
శ్రీకాకుళం , అరసవల్లి: జిల్లా వాసులకు కరెంటు కష్టాలు వెంటాడనున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల మూడో తేదీ వరకూ విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం తలెత్తనుంది. విశాఖపట్నంలో సాంకేతిక లోపం కారణంగా జిల్లాకు కొద్ది రోజుల పాటు విద్యుత్ సరఫరా భారీగా తగ్గనుంది. కలపాకలో (విశాఖపట్నం) గల 315 ఎంవీఏ (మెగా వోల్ట్ ఆంప్స్) పవర్ ట్రాన్స్‌ఫార్మర్ మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా అక్కడి విద్యుత్ అధికారుల సూచన మేరకు ఎల్‌సీ (లైన్ క్లియరెన్స్) తీసుకోనున్నారు. దీంతో మన జిల్లాకు వస్తున్న రోజు వారీ విద్యుత్ సరఫరా కొద్ది శాతం తగ్గనుంది. ఈ ప్రభావంతో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ కింద శుక్రవారం ఉదయం నుంచి వచ్చే నెల 3 వతేది రాత్రి వరకు విద్యుత్ కోతను అధికారులు విధించనున్నారు.
జిల్లాకు రోజుకు 240 మెగావాట్లు సరఫరా అవుతుండగా, తాజాగా వచ్చిన సాంకేతిక లోపంతో సుమారు 50 మెగావాట్లు తక్కువగా సరఫరా కానుంది. దీంతో జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ సరఫరాలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లోనే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో కోతలు విధించే అవకాశముంది. జిల్లాలో అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు దాదాపుగా ఏడు లక్షల మంది వరకు ఉన్నారు. వీరందరిపై ఈ ప్రభావం పడనుంది. దీనికి తోడు జిల్లాలో పైడిభీమవరం సబ్‌స్టేషన్‌లో కూడా సాంకేతిక లోపం తలెత్తడంతో ఇక్కడ కూడా మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో విద్యుత్ కోతలు అనివార్యం కానున్నాయి.
వచ్చే నెల 3 వరకు కోతలుంటాయి
కలపాక పవర్ ట్రాన్స్‌ఫార్మర్ మెయింటనెన్స్ కారణంగా శుక్రవారం ఉదయం నుంచి వచ్చే 3 వతేది వరకు జిల్లాలో కొంత వరకు విద్యుత్ కోతలు తప్పవు. అయితే కోతల సమయాలను జిల్లాలో పరిస్థితులు, అవసరాల మేరకు శ్రీకాకుళం డివిజన్, టెక్కలి డివిజన్‌లలో నిర్ణయిస్తాం. వినియోగదారులకు రాత్రి వేళల్లోనే కొంత మేరకు ఇబ్బందులుంటాయి. దాదాపుగా 40 నుంచి 50 మెగావాట్ల వరకు తక్కువగా విద్యుత్ సప్‌లై అవుతున్న కారణంగానే ఈ కోతలు అనివార్యంగా విధిస్తున్నాం. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నాం. – దత్తి సత్యనారాయణ, ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment