సాక్షి, కడప: విద్యుత్ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు నల్లని ఇనుప మీటర్లలో పెద్ద చక్రమొకటి తిరిగేది. అది చుట్టూ తిరిగే క్రమాన్ని బట్టి రీడింగ్‌ను లెక్కగట్టేవారు. దీని ద్వారా కొందరు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని ఎలక్ట్రానిక్ మీటర్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత డిజిటల్ మీటర్లు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఐఆర్‌డీఏ-పోర్టు అనే అత్యాధునిక సాంకేతిక మీటర్లను ప్రవేశపెట్టనున్నారు. విద్యుత్ బిల్లుల నమోదు ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా ఉండేందుకు వీటిని వినియోగంలోకి తెస్తున్నారు.
అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో:
ఐఆర్‌డీఏ-పోర్టు అనే సాంకేతిక మీటర్లు అమర్చడంతో పాటు, వాటిలోని రీడింగ్ నమోదు కోసం సరికొత్త స్పాట్‌బిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో సెల్‌ఫోన్‌లో వాడే సిమ్‌కార్డు తరహా కార్డు ఉంటుంది. ఇది ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉంటుంది. కరెంటు మీటరు ముందు బిల్లింగ్ యంత్రాన్ని ఉంచగానే మీటరు రీడింగ్ దానంతట అదే నమోదవుతుంది. ఆ వెంటనే అది నేరుగా ఆన్‌లైన్‌లోకి చేరిపోతోంది. ఇంట్లో కంప్యూటర్ ఉన్నవారు, సెల్‌ఫోన్‌లో ఇంటర్నెట్ వినియోగించేవారు తమ విద్యుత్ వినియోగం బిల్లును, రీడింగ్‌ను నమోదు చేసుకున్న మరుక్షణం నుంచే ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు.
తగ్గించే అవకాశమే లేదు:
స్పాట్‌బిల్లు యంత్రాలతో రీడింగ్‌నమోదు సందర్భంలో కొంత వెసులుబాటు ఉంది. రీడింగ్ నమోదుకు వచ్చిన వ్యక్తిని బతిమాలితే బిల్లు తక్కువ వచ్చేలా చేసుకునే అవకాశం ఉంది. 100 యూనిట్ల లోపు విద్యుత్‌ను వాడుకున్న వారికి వచ్చే బిల్లు, 105 యూనిట్లు వాడుకున్న వారికి వచ్చే బిల్లుతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. టారిఫ్ మారడంతో యూనిట్‌కు చెల్లించే చార్జీ అమాంతం మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో వంద యూనిట్లకు కొద్దిగా ఎక్కువగా వినియోగించినా వంద యూనిట్లలోపు రీడింగ్ నమోదు చేయించుకునే అవకాశం ఉంది. అయితే పోర్టుమీటర్ల ద్వారా ఆ అవకాశం ఉండదు. మీటరు ముందు బిల్లింగ్ యంత్రాన్ని ఉంచితే రీడింగ్ వస్తుంది, అద్దం మసకబారి రీడింగ్ కనిపించకున్నా మీటరు ముందు యంత్రం పెడితే దానంతటదే నమోదవుతుంది.
ఆన్‌లైన్‌లో బిల్లును ఇలా చూసుకోవచ్చు:
విద్యుత్ వినియోగం బిల్లు కాగితం మన దగ్గర లేకున్నా ఆన్‌లైన్‌లో మన లెక్క సులువుగా తెలుసుకోవచ్చు. గూగుల్‌లోకి వెళ్లి ఏపీఎస్‌పీడీసీఎల్ సైట్లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. అందులో సర్కిల్‌కోడ్ అడుగుతుంది. అందులో వైఎస్సార్‌జిల్లాను ఎంచుకోవాలి. ఆపై ప్రాంతాల వారీగా కోడ్‌నెంబర్లు ఉంటాయి. ఆకోడ్‌లలో వినియోగదారుని నెంబర్‌ను స్పాట్ బిల్లింగ్ మిషన్‌లో నమోదు చేస్తే మీటరులోని రీడింగ్, బిల్లు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానం ఇప్పటికే ఏపీఎన్‌పీడీసీఎల్ పరిధిలో అమలవుతోంది. మొదటగా పట్టణప్రాంతాల వరకే ఈ విధానాన్ని అమలు చేశారు. అది విజయవంతం కావడంతో గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.
కొత్త.. కొత్తగా
Published Fri, Oct 25 2013 2:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement