మళ్లీ కోతల కాలం
సాక్షి, గుంటూరు:జిల్లాలో కరెంటు కోతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగియడంతో లోడ్ రిలీఫ్ పేరుతో శనివారం నుంచి కోతలు విధిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్)లతో జిల్లా ప్రజానీకం సతమతమవుతోంది. అప్రకటిత విద్యుత్ కోతలతో నరకం చవి చూస్తున్నారు. చంటి బిడ్డల నుంచి పండుటాకుల వరకు ఉక్కపోత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండ్రోజుల్నుంచీ తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా కరెంటు వినియోగం పెరిగింది. ఇదే సమయంలో వ్యవసాయ కరెంటు వినియోగం గణనీయంగా తగ్గింది. రబీకి కరెంటు సరఫరా అవసరం లేకుండా పోయింది. దీంతో గృహ అవసరాలకు కోతలు విధించే అవకాశం లేదు. కానీ విద్యుత్ అధికారులు ఇష్టం వచ్చినట్లు కోతలు అమలు చేయడంతో వాన రాకడ.. కరెంటు పోకడ.. తెలియదన్నట్టుంది. ఎన్నికల కారణంగా కరెంటు కోతలు విధించలేదు. మళ్లీ కోతలు ప్రారంభం కావడంతో జిల్లా వాసులు గగ్గోలు పెడుతున్నారు.
సరఫరా, డిమాండ్‌కు మధ్య వ్యత్యాసం
ఎండలు బాగా పెరిగిపోవడంతో విద్యుత్ సరఫరా, డిమాండ్‌కు వ్యత్యాసం ఏర్పడుతోంది. అధికారుల లెక్కల ప్రకారం రోజుకు జిల్లాలో 9.1 మిలియన్ యూనిట్లు (ఒక మిలియన్ యూనిట్టు అంటే పది లక్షల యూనిట్లు) సరఫరా జరుగుతోంది. అయితే రోజుకు డిమాండ్ 10.2 మిలియన్ యూనిట్లు వరకు ఉంటుంది. 1.1 మిలియన్ యూనిట్లు లోటు కారణంగా తప్పనిసరిగా లోడ్ రిలీఫ్ అమలు చేయాల్సి వస్తుందని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. రోహిణికార్తె రాకమునుపే ఎండల తీవ్రత ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. లోడ్ రిలీఫ్ కాకుండా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ కూడా అమలు కావడంతో అల్లాడుతున్నారు. జిల్లా కేంద్రంలోనే శనివారం ఐదు గంటల వరకు కోతలు అమలు చేశారు. అప్రకటిత కోతలు భారీగానే విధించారు. పల్లెల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కోతలు ప్రారంభం రోజే వినియోగదారులకు చుక్కలు చూపించారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో డిస్కంకు రెండు జిల్లాలు అదనంగా కలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను సెంట్రల్ డిస్కం నుంచి సదరన్ డిస్కంకు కలిపారు. కోటా పెద్దగా పెరిగిందేమీ లేదని, ఈ లోడుతో రానున్న రోజుల్లో కరెంటు ఎప్పుడు పోతుందో కాకుండా ఎప్పుడొస్తుందోనని ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి.