ఆ ఎమ్మెల్యే జీతం మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే
మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత శత్రుచర్ల విజయ రామరాజుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా ఆయన పొందిన మొత్తం వేతనాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పదవీకాలం ఇప్పటికే పూర్తయినా కూడా ఆ వేతనాన్ని ఆయన తిరిగి ఇవ్వాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 1999 నుంచి 2004 వరకు శ్రీకాకుళం జిల్లా నాగూరు ఎమ్మెల్యేగా శత్రుచర్ల ఉండేవారు. అది అప్పట్లో ఎస్టీ నియోజకవర్గం. 2004లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం పూర్తిగా మాయమైంది.
అయితే.. క్షత్రియుడైన విజయరామరాజు ఎస్టీగా పోటీ చేయడం తగదని నిమ్మక జయరాజు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లినా విజయరామరాజు క్షత్రియుడేనని, అందువల్ల ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తగదని, ఆయన ఎన్నిక చెల్లదని తేల్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. వైఎస్ఆర్‌సీపీ నాయకుడు రమణమూర్తి చేతిలో ఓడిపోయారు.
కాగా, ఎమ్మెల్యేగా శత్రుచర్ల ఎన్నిక సరికానప్పుడు.. ఆయన పొందిన వేతనం మాట ఏంటని మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దాని విచారణ సందర్భంగానే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తప్పుడు వివరాలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ ఖజానా నుంచి తాము పొందిన వేతనం మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని తెలిపింది. ఇలా తీర్పు ఇవ్వడం దేశ రాజకీయాల్లోనే పెద్ద మేలి మలుపు అవుతుంది. చాలామంది ప్రజాప్రతినిధులు ఇలా కులం విషయంలో తప్పుడు వివరాలను అఫిడవిట్‌లో సమర్పించి ఎన్నికవుతున్నారంటూ ఆ తర్వాతి కాలంలో పిటిషన్లు దాఖలవుతున్నాయి.