► శత్రుచర్ల, శ్రీకాంత్, శోభన్‌బాబు నామినేషన్లు ఓకే
► స్క్రూటినీ తర్వాత రిటర్నింగ్ అధికారి ప్రకటన
► శత్రుచర్ల నామినేషన్లపై శ్రీకాంత్ అభ్యంతరాలు
► చివరి నిమిషం వరకూ టీడీపీ నేతల్లో ఉత్కంఠ
శ్రీకాకుళం: జిల్లాలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆది నుంచి ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఈ బరిలోకి దిగే అభ్యర్థుల ప్రకటన నుంచి వారి నామినేషన్ల దాఖలు... చివరకూ స్క్రూటినీలోనూ అదే వేడి కొనసాగింది. అధికార టీడీపీ తరఫున బరిలోకి దిగిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు మామిడి శ్రీకాంత్, తమరాల శోభన్‌బాబు నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి జేసీ కేవీఎన్ చక్రధర్‌బాబు ధ్రువీకరించారు.
నామినేషన్లు వేసినా ముగ్గురు స్క్రూటినీ ప్రక్రియను దాటి మరో అడుగు ముందుకేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 3వ తేదీ వరకూ ఉంది. ఆ తర్వాతే అసలైన పోరు ఎవ్వరి మధ్య అనేదీ తేలిపోతుంది. కాంగ్రెస్ నాయకుడు పీరుకట్ల విశ్వప్రసాద్ పదవీకాలం ముగియనుండటంతో ఖాళీ అవుతున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ల సంఖ్యలో కాస్త మెరుగైన స్థానంలోనున్న టీడీపీ నుంచి ఆశావహులు మాత్రం 20 మంది నిలిచారు. వివిధ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆఖరి నిమిషంలో ఆ 20 మంది టీడీపీ నాయకులను దరఖాస్తులను బుట్టదాఖలు చేసిన చంద్రబాబు... చివరకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజునే బరిలో నిలిపారు.
విజయరామరాజు ఇటీవలి సాధారణ ఎన్నికలలో పాతపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం వివిధ నాటకీయ పరిణామాలు, జిల్లా కలెక్టరేట్‌లో మూడు గంటల హైడ్రామా నడుమ శత్రుచర్ల నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మామిడి శ్రీకాంత్, టీడీపీకే చెందిన తమరాల శోభన్‌బాబు స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలసిందే.
స్క్రూటినీలోనూ ఉత్కంఠే...: శత్రుచర్ల విజయరామరాజు, మామిడి శ్రీకాంత్, తమరాల శోభన్‌బాబుల నామినేషన్లను బుధవారం రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు పరిశీలించారు. శత్రుచర్ల నామినేషన్లలోని విషయాలు, అఫిడవిట్‌లపై మామిడి శ్రీకాంత్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన తరఫున న్యాయవాదులు వివేక్, బాలకృష్ణ రిటర్నింగ్ అధికారి ముందు వాదనలు వినిపించారు. గతంలో శత్రుచర్ల ఎస్టీ కుల ధ్రువీకరణపత్రాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ న్యాయస్థానంలో చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
శత్రుచర్ల ఎస్టీ కాదని, ఆయన ధ్రువీకరణ పత్రం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అంతేగాకుండా శత్రుచర్ల ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా అనుభవించిన వేతనాలు, భత్యాలు, వివిధ రాయితీల రూపంలో పొందిన మొత్తం సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో శత్రుచర్ల అభ్యర్థిత్వం చెల్లుబాటు కాదని వాదించారు. దీంతో ఆయా అంశాలను రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు జిల్లా ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
కాసేపు తర్జనభర్జనల తర్వాత చివరకు శత్రుచర్ల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అప్పటివరకూ తీవ్ర ఉత్కంఠతో కనిపించిన శత్రుచర్ల, టీడీపీ నాయకులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలాగే స్వతంత్య్ర అభ్యర్థులుగా మామిడి శ్రీకాంత్, తమరాల శోభన్‌బాబు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారు. దీంతో నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్థులు కూడా స్క్రూటినీ ప్రక్రియను దాటి మరో అడుగు ముందుకేశారు.
‘స్థానిక’ పోరులో ఆ ముగ్గురూ సై!
Published Thu, Mar 2 2017 4:56 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
Advertisement