
తెలుగు తమ్ముళ్లకు నారాయణ వార్నింగ్!
'ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడు. పిల్లలకే అనుకుంటే మనకు పాఠాలు చెబుతున్నాడు' అంటూ తెలుగు తమ్ముళ్లు చాటుగా గొణుక్కుంటున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతి నుంచి అమాత్యపదవికి ఎదిగిన పొంగూరు నారాయణ వ్యవహారశైలి టీడీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. అధినేత అండతో తమపై మంత్రి అజమాయిషీ చేస్తుండడంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.
రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో నిర్వహించిన టీడీపీ కార్పొరేటర్లు, నేతల సమావేశంలో నారాయణ విశ్వరూపం చూపించారు. గ్రూపు రాజకీయాలు చేస్తే ఇంటికి పంపుతానంటూ ఓ కార్పొరేటర్ కు వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ పాటించకపోతే పార్టీ వదిలివెళ్లిపోవాలని చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇంత కటువుగా ఎప్పుడూ మాట్లాడలేదని వాపోయారు.
చంద్రబాబు అండ తనకు దండిగా ఉందని, తనను ఎదిరించి ఎవరూ పార్టీలో మనలేరన్న సంకేతాలిచ్చారు మంత్రి నారాయణ. తన ముందు తోకాడిస్తే కట్ చేస్తానని హెచ్చరించారు. తనను చూసి నేర్చుకోమని విజయవాడ నేతలకు స్వయంగా చంద్రబాబే చెప్పారని గుర్తుచేశారు. పదేళ్లుగా పార్టీలో తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాల్లో తాను కూడా ఉన్నానని వెల్లడించారు. ఇప్పుడు తెరముందుకు వచ్చానని, ఇక మీ ఆటలు సాగవంటూ నెల్లూరు తమ్ముళ్లను హడలుగొట్టారు.
నిప్పులమూటలా నారాయణ చెలరేగిపోవడంతో టీడీపీ నేతలు నివ్వెరపోయారు. పార్టీకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న తమను ప్రత్యక్ష రాజకీయ అనుభవంలేని నారాయణ అంతలేసి మాటలు అనడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం పార్టీలో నారాయణ హవా నడుస్తున్నందున ఆయనకు అడ్డు చెప్పేందుకు టీడీపీ నాయకులు జంకుతున్నారు.