అంత ఎదిగిపోయావా! | Chandrababu Naidu has taken a class kinjarapu Ram Mohan Naidu | Sakshi
Sakshi News home page

అంత ఎదిగిపోయావా!

Published Sat, Apr 12 2014 3:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

అంత ఎదిగిపోయావా! - Sakshi

అంత ఎదిగిపోయావా!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు లక్ష్యంగా కింజరాపు కుటుంబం వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. బీజేపీకి నరసన్నపేట కాకుండా పాతపట్నం కేటాయించాలన్న వారి ప్రతిపాదనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో పాతపట్నం సీటును కాపాడుకునేందుకు కార్పొరేట్ లాబీ ద్వారా శత్రుచర్ల చేసిన యత్నాలు ఫలించినట్లే. మరోవైపు నరసన్నపేట నుంచి నామినేషన్ వేసేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బగ్గు రమణమూర్తి సన్నద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు నరసన్నపేట టీడీపీ శ్రేణులను తీవ్ర సందిగ్ధంలో పడేశాయి.

 రామ్మోహన్‌కు ఎదురుదెబ్బ
జిల్లా టీడీపీలో ప్రస్తుతం ఫాంలో ఉన్నానని భావి స్తున్న కింజరాపు రామ్మోహన్‌కు తొలిసారి ఆసలు  రాజకీయమంటే ఏమిటో తెలిసివచ్చింది. తాను ఏం చెప్పినా చంద్రబాబు వింటారన్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో రామ్మోహన్ తన పరిమితులు మరచిపోయారు. బీజేపీకి నరసన్నపేట కాకుండా పాతపట్నం కేటాయించేలా చంద్రబాబును ఒప్పించగలనని తనను తాను అతిగా అంచనా వేసుకున్నారు. ఆ ధీమాతోనే బాబును కలిసిన రామ్మోహన్ నేరుగా అసలు విషయానికి వచ్చేశారు.

నరసన్నపేటను బీజేపీకి కేటాయించవద్దని కోరారు. బీజేపీ అభ్యర్థిని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా భుజాన వేసుకుని తిరిగినా ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. చంద్రబాబు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. అదే ఫ్లోలో మాట్లాడుతూ నరసన్నపేటను బీజేపీకి కేటాయిస్తే శ్రీకాకుళం ఎంపీ సీటును కూడా పార్టీ కోల్పోవాల్సి వస్తుందని కాస్త తీవ్రస్వరంతోనే అన్నారు. దాంతో చంద్రబాబులో  ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘ఏం తమాషాలు చేస్తున్నావా?.. బీజేపీకి ఏ సీటు ఇవ్వాలో.. ఏదీ ఇవ్వకూడదో నాకు తెలీదా?’అని ఆగ్రహంగా ప్రశ్నించారు.

‘అయినా నరసన్నపేట ఇస్తే మీకేంటి ఇబ్బంది? శ్రీకాకుళం ఎంపీగానీ టెక్కలి ఎమ్మెల్యే సీటుగానీ ఇవ్వలేదు కదా! 30 ఏళ్ల సీనియర్లు బుచ్చయ్య చౌదరి, కోడెల శివప్రసాద్‌ల సీట్లే బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. మీ పరిస్థితి అలా కాదు కదా!... ఇతరుల సీట్ల గోల మీకెందుకు? అప్పుడే ఇతర సీట్లను కూడా డిసైడ్ చేసేంతవాడివయ్యావా?’ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో క్లాస్ పీకినట్లు తెలిసింది. దాంతో రామ్మోహన్‌నాయుడు బిక్కచచ్చిపోయి మారుమాట లేకుండా వెనక్కి వచ్చేశారు.

 ఫలించిన శత్రుచర్ల లాబీయింగ్
పాతపట్నం సీటును బీజేపీకి కేటాయించకుండా అడ్డుకోవడంలో శత్రుచర్ల విజయరామరాజు విజయం సాధించినట్లు కనిపిస్తోంది. రెండు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన ఆయన కార్పొరేట్ వర్గాల ద్వారా ముమ్మర లాబీ యింగ్ చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల ద్వారా చంద్రబాబు వద్ద తన వాదన వినిపించారు. ‘పాతపట్నం ఇస్తామనే హామీతోనే శత్రుచర్లను పార్టీలోకి తీసుకొచ్చాం..  ఇప్పుడా సీటు బీజేపీకి ఇవ్వడం సరికాదు’ అని వారిద్దరూ బాబు వద్ద సమర్థంగా వాదించినట్లు తెలుస్తోంది.

అయినా సరే ‘బగ్గు’ నామినేషన్ సన్నాహాలు
హైదరాబాద్ పరిణామాలు ఇలా ఉన్నప్పటికీ.. నరసన్నపేట నుంచి నామినేషన్ వేయడానికి బగ్గు రమణమూర్తి సన్నాహాలు చేసుకుంటుండటం అక్కడి టీడీపీ రాజకీయాలను రసకందాయంలో పడేస్తోంది. ఈ నెల 16న తాను నామినేషన్ వేస్తానని.. అందరూ రావాలని ఆయన పార్టీ నేతలకు కబురు పెట్టారు.  నరసన్నపేటను బీజేపీకే ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడితే బగ్గు ఏం చేస్తారన్నది పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు.

పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటారా అని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తాము ఎలాంటి వైఖరి అనుసరించాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిణామాలు నరసన్నపేటతోపాటు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ శ్రేణులను తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి తాజా పరిణామాలతో మరింతగా దిగజారుతోందని వారు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement