మచిలీపట్నంలో పిల్లలతో కలసి వచ్చి అమ్మఒడి నగదు తీసుకుంటున్న తల్లులు
ప్రజా సంకల్పయాత్రలో ఎందరో అక్కాచెల్లెమ్మల కన్నీటి గాథలు విని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కదిలిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కులేకపోవడంతో.. కూలికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నామని, రోజూ రెండు పూటలా తినడమే కష్టమైన తమకు పిల్లల్ని బడికి పంపడం ఎలాగని వారంతా వైఎస్ జగన్‌కు మొరపెట్టుకున్నారు. వారి కష్టాల్ని చూసి చలించిపోయిన జగన్‌మోహన్‌రెడ్డి.. పిల్లల్ని చదివించలేని నిస్పహాయ స్థితిలో ఉన్న పేదతల్లులకు భరోసా ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఒక్కో తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తానని, పేదరికంతో చదువుకు పిల్లలు దూరమవడం ఇకపై ఉండదని హామీనిచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ పిల్లల చదువుకోసం తల్లుల ఖాతాలో జగనన్న అమ్మఒడి పథకంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ. 15 వేలు జమ చేశారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరిన వేళ.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది తల్లులు తమ కన్నీటిని తుడిచిన అన్న జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమ పిల్లల చదువుకు కొండంత భరోసాగా నిలిచిన సీఎంకు ఎన్నటికీ రుణపడి ఉంటామంటున్నారు.
– సాక్షి నెట్‌వర్క్
చదువుకు చింతలేదిక
లక్షలాది మంది పేదల జీవితాల్లో కాంతిరేఖ అమ్మఒడి. అందుకు ఉదాహరణే శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం వడ్డిజల్లుపుట్టుగకు చెందిన ఈశ్వరి దొళాయి ఉదంతం. తన పిల్లలకు మంచి చదువు చెప్పించాలని తపించిన ఆ తల్లికి అన్నీ కష్టాలే. పూట గడవడమే గగనమైన ఆ కుటుంబంలోని పిల్లల చదువులకు అమ్మఒడి పథకం దారి చూపింది. ఇప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందం ఈశ్వరి మాటల్లోనే విందాం.. ‘ఏడేళ్లుగా నా భర్త కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నరకం అనుభవిస్తున్నాడు. మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. కూలీనాలి చేసుకుని జీవించేవాళ్లం. పిల్లల్ని మంచిగా చదివించాలనుకున్నాం. అప్పులు చేసి నా భర్తకు వైద్యం చేయించినా లాభం లేకపోయింది. నేను కూలికెళితేనే కుటుంబం గడిచే పరిస్థితి. ఇక నా కొడుకును ఎలా చదివించగలను అన్న బెంగతో ఎన్నో సార్లు బాధపడేదాన్ని. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం నా బిడ్డ చదువుకు వెలుగురేఖ అయ్యింది. మాలాంటి దిక్కు లేని వారికి జగనన్నే దిక్కు’ అని ఉప్పొంగిపోతూ చెప్పింది.
నా పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తాను
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడురుకు చెందిన అపర్ణది మరో కన్నీటి గాథ. అయితే ఇప్పుడు ఆమె బతుకులో అమ్మఒడి సంతోషాన్ని నింపింది. ఆ సంతోషాన్ని ఆమె పంచుకుంటూ.. ‘నా భర్త బలరాముడు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఇద్దరు పిల్లల్లో కుమార్తె 7వ తరగతి, కుమారుడు 5వ తరగతి చదువుతున్నారు. కూలి చేసుకుంటూ వీళ్లను పోషిస్తున్నా. నా భర్త చనిపోయాక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా. పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో ఇద్దరిలో ఒకరిని మాత్రమే చదివించాలనుకున్నా. పిల్లలిద్దరినీ గొప్ప చదువులు చదివించాలన్న నా కోరిక నెరవేరకుండా పోతుందేమోనని ఎంతో బాధపడ్దా.. అయితే పిల్లలను బడికి పంపితే చాలు, అమ్మఒడిలో రూ.15వేలు ఇస్తానన్న వైఎస్ జగన్ హామీతో ఇద్దరినీ చదివించాలని నిర్ణయించుకున్నాను. ఈ ఏడాది ఇద్దరినీ స్కూలు పంపించాను. ఇప్పుడు అమ్మఒడి కింద నా ఖాతాలో రూ. 15 వేలు పడ్డాయి. జగనన్న నాకు కొండంత ధైర్యాన్నిచ్చారు. నా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తానన్న నమ్మకం కలిగింది’ అని అపర్ణ ఆనందంతో చెప్పింది.
