ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ కెమెరాల ఫుటేజీలో రికార్డయిన చిత్రం
రాజమహేంద్రవరం క్రైం: అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్ట్ పై మృతి చెందిన యువకుడి మృతదేహం అప్పగించడంలో జాప్యం చోటు చేసుకోవడంతో మృతుడి బంధువులు, స్నేహితులు హాస్పిటల్ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. రాజమహేంద్రవరం ఆల్‌కట్ తోటకు చెందిన రేగుళ్ల అరుణ్ కుమార్ అనుమానాస్పదస్థితిలో బుధవారం బాలాజీ పేట రైల్వే ట్రాక్ వద్ద మృతి చెందాడు. యువకుడి మృతికి అతడు ప్రేమించిన యువతి బంధువులే కారణమంటూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. బుధవారం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఇద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించి, కెమెరాలో చిత్రీకరించాలని మృతుడి బంధువులు నిబంధన పెట్టారు.
ఉదయం అవుట్ పేషంట్లను చూసి, అనంతరం పోస్టుమార్టమ్‌కు డాక్టర్లు సిద్ధమవుతుండగా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మృతుడి బంధువులు, స్నేహితులు డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. హాస్పిటల్ మెయిన్ గేటుకు అమర్చిన అద్దాలు పగలుగొట్టారు. ఒక్కసారిగా ఆందోళనకారులు రెచ్చిపోవడంతో వారిని అదుపు చేయాల్సిన పోలీస్ సిబ్బందే పరుగులు తీయాల్సినంతగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే పోస్టు మార్టంను ప్రారంభించిన ప్రభుత్వ వైద్యులు మృతదేహాన్ని సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మృతుడి బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని ఊరేగింపుగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలించారు. మరోవైపు ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసిన వారిపై ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment