విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : విద్యుత్ ఉద్యోగులు ఆదివారం ఉద యం 6 గంటల నుంచి మెరుపు సమ్మె చేయనున్నారు. అపరిష్కృతంగా మిగిలిపోతున్న తమ ప్రధాన డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పడుతున్నారు. ఐదు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీరు కోరుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్‌సీని పెంచాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించనున్నారు. ఇంజినీరింగ్ ఉద్యోగుల నుంచి క్షేత్ర స్థాయిలో కీలక పాత్ర పోషించే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వరకూ అందరూ సమ్మెలో పాల్గోనున్న ట్టు ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ కమిటీ జిల్లా చైర్మన్ ప్రసాద్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మందికిపైగా రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది విధులకు గైర్హాజరుకానున్నట్టు చెప్పారు. గతంలో ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలను భేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ర్టవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులంతా విధులను బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నిలిచిపోనున్న విద్యుత్ సేవలు
విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే ఓ వైపు విద్యుత్ సంక్షోభం, మరోవైపు రెండు రోజులుగా ఉద్ధృతంగా వీస్తున్న ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడి తీవ్ర అవస్థలు పడుతున్న జిల్లా వాసులకు విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడం గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా మారనుంది. రెండు రోజులుగా జిల్లాలో వీస్తున్న గాలులతో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, విద్యుత్ శాఖ అధికారులు శనివారం సాయంత్రం వరకు మరమ్మతు పనులు నిర్వహించారు. శనివారం రాత్రి కూడా ఈదురు గాలులు వీయడంతో పరిస్థితి పునరావృతమైంది. ఈ సమయంలో మరమ్మతులు చేయాల్సిన విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పడుతుండడంతో జిల్లా వాసులకు విద్యుత్ కష్టాలు తప్పేలాలేవు. తమ డిమాండ్లపై ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించకుంటే పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
Published Sun, May 25 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement
Advertisement