పట్టభద్రులే బుద్ధి చెప్పాలి
► హామీలు అమలు చేయని టీడీపీ, బీజేపీలకు ఓటుతో బుద్ధి చెప్పండి
► పీడీఎఫ్ అభ్యర్థి అజశర్మకు వైఎస్‌ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు
► వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని
శ్రీకాకుళం అర్బన్: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీడీపీలు ఓట్లు అడుగుతున్నాయని, అసలు ఏం చేశారని ఓటు అడుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రాన్ని ముక్కలు చేసినందుకా, లేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదన్నందుకా, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలు తుంగలో తొక్కినందుకా..? ఎందుకు ఓటు వేయాలని అడిగారు. అమలు చేయని హామీలపై టీడీపీ నాయకులు, ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు ప్రజల ముందు నిలబడి సమాధానం చెప్పి ఆ తర్వాత ఓట్లు అడగాలన్నారు. పట్టభద్రులే వీరికి బుద్ధి చెప్పాలని కోరారు.
అజశర్మకు పూర్తి మద్దతు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం గా జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు పీడీఎఫ్ అభ్యర్థి ఎ.అజశర్మకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తోందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, జిల్లాలోని పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యతా ఓటును అజ శర్మకు వేసి గెలిపిం చాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు.
పొత్తు ధర్మానికి తూట్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ–బీజేపీ ఉమ్మడి అభ్యర్థి íపీవీఎన్ మాధవ్‌ను నిలబెట్టి ఓట్లు వేయాలని ఆయా పార్టీల నాయకులు ఒకవైపు అడుగుతున్నారని, మరోవైపు ఆమదాలవలస టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతాడ రవికుమార్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిపి ఆయనకు ఓటు వేయాలని అ డుగుతున్నారని, ఇది మిత్ర ధర్మమా? లేక మిత్ర ద్రో హమా? అని ఆయన ప్రశ్నించారు. స్నేహ ధర్మానికి తూట్లు పొడిచి బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు ఎన్ని ధనుంజయ్, టి.కామేశ్వరి పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం
రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తోందని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అలుపెరుగని పోరాటాలు చేశారని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. హోదాతోనే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కలుగుతుందని తెలిపారు. విభజన ద్వారా జరిగిన నష్టాన్ని ప్యాకేజీ ద్వారా పూరిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం శోచనీయమన్నారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్యులు జేబులు నింపుకునేందుకే ఉప యోగపడుతుందని ఆరోపించారు.