పర్వీన్ జీవితంలో కొత్త వెలుగు
పేదల బతుకుల్లో అమ్మఒడి నింపుతున్న వెలుగులకు పర్వీన్ సంఘటనే ఉదాహరణ.. పిల్లల చదువుకు, వారి భవిష్యత్ గురించి మచిలీపట్నానికి చెందిన పర్వీన్ బాధపడని రోజు లేదు. భర్త మద్యానికి బానిసై తీవ్ర అనారోగ్యంతో ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. తనకొచ్చే వితంతు పింఛన్‌తో పాటు.. రోజు కూలీగా పనిచేస్తే వచ్చే ఆదాయమే ఆ కుటుంబానికి దిక్కు. తాను కడుపునిండా తినకపోయినా.. తన పిల్లలను పెద్ద చదువులు చదివించాలని ఎన్నో కలలు కంది. సంపాదించే నాలుగు డబ్బుల్ని దాచుకుని ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తోంది. ఏటా ఫీజులు, పుస్తకాల కోసం రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది. ఎప్పుడైనా పిల్లల చదువుకు అవసరమొస్తే ఆమెకు అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో అమ్మఒడి పథకంలో రూ.15వేలు తన ఖాతాకు జమైందని తెలియగానే ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. అమ్మఒడి..ఆ అమ్మకు కొండంత భరోసానిచ్చింది. పిల్లల ఫీజులకు పోను మిగిలిన డబ్బును వారి పేరిట డిపాజిట్ చేస్తానని పర్వీన్ చెబుతోంది.
నారాయణమ్మ కుటుంబంలో ఆనందోత్సాహాలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న కుటుంబం కష్టాలు వింటే మన కళ్లు చెమర్చక మానవు. ఆమె పేరు జాన నారాయణమ్మ. ఊరు విజయనగరం జిల్లా దుప్పాడ గ్రామం. పెళ్లైన మూడేళ్లకే భర్త చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలతో పుట్టింటికొచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలి చేసుకుని బతుకుతోంది. నేల మీద కూర్చుని అమాయకంగా చూస్తున్న చిన్న కుమార్తె పేరు ఝాన్సీ. చిన్నప్పటి నుంచే ఫిట్స్‌తో బాధపడుతోంది. మానసిక ఎదుగుదల కూడా లేదని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి కృంగిపోయింది. అప్పటి నుంచి ఆ చిన్నారి వైద్యం కోసం అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఒక వైపు పేదరికం, మరోవైపు చిన్న కూతురి అనారోగ్యం.. వీటిన్నింటి నడుమ పెద్ద కూతురు సంతోషిని చదివిస్తోంది. ఇప్పుడు నారాయణమ్మ జీవితంలో అమ్మఒడి పథకం వెలుగులు నింపింది. ఆమె బ్యాంకు ఖాతాలోకి రూ.15వేలు పడ్డాయి. 8వ తరగతి చదువుతున్న సంతోషి కోసం వీటిని ఖర్చుపెడతానని చెబుతోంది.
‘అమ్మఒడి’పై అక్కసు.. దివ్యాంగుడిపై దాడి
ధర్మవరం అర్బన్: అమ్మఒడికి మద్దతుగా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. స్థానిక నాగులబావి వీధికి చెందిన దివ్యాంగుడు ఎల్లారెడ్డి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను అమ్మఒడిపై ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు షేర్ చేశాడు. అయితే.. అదే వార్డుకు చెందిన సుబ్రహ్మణ్యం తప్పుడు పదాలతో పోస్టు కింద కామెంట్ పెట్టడంతో ఎల్లారెడ్డి అతడిని మందలించాడు. దీంతో సుబ్రహ్మణ్యం ఆటోస్టాండ్‌లో ఉన్న ఎల్లారెడ్డిపై చెప్పుతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment