయుళ్లు ఈ పందేల్లో పాల్గొంటున్నారు.
 
పోలీసులకు భారీ మామూళ్లు
కోడిపందేలవైపు రాకుండా ఉండేందుకు ఎస్సై, సీఐ స్థాయి అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెబుతున్నారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. పోలీసులు తమ మాట వినకపోతే అధికార పార్టీ నేతల ద్వారా హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు.  పల్నాడులోని ఓ మండలంలో సీఐ బందోబస్తు విధుల్లో ఉన్న సమయం చూసి కోడి పందేలు నిర్వహించిన టీడీపీ నేతలు పందెం రాయళ్లు, విలేకరులకు మాత్రం తాము సీఐ అనుమతితోనే నిర్వహిస్తున్నామంటూ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ తీవ్ర ఆగ్రహంతో ఆ నేతలను హెచ్చరించారు.
 
అధికార పార్టీ అండతో..
జిల్లాలో అధికార పార్టీ నేతల అండదండలతో కోడి పందేలు జరుగుతున్నాయి. గత సంక్రాంతి రోజు రేపల్లెలో కోడిపందేల నిర్వహణకు సమాయత్తం కాగా, పోలీసులు అడ్డుకున్నారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చర్నకోళా పట్టుకుని బరిలో నిలబడి పోటీలు నిర్వహించారు. పోలీసులు ఆవైపు రాకుండా హైదరాబాద్ స్థాయి ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల్లోని మండలాలతోపాటు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని అటవీ ప్రాంతాలు ఉన్న మండలాల్లో కోడి పందేలు యథేచ్ఛగా జరగడానికి టీడీపీ నేతలు సహకరిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement