పండుగ నవ్వులు వారి పెదవులపై ఇంకా చెదిరిపోలేదు.. అందరూ ఒక్క చోట చేరిన వేళ పంచుకున్న తల్లీబిడ్డల మమకారం, అక్కా చెల్లెళ్ల అనురాగం మాసిపోలేదు. మిత్రులు, కుటుంబ సభ్యుల కోలాహలం వారిని వీడిపోలేదు.. మూడు రోజుల తర్వాత సంక్రాంతి సంబరాలను గుండెల్లో పదిలంగా దాచుకుని బాధ్యతలు పెంచిన దూరాలకు పయనమయ్యారు నరసరావుపేటకు చెందిన అన్నదమ్ముల కూతుళ్లు. సొంత గడ్డపై నుంచి బయలుదేరి 24 గంటలు తిరగకుండానే తెలంగాణలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులయ్యారు. ముచ్చటైన వేడుకల్లో మునిగిన కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచెత్తారు.
ఆ కుటుంబ సభ్యులంతా ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. విద్యాభ్యాసం, ఉద్యోగాల కోసం కర్ణాటక, పూణె ప్రాంతాల్లో ఉంటున్నారు. సంక్రాంతి పర్వదిన వేడుకలు జరుపుకునేందుకు సొంత ఊరైన నర్సరావుపేటకు వచ్చారు. ఐదు రోజులపాటు పట్టణంలోనే ఆనందోత్సాహాల నడుమ పండగను జరుపుకున్నారు. గురువారం ఉదయం ఇంటి నుంచి తమ సొంత కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరో గంటలో ఇంటికి చేరుకుంటామనగా బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబళించింది. మరో ముగ్గురిని ఆస్పత్రిపాలు చేసింది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
చౌటుప్పల్(మునుగోడు)/ నరసరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కట్ట పద్మజ (49) అక్కడే ఎస్‌ఎస్‌ఎన్ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈమె కుమారుడు రామచంద్రారెడి, కుమార్తె వాసంతి కర్ణాటకలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వీరితోపాటు పద్మజ, ఆమె బాబాయి కూతురు లక్ష్మీప్రియాంక (28) హైదరాబాద్ బయలుదేరారు. లక్ష్మీప్రియాంక పూణెలో పీడియాట్రిక్ చదివింది.
అక్కడే ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమైంది. వీరందరూ కలిసి కారులో బయలుదేరారు. పిల్లలు ముగ్గురిని హైదరాబాద్ నుంచి పంపించేందుకు పద్మజ డ్రైవర్ కృష్ణారెడ్డి(27)ని తీసుకొని వస్తున్నారు. లక్ష్మీప్రియాంక విమానంలో పూణెకు, వాసంతి, రాంచంద్రారెడ్డిలు బస్సులో కర్ణాటకకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చి సాయంత్రం వరకు బంధువుల ఇంట్లో ఉండి సాయంత్రం పిల్లలను పంపించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వారంతా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బైకును తప్పించే క్రమంలో..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి 25 మంది ప్రయాణికులతో మిర్యాలగూడకు బయలుదేరింది. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళ్తున్న మరో బస్సు వెనుక నుంచి ఈ బస్సు వెళ్తుంది. ఇదే సమయంలో పంతంగి గ్రామ స్టేజీ వద్ద ఓ ద్విచక్ర వాహనం ఒక్కసారిగా బస్సులకు అడ్డుగా వచ్చింది. ముందున్న బస్సు బైకును తప్పించుకుని వెళ్లాడు. వెనుక ఉన్న ఈ బస్సుకు తప్పించే అవకాశం లేకపోవడంతో చేసేదేమి లేక డ్రైవర్ జావిద్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు.
అందులో భాగంగా జంక్షన్ నుంచి బస్సును అదే వేగంతో హైదరాబాద్ వెళ్లే మార్గంలోకి మళ్లిం చాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న కారు బస్సుకు ఢీకొట్టింది. బలంగా తగలడంతో కారు బస్సు కిందకు ఇరుక్కుపోయింది. అందులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదే వేగంతో రోడ్డు కిందకు దూసుకుపోయింది. బస్సులోని ప్రయాణికులు పూర్తిగా సురక్షితంగా బయటపడినప్పటికీ భయభ్రాంతులకు గురయ్యారు.
ఐదుగురిలో ఇద్దరు దుర్మరణం
ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారులో డ్రైవర్‌తోపాటు ముందు సీట్లో కూర్చున్న రామచంద్రారెడ్డిలతో పోలిస్తే వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. వారిని కారులో నుంచి బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నం చేసి క్రేన్ సాయంతో బయటకు తీశారు. హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించగానే పద్మజ మృతి చెందింది. మిగతావారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. వారిలో లక్ష్మిప్రియాంకను కామినేని ఆస్పత్రికి, మిగతా ముగ్గురుని సన్‌రైజ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స ప్రారంభించగానే కామినేని ఆసుపత్రిలో లక్ష్మిప్రియాంక సైతం మృతి చెందింది. మిగతా ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మిప్రియాంకకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త పూణేలో ఉద్యోగం చేస్తున్నారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ రమేష్
ఏసీపీ రామోజు రమేష్, సీఐ వెంకటయ్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కారును క్రేన్ సాయంతో బస్సు కింద నుంచి తప్పించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పద్మజ భర్త శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment