satrucharla vijaya ramaraju
-
‘స్థానిక’ పోరులో ఆ ముగ్గురూ సై!
► శత్రుచర్ల, శ్రీకాంత్, శోభన్‌బాబు నామినేషన్లు ఓకే ► స్క్రూటినీ తర్వాత రిటర్నింగ్ అధికారి ప్రకటన ► శత్రుచర్ల నామినేషన్లపై శ్రీకాంత్ అభ్యంతరాలు ► చివరి నిమిషం వరకూ టీడీపీ నేతల్లో ఉత్కంఠ శ్రీకాకుళం: జిల్లాలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆది నుంచి ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఈ బరిలోకి దిగే అభ్యర్థుల ప్రకటన నుంచి వారి నామినేషన్ల దాఖలు... చివరకూ స్క్రూటినీలోనూ అదే వేడి కొనసాగింది. అధికార టీడీపీ తరఫున బరిలోకి దిగిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు మామిడి శ్రీకాంత్, తమరాల శోభన్‌బాబు నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి జేసీ కేవీఎన్ చక్రధర్‌బాబు ధ్రువీకరించారు. నామినేషన్లు వేసినా ముగ్గురు స్క్రూటినీ ప్రక్రియను దాటి మరో అడుగు ముందుకేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 3వ తేదీ వరకూ ఉంది. ఆ తర్వాతే అసలైన పోరు ఎవ్వరి మధ్య అనేదీ తేలిపోతుంది. కాంగ్రెస్ నాయకుడు పీరుకట్ల విశ్వప్రసాద్ పదవీకాలం ముగియనుండటంతో ఖాళీ అవుతున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ల సంఖ్యలో కాస్త మెరుగైన స్థానంలోనున్న టీడీపీ నుంచి ఆశావహులు మాత్రం 20 మంది నిలిచారు. వివిధ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆఖరి నిమిషంలో ఆ 20 మంది టీడీపీ నాయకులను దరఖాస్తులను బుట్టదాఖలు చేసిన చంద్రబాబు... చివరకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజునే బరిలో నిలిపారు. విజయరామరాజు ఇటీవలి సాధారణ ఎన్నికలలో పాతపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం వివిధ నాటకీయ పరిణామాలు, జిల్లా కలెక్టరేట్లో మూడు గంటల హైడ్రామా నడుమ శత్రుచర్ల నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మామిడి శ్రీకాంత్, టీడీపీకే చెందిన తమరాల శోభన్‌బాబు స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలసిందే. స్క్రూటినీలోనూ ఉత్కంఠే...: శత్రుచర్ల విజయరామరాజు, మామిడి శ్రీకాంత్, తమరాల శోభన్‌బాబుల నామినేషన్లను బుధవారం రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు పరిశీలించారు. శత్రుచర్ల నామినేషన్లలోని విషయాలు, అఫిడవిట్లపై మామిడి శ్రీకాంత్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన తరఫున న్యాయవాదులు వివేక్, బాలకృష్ణ రిటర్నింగ్ అధికారి ముందు వాదనలు వినిపించారు. గతంలో శత్రుచర్ల ఎస్టీ కుల ధ్రువీకరణపత్రాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ న్యాయస్థానంలో చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. శత్రుచర్ల ఎస్టీ కాదని, ఆయన ధ్రువీకరణ పత్రం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అంతేగాకుండా శత్రుచర్ల ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా అనుభవించిన వేతనాలు, భత్యాలు, వివిధ రాయితీల రూపంలో పొందిన మొత్తం సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో శత్రుచర్ల అభ్యర్థిత్వం చెల్లుబాటు కాదని వాదించారు. దీంతో ఆయా అంశాలను రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు జిల్లా ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాసేపు తర్జనభర్జనల తర్వాత చివరకు శత్రుచర్ల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అప్పటివరకూ తీవ్ర ఉత్కంఠతో కనిపించిన శత్రుచర్ల, టీడీపీ నాయకులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలాగే స్వతంత్య్ర అభ్యర్థులుగా మామిడి శ్రీకాంత్, తమరాల శోభన్‌బాబు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారు. దీంతో నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్థులు కూడా స్క్రూటినీ ప్రక్రియను దాటి మరో అడుగు ముందుకేశారు. -
ఆ ఎమ్మెల్యే జీతం మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే
మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత శత్రుచర్ల విజయ రామరాజుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా ఆయన పొందిన మొత్తం వేతనాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పదవీకాలం ఇప్పటికే పూర్తయినా కూడా ఆ వేతనాన్ని ఆయన తిరిగి ఇవ్వాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 1999 నుంచి 2004 వరకు శ్రీకాకుళం జిల్లా నాగూరు ఎమ్మెల్యేగా శత్రుచర్ల ఉండేవారు. అది అప్పట్లో ఎస్టీ నియోజకవర్గం. 2004లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం పూర్తిగా మాయమైంది. అయితే.. క్షత్రియుడైన విజయరామరాజు ఎస్టీగా పోటీ చేయడం తగదని నిమ్మక జయరాజు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లినా విజయరామరాజు క్షత్రియుడేనని, అందువల్ల ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తగదని, ఆయన ఎన్నిక చెల్లదని తేల్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. వైఎస్ఆర్సీపీ నాయకుడు రమణమూర్తి చేతిలో ఓడిపోయారు. కాగా, ఎమ్మెల్యేగా శత్రుచర్ల ఎన్నిక సరికానప్పుడు.. ఆయన పొందిన వేతనం మాట ఏంటని మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దాని విచారణ సందర్భంగానే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తప్పుడు వివరాలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ ఖజానా నుంచి తాము పొందిన వేతనం మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని తెలిపింది. ఇలా తీర్పు ఇవ్వడం దేశ రాజకీయాల్లోనే పెద్ద మేలి మలుపు అవుతుంది. చాలామంది ప్రజాప్రతినిధులు ఇలా కులం విషయంలో తప్పుడు వివరాలను అఫిడవిట్లో సమర్పించి ఎన్నికవుతున్నారంటూ ఆ తర్వాతి కాలంలో పిటిషన్లు దాఖలవుతున్నాయి. -
రాజుగారి చీకటి పాలన!
అసలే రాజు గారు.. పాలన కూడా బాగుంటుందని ఆశించారు.. స్థానికేతరుడైనా అత్యధిక ఓట్లతో గెలిపించారు.. అటవీశాఖకు మంత్రిగా నియామకం కావడంతో కష్టాలు తీరుతాయని ఆశించారు.. గిరిజన గూడల్లో వెలుగులు ప్రసరిస్తాయని, సౌకర్యాలు కలుగుతాయని భావించారు. ఐదేళ్లు గడిచిపోయాయి. కనీస సదుపాయాలను పక్కన పెడితే కనీసం విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. ఇప్పటికీ చీకటే రాజ్యమేలుతోంది. -ఇప్పటికీ విద్యుత్ సరఫరాకు నోచుకోని గిరిజన గ్రామాలు -పొలంగట్లే రహదారులు -బోర్లు లేక తాగునీటికి కటకట -పట్టించుకోని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కొత్తూరు, న్యూస్‌లైన్: ఐటీడీఏ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గిరిజన గూడలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని, గిరిజనుల సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్నామంటూ పాలకులు, అధికారులు గొప్పలు చెప్పుకొస్తున్నా పరిస్థితి పూర్తి భిన్నం. వారి గూడలకు వెళ్లి చూస్తే సమస్యలే సాక్షాత్కరిస్తాయి. రాష్ట్ర అటవీశాఖ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సొంత నియోజవర్గం పరిధి కొత్తూరు మండలంలో మైదాన ప్రాంతంలోని గిరిజన గూడలే విద్యుత్ సదుపాయానికి నోచుకోలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రాజుగారి పాలన ఎంత మేరకు సాగించారో అవగత మవుతుంది. మైదాన ప్రాంతంలో ఉన్న పొన్నుటూరు పంచాయతీ పరిధి బంకిదిగువ గూడ, రాయల పంచాయతీ పరిధి రాయల గూడలకు ఇప్పటికీ విద్యుత్ సదుపాయం లేదు. దీనికోసం రచ్చబండ, గ్రీవెన్స్, గిరిజన దర్బార్లలో వందల సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దీంతో సుమారు 250 మంది గిరిజనులు చీకటిలోనే కాలం గడుపుతున్నారు. పొద్దుపోతే విష సర్పాలు, అటవీ జంతువుల భయంతో జీవనం సాగిస్తున్నారు. చదువులు సాగక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బంకి ఎగువ గూడ, తుమ్మికిమాను గూడ, కంఠమాను గూడ, జన్నోడు గూడ, డెప్పి గూడతో పాటు దిమిలి, లబ్బ, ఒట్టిపల్లి పంచాయతీ పరిధిలోని పలు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. పొలం గట్లే ఈ గ్రామాల ప్రజలకు రోడ్లు. చాలా గ్రామాల్లో పాఠశాలలకు భవనాలు లేవు. మినీ అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయక పోవడంతో గిరిజన పిల్లలు చదువులకు, పౌష్టికాహారానికి నోచుకోలేదు. తాగునీటికి కటకటే. బోర్లు లేకపోవడంతో కొండ ధారతోనే దాహం తీర్చుకుంటున్నారు. కనీస సదుపాయాలు కల్పించని శత్రుచర్ల... పదవికోసం పార్టీ మారి మళ్లీ పోటీచేస్తున్నారని తెలుసుకున్న గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆయన పాలనకు స్వస్తి పలికి స్థానిక సమస్యలు తెలిసిన స్థానిక నాయకుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
అంత ఎదిగిపోయావా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు లక్ష్యంగా కింజరాపు కుటుంబం వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. బీజేపీకి నరసన్నపేట కాకుండా పాతపట్నం కేటాయించాలన్న వారి ప్రతిపాదనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాతపట్నం సీటును కాపాడుకునేందుకు కార్పొరేట్ లాబీ ద్వారా శత్రుచర్ల చేసిన యత్నాలు ఫలించినట్లే. మరోవైపు నరసన్నపేట నుంచి నామినేషన్ వేసేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బగ్గు రమణమూర్తి సన్నద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు నరసన్నపేట టీడీపీ శ్రేణులను తీవ్ర సందిగ్ధంలో పడేశాయి. రామ్మోహన్‌కు ఎదురుదెబ్బ జిల్లా టీడీపీలో ప్రస్తుతం ఫాంలో ఉన్నానని భావి స్తున్న కింజరాపు రామ్మోహన్‌కు తొలిసారి ఆసలు రాజకీయమంటే ఏమిటో తెలిసివచ్చింది. తాను ఏం చెప్పినా చంద్రబాబు వింటారన్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో రామ్మోహన్ తన పరిమితులు మరచిపోయారు. బీజేపీకి నరసన్నపేట కాకుండా పాతపట్నం కేటాయించేలా చంద్రబాబును ఒప్పించగలనని తనను తాను అతిగా అంచనా వేసుకున్నారు. ఆ ధీమాతోనే బాబును కలిసిన రామ్మోహన్ నేరుగా అసలు విషయానికి వచ్చేశారు. నరసన్నపేటను బీజేపీకి కేటాయించవద్దని కోరారు. బీజేపీ అభ్యర్థిని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా భుజాన వేసుకుని తిరిగినా ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. చంద్రబాబు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. అదే ఫ్లోలో మాట్లాడుతూ నరసన్నపేటను బీజేపీకి కేటాయిస్తే శ్రీకాకుళం ఎంపీ సీటును కూడా పార్టీ కోల్పోవాల్సి వస్తుందని కాస్త తీవ్రస్వరంతోనే అన్నారు. దాంతో చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘ఏం తమాషాలు చేస్తున్నావా?.. బీజేపీకి ఏ సీటు ఇవ్వాలో.. ఏదీ ఇవ్వకూడదో నాకు తెలీదా?’అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ‘అయినా నరసన్నపేట ఇస్తే మీకేంటి ఇబ్బంది? శ్రీకాకుళం ఎంపీగానీ టెక్కలి ఎమ్మెల్యే సీటుగానీ ఇవ్వలేదు కదా! 30 ఏళ్ల సీనియర్లు బుచ్చయ్య చౌదరి, కోడెల శివప్రసాద్‌ల సీట్లే బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. మీ పరిస్థితి అలా కాదు కదా!... ఇతరుల సీట్ల గోల మీకెందుకు? అప్పుడే ఇతర సీట్లను కూడా డిసైడ్ చేసేంతవాడివయ్యావా?’ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో క్లాస్ పీకినట్లు తెలిసింది. దాంతో రామ్మోహన్నాయుడు బిక్కచచ్చిపోయి మారుమాట లేకుండా వెనక్కి వచ్చేశారు. ఫలించిన శత్రుచర్ల లాబీయింగ్ పాతపట్నం సీటును బీజేపీకి కేటాయించకుండా అడ్డుకోవడంలో శత్రుచర్ల విజయరామరాజు విజయం సాధించినట్లు కనిపిస్తోంది. రెండు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన ఆయన కార్పొరేట్ వర్గాల ద్వారా ముమ్మర లాబీ యింగ్ చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల ద్వారా చంద్రబాబు వద్ద తన వాదన వినిపించారు. ‘పాతపట్నం ఇస్తామనే హామీతోనే శత్రుచర్లను పార్టీలోకి తీసుకొచ్చాం.. ఇప్పుడా సీటు బీజేపీకి ఇవ్వడం సరికాదు’ అని వారిద్దరూ బాబు వద్ద సమర్థంగా వాదించినట్లు తెలుస్తోంది. అయినా సరే ‘బగ్గు’ నామినేషన్ సన్నాహాలు హైదరాబాద్ పరిణామాలు ఇలా ఉన్నప్పటికీ.. నరసన్నపేట నుంచి నామినేషన్ వేయడానికి బగ్గు రమణమూర్తి సన్నాహాలు చేసుకుంటుండటం అక్కడి టీడీపీ రాజకీయాలను రసకందాయంలో పడేస్తోంది. ఈ నెల 16న తాను నామినేషన్ వేస్తానని.. అందరూ రావాలని ఆయన పార్టీ నేతలకు కబురు పెట్టారు. నరసన్నపేటను బీజేపీకే ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడితే బగ్గు ఏం చేస్తారన్నది పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటారా అని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తాము ఎలాంటి వైఖరి అనుసరించాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిణామాలు నరసన్నపేటతోపాటు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ శ్రేణులను తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి తాజా పరిణామాలతో మరింతగా దిగజారుతోందని వారు స్పష్టం చేస్తున్నారు. -
ప్రజల అభీష్టం మేరకే రాజీనామాలు: కొండ్రు
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా మరో ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు. మంత్రులు కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు సోమవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు వారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. ప్రజాభీష్టం మేరకే తాము పదవులకు రాజీనామాలు చేసినట్లు కొండ్రు మురళి తెలిపారు. రాష్ట్ర విభజనపై సీపీఐ, బీజేపీ, టీడీపీ తమ నిర్ణయాన్ని మార్చుకుంటే.... కాంగ్రెస్ నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని కొండ్రు మురళి అన్నారు. ఇప్పటికే సగం మంది సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం తొలిసారి సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి సమైక్య సెగ తగలింది. సీమాంధ్ర ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసన తెలిపారు.