
సాక్షి, కరీంనగర్: సంక్రాంతి వేళ..కరీంనగర్‌లో ఓ పందెం కోడి వార్త సందడి చేస్తోంది. మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని వేలం ముందు ట్విట్ నెలకొంది. కోడి వేలం పాటను ఆపాలంటూ ఓ వ్యక్తి.. ఆర్టీసీ డిపో అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఆ పందెం కోడి తనదేనని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మహేష్ అనే వ్యక్తి తెలిపాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అతడు సిరిసిల్లలోని రుద్రంగి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికునిగా పని చేస్తున్నాడు. బంధువులు ఇచ్చిన పందెం కోడిని తీసుకొని రుద్రంగి నుంచి మహేష్ నెల్లూరుకి వెళ్తూ ఉండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో వరంగల్ చేరుకోగానే నిద్రమత్తులో బస్సు దిగి పోయానని తెలిపాడు. తన వెంట కోడి లేదన్న విషయాన్ని గ్రహించి వెంటనే బస్సు వద్దకు వెళ్లగా.. అప్పటికే బస్సు వెళ్లిపోయిందని బాధితుడు చెప్పాడు. ఆర్టీసీ అధికారులు పందెం కోడిని వేలం పాట వేస్తున్నారని తెలవడంతో ఆ కోడి తనదేనంటూ చెప్పాడు. అసలేం జరిగిందంటే...? కోడి యజమాని వస్తాడని కొద్దిసేపు చూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక కంట్రోలర్‌కు ఆ కోడిని అప్పగించారు. మూడురోజులుగా ఆ కోడిని ఓ ఇనుప బోనులో రక్షణ కల్పిస్తున్నారు. దానికి దాణా, నీళ్లు ఇస్తూ అతిథిలాగే మర్యాదలు చేస్తున్నారు. కోడి యజమానికి తెలియజేసే క్రమంలో మీడియాలోనూ ప్రకటన విడుదల చేశారు. అయినా కోడి ఆచూకీ కోసం ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో–2 ఆవరణలో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని డిపో మేనేజర్ మల్లయ్య పేర్కొన్నారు ఈ లోపు కోడి తనదేనంటూ ఓ వ్యక్తి రావడంతో మరి దానిని అతనికి అందిస్తారో లేదో అనేది తెలియాల్సి ఉంది.
ఈనెల 9వ తేదీన కరీంనగర్ ఆర్టీసీ డిపో–2కు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ డిపోకి చేరుకుంది. బస్సు దిగి ఇంటికి వెళదామని బస్సు డ్రైవర్, కండక్టర్ సిద్ధమవుతుండగా, ఇంతలో కోడి కూత వినబడటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. సీటు కింద దాన్ని సంచిలో జాగ్రత్తగా కట్టేసిన తీరు చూసి, ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment