రాజుగారి చీకటి పాలన!
అసలే రాజు గారు.. పాలన కూడా బాగుంటుందని ఆశించారు.. స్థానికేతరుడైనా అత్యధిక ఓట్లతో గెలిపించారు.. అటవీశాఖకు మంత్రిగా నియామకం కావడంతో కష్టాలు తీరుతాయని ఆశించారు.. గిరిజన గూడల్లో వెలుగులు ప్రసరిస్తాయని, సౌకర్యాలు కలుగుతాయని భావించారు. ఐదేళ్లు గడిచిపోయాయి. కనీస సదుపాయాలను పక్కన పెడితే కనీసం విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. ఇప్పటికీ చీకటే రాజ్యమేలుతోంది.
-ఇప్పటికీ విద్యుత్ సరఫరాకు నోచుకోని గిరిజన గ్రామాలు
-పొలంగట్లే రహదారులు
-బోర్లు లేక తాగునీటికి కటకట
-పట్టించుకోని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు
కొత్తూరు, న్యూస్‌లైన్: ఐటీడీఏ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గిరిజన గూడలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని, గిరిజనుల సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్నామంటూ పాలకులు, అధికారులు గొప్పలు చెప్పుకొస్తున్నా పరిస్థితి పూర్తి భిన్నం. వారి గూడలకు వెళ్లి చూస్తే సమస్యలే సాక్షాత్కరిస్తాయి. రాష్ట్ర అటవీశాఖ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సొంత నియోజవర్గం పరిధి కొత్తూరు మండలంలో మైదాన ప్రాంతంలోని గిరిజన గూడలే విద్యుత్ సదుపాయానికి నోచుకోలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రాజుగారి పాలన ఎంత మేరకు సాగించారో అవగత మవుతుంది.
మైదాన ప్రాంతంలో ఉన్న పొన్నుటూరు పంచాయతీ పరిధి బంకిదిగువ గూడ, రాయల పంచాయతీ పరిధి రాయల గూడలకు ఇప్పటికీ విద్యుత్ సదుపాయం లేదు. దీనికోసం రచ్చబండ, గ్రీవెన్స్, గిరిజన దర్బార్‌లలో వందల సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దీంతో సుమారు 250 మంది గిరిజనులు చీకటిలోనే కాలం గడుపుతున్నారు. పొద్దుపోతే విష సర్పాలు, అటవీ జంతువుల భయంతో జీవనం సాగిస్తున్నారు. చదువులు సాగక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బంకి ఎగువ గూడ, తుమ్మికిమాను గూడ, కంఠమాను గూడ, జన్నోడు గూడ, డెప్పి గూడతో పాటు దిమిలి, లబ్బ, ఒట్టిపల్లి పంచాయతీ పరిధిలోని పలు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు.
పొలం గట్లే ఈ గ్రామాల ప్రజలకు రోడ్లు. చాలా గ్రామాల్లో పాఠశాలలకు భవనాలు లేవు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు చేయక పోవడంతో గిరిజన పిల్లలు చదువులకు, పౌష్టికాహారానికి నోచుకోలేదు. తాగునీటికి కటకటే. బోర్లు లేకపోవడంతో కొండ ధారతోనే దాహం తీర్చుకుంటున్నారు. కనీస సదుపాయాలు కల్పించని శత్రుచర్ల... పదవికోసం పార్టీ మారి మళ్లీ పోటీచేస్తున్నారని తెలుసుకున్న గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆయన పాలనకు స్వస్తి పలికి స్థానిక సమస్యలు తెలిసిన స్థానిక నాయకుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు.