పేద రైతుల కడుపుకొట్టొద్దు
ఎన్‌పీ కుంట : అపారమైన నీటి వనరులతో సాగుకు అనుకూలమైన భూముల్లో సోలార్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద ్ధపడుతున్న నేపధ్యంలో స్థానిక రైతుల నుంచి నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలివ్వని రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఆ భూములను ఆగమేఘాలపై సోలార్ కంపెనీలకు కట్టబెట్టడంపై మండిపడతున్నారు. ఎన్‌పీ కుంట మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రైతుల నినాదాలు మిన్నంటాయి. బస్టాండ్ సమీపంలో రాస్తారోకో చేసి, అనంతరం తహ శీల్దార్ కార్యాలయాన్ని
ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎస్.రామ్మోహన్ మాట్లాడుతూ రెండు రిజర్వాయర్లు, ఒక కెనాల్ మధ్యలో గల సారవంతమైన భూముల్లో సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వకుండా ఆ భూములను రాష్ర్ట ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా సోలార్‌హబ్‌కు అప్పగించడం.. రైతుల పట్ల చూపుతున్న వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. రైతులు భూములు కోల్పోయి, పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లే పరిస్థితి కల్పిస్తోందని ఆవేదన చెందారు. భూములు సాగు చేసుకుంటున్న వారిలో 80 శాతం రైతులకు ఎలాంటి పట్టాలూ లేవని, ఇప్పుడు వీరందరినీ రోడ్లపాలు చేస్తారా అని ప్రశ్నించారు. అనంతరం సీపీఎం మండల శాఖ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే నంబులపూలకుంట మండలం పరిధిలో ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. భూములను సాగుకు యోగ్యంగా మార్చుకోవడానికి రైతులు ఎన్నో వ్యయప్రయాసలు పడ్డారని, అలాంటి వారికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు అవలంబిస్తోందని దుయ్యబట్టారు. భూ సర్వే పూర్తయితే పట్టాలిస్తామని మూడేళ్ల నుంచి కాలయాపన చేస్తూ, కేవలం వారం రోజుల్లోనే సర్వే చేసి సోలార్ హబ్‌కు అప్పగించడానికి రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. వెంటనే సోలార్ హబ్ ఏర్పాటు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలన్నారు. సీపీఐ మండల అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ సోలార్ ప్రాజెక్ట్‌కు అప్పగించే ముందు రెవెన్యూ అధికారులు రైతులతో మమేకమై వారి డిమాండ్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ తీర్మానాలు సైతం గుట్టుచప్పడు కాకుండా ఎందుకు పూర్తి చేయాల్సి వచ్చిందని నిలదీశారు. సాగు చేస్తున్న రైతులందరికీ పట్టాలిచ్చేంత వరకూ ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి జి.నాగరాజు, జి.చిన్న వెంకట రమణ, సీపీఎం నేతలు చిదయ్య, రామయ్య, వెంకటరమణ, ఎన్ .సుబ్రమణ్యం, ఎం.నాగరాజు, మహబూబ్ బాషా, బయన్న, ఎస్.రసూల్, బాబ్‌జాన్, సీపీఐ నేతలు ఎం.శివారెడ్డి, అమీర్ బాషా, ఎం.శ్రీరాములు, ఎస్.బాబ్ జాన్, ఎ.చంద్రకళ, ఎస్.నాగరత్న, రాజన్న, సుబ్బలక్ష్మి, వీరాంజి, బ్రహ్మాచారి, వైఎస్సార్ పార్టీ నేతలు వీరయ్య, చంద్రకళ, హిమాసాబ్, సరస్వతి, నాగశేషు పాల్గొన్నారు.