
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు 3,05,040 మందికి, 25 పార్లమెంటు స్థానాలకు 3,01,003 మందికి పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. అసెంబ్లీ స్థానాలకు 3,18,530 మంది, పార్లమెంటు స్థానాలకు 3,17,291 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సరైన పత్రాలు సమర్పించని వారికి పోస్టల్ బ్యాలెట్లు మంజూరు చేయలేదని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారిలో కొంతమంది అసలు దరఖాస్తే చేసుకోలేదని వివరించారు. గురువారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ద్వివేది మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60,250 మంది సర్వీసు ఓటర్లు ఉండగా అందులో సుమారు 58 వేల మందికి ఆన్‌లైన్‌లో బ్యాలెట్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల అవకతవకలపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో మంజూరు చేసిన బ్యాలెట్ల వివరాలను ఆయన వెల్లడించారు.
అలాగే ఈవీఎంలు, వీవీప్యాట్‌ల కౌంటింగ్‌పై ఆర్వో, ఏఆర్వోలకు మే 17న విజయవాడలో ఉదయం పది గంటల నుంచి మధ్నాహ్నం రెండు గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిఖిల్ కుమార్ (డైరెక్టర్), మధుసూదన్ గుప్తా (యూఎస్)లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. లెక్కింపులో పాల్గొనే ఉద్యోగులను జిల్లా యూనిట్‌గా మూడుసార్లు ర్యాండమైజేషన్ విధానంలో ఎంపిక చేస్తామన్నారు. లెక్కింపునకు వారం రోజుల ముందు మొదట విడత ర్యాండమైజేషన్, 24 గంటల ముందు నియోజకవర్గ పరిశీలకుల సమక్షంలో రెండో విడత పూర్తి చేస్తామని వివరించారు. కౌంటింగ్ రోజు ఒక గంట ముందు సిబ్బందికి ఏ టేబుల్ కేటాయించామన్నది తెలియజేస్తామన్నారు. ఉదయం 8.30 తర్వాత కేవలం కేంద్ర ఎన్నికల పరిశీలకులు తప్ప ఆర్వోలతో సహా ఎవ్వరి సెల్‌ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment