అనూహ్యంగా ఎమ్మెల్సీ
అభ్యర్థిగా ప్రతిభా భారతి ఎంపిక
చివరి క్షణంలో
చక్రం తిప్పిన అచ్చెన్న
శ్రీకాకుళం :రాష్ట్ర మాజీమంత్రి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని అదృష్టం వరించింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తరువాత అనూహ్యంగా ఈమెను అధిష్టానం ఎంపిక చేసింది. గురువారం ఉదయం నుంచి అభ్యర్థుల ఎంపికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎస్సీ వర్గం నుంచి ఒకరిని ఎంపిక చేయాలని తెలుగుదేశం అధిష్టానం నిర్ణయించింది. ఇటీవలే పార్టీలో చేరిన జూపూడి ప్రభాకరరావుపేరు దాదాపు ఖరారైపోయింది. ఆయనకు తెలంగాణాలో ఓటు ఉండడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పోటీకి అనర్హులయ్యారు. దీంతో ప్రతిభా భారతిని ఎంపిక చేసి నామినేషన్ దాఖలు చేయించారు. ఎన్‌టీఆర్, చంద్రబాబు హయాంలలో మంత్రిగా, స్పీకర్‌గా పనిచేసిన ప్రతిభకు మంచిపేరుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అప్రతిహత విజయాలు సొంతం చేసుకున్న ఈమె వైఎస్ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. అటు తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో రిజర్వేషన్లు సైతం మారడంతో రాజాం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రతిభా భారతి పదవిలో ఉన్నప్పుడు ఎంతో సఖ్యతతో ఉన్న కళావెంకటరావుతో విభేదాలు మొదలయ్యాయి. తన ఓటమికి కళావెంకటరావే కారణమని అధిష్టానానికి ఫిర్యాదు చేసే స్థాయికి వారి విభేదాలు వెళ్లాయి.
అటు తరువాత ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా తొలుత ప్రతిభా భారతిని ఎంపిక చేయక పోవడానికి కారణం కళావెంకటరావేనన్న ప్రచారం కూడా జిల్లాలో జరిగింది. ఇటీవలే పార్టీలోకి వచ్చిన జూపూడిని ఎంపిక చేయించి ప్రతిభ ఎదుగుదలను అడ్డుకున్నారని ప్రతిభ వర్గీయులు ఆరోపించారు. అనూహ్యంగా జూపూడి అనర్హులు కావడంతో ప్రతిభను కాకుండా వేరొకరిని ఎంపిక చేయాలని అధిష్టానం భావించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోచించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చక్రం తిప్పి ప్రతిభను ఎంపిక చేయించినట్టు తెలుస్తోంది. కళావెంకటరావును దెబ్బతీసేందుకు ఇదొక అస్త్రంగా వినియోగించుకొని ప్రతిభా భారతి ద్వారా రాజాం ప్రాంతంలో కళా వెంకటరావు ఆధిపత్యాన్ని తగ్గించాలని అచ్చెన్న యోచించి అధిష్టానంపై ఒత్తిడి తేవడం ద్వారా ఈమెను ఎంపిక చేయించినట్టు భోగట్టా. ఏది ఏమైనా దశాబ్ద కాలం తరువాత అయినా ప్రతిభా భారతికి గుర్తింపు రావడంతో ఆమె అనుయాయిలు ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు.
వరించిన అదృష్టం
Published Fri, May 22 2015 2:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement