పవర్ ట్రిక్స్ | power tricks | Sakshi
Sakshi News home page

పవర్ ట్రిక్స్

Published Sun, Jun 15 2014 2:30 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

పవర్ ట్రిక్స్ - Sakshi

పవర్ ట్రిక్స్

సాక్షి ప్రతినిధి, కడప : నవ్విపోదురుగాక నాకేటీసిగ్గు...అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను  నిలువునా కొనుగోలు  చేస్తూ ప్రజాతీర్పును అగౌరవ పరుస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవం నేపధ్యంలో అడ్డదారుల్లో అధికారిక పీఠాలు దక్కించుకునేందుకు చీప్‌ట్రిక్స్ ప్రదర్శిస్తున్నారు. ఆరకంగా అధినేత మెప్పు పొందాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఈకోవలో పోట్లదుర్తి నాయుడు బ్రదర్స్ ముందు వరుసలో నిలుస్తున్నారు.
 
 యర్రగుంట్ల మున్సిపాలిటీ ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. 20 వార్డులకు గాను 18వార్డులలో ఆపార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. కేవలం 2వార్డులతోనే తెలుగుదేశం పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు స్వగ్రామానికి పక్కలో ఉన్న మున్సిపాలిటీలో టీడీపీ ఘోర పరాభవాన్ని జీర్ణించుకోలేకున్నారు. గ్రామస్థాయి
 నాయకత్వం గల నేతకు తెలుగుదేశం పార్టీ అగ్రపీఠం వేస్తోందనే విమర్శలు ఆపార్టీలో అంతర్లీనంగా ఉన్నాయి.  
 
  ఈ నేపథ్యంలో పోట్లదుర్తి నాయుడు బ్రదర్స్‌కు యర్రగుంట్ల మున్సిపాలిటీపై కన్ను పడ్డట్లు తెలుస్తోంది. మున్సిపల్ కౌన్సిలర్ స్థాయిని బట్టి రేటును ఫిక్స్ చేసినట్లు సమాచారం. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కొంద రు కౌన్సిలర్ల ద్వారా మరికొందరిని ప్రలోభాలకు గురి చేసినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు వారి మాటలు లెక్కచేయకపోవడంతో ప్రధాన నాయకులు రమ్మన్నారంటూ మభ్యపెట్టి తరలించినట్లు సమాచారం. మూడు రోజులుగా నిర్బంధానికి గురిచేసిన అనంతరం అధినేత చంద్రబాబు చెంతకు కౌన్సిలర్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
 
 హుందాతనాన్ని ప్రదర్శించని
 నాయకులు..
 తెలుగుదేశం పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా పోట్లదుర్తి నాయుడు బ్రదర్స్ స్థాయికి తగిన హుందాతనం ప్రదర్శించలేకపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్  ప్రజాతీర్పుకు విలువ ఇవ్వడంలేదని, అధికారిక పీఠాల కోసం చీప్‌‘ట్రిక్స్’కు పాల్పడుతున్నట్లు పరిశీలకుల భావన. పోట్లదుర్తి అంటేనే ముందుగా గుర్తు వచ్చే వ్యాపారం జిల్లా వాసులకు ఎరుకే. అలాంటి స్థాయి నుంచి అత్యున్నతమైన రాజ్యసభ సీటును దక్కించుకున్నా తన సహజ దోరణిని ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నిర్భంధం నుంచి కౌన్సిలర్లకు విముక్తి కల్గించి వారి అభిప్రాయం వెల్లడించగల్గితే, అప్పుడు మరింత హుందాగా ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. పార్టీలు ఏవైనా నాయకులు ప్రజాతీర్పుకు విలువనిచ్చినప్పుడే నిజమైన ప్రజానేతలు కాగలరని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు ఛీత్కరిస్తున్నా ఇలాంటి నీతిబాహ్య చర్యలు ఏమిటని టీడీపీ సీనియర్ నేతలు వాపోతున్నారు.
 
 జిల్లా పరిషత్‌లోనూ అదేతీరు...
 జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 11 జెడ్పీటీసీలు మాత్రమే దక్కాయి. 50 జెడ్పీటీసీలలో 39 స్థానాలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది. ఈపరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ జెడ్పీచైర్మన్‌గిరీని   ఆశిస్తోంది. ఏకంగా 15 మంది జెడ్పీటీసీల మద్దతు టీడీపీకి అవసరం ఉన్నప్పటికీ అదిగో అతడు వచ్చాడు.. ఇదిగో ఇతడు వచ్చాడంటూ... పుకార్లకు తెరలేపుతున్నారు.
 
 జిల్లాలో ఎన్నికలు ఏవైనా తెలుగుదేశం పార్టీకి తిరస్కారమే ఎదురవుతోంది. మరింత కష్టించి ప్రజావిశ్వాసం పొందేందుకు కృషి చేయాల్సిన టీడీపీ పాలి‘ట్రిక్స్’కు పాల్పడుతోంది. ఒకరంటే ఒక్కరు కూడా తాము వైఎస్సార్‌సీపీని వీడుతామంటూ జెడ్పీటీసీలు ప్రకటించలేదు. అయినప్పటికీ అధినేత వద్ద మెప్పుకోసం దేశం నేతలు తాపత్రయ పడుతున్నారు. పోట్లదుర్తి బ్రదర్స్‌కు తోడు పార్లమెంటుకు పోటీచేసి ఓటమి చవిచూసిన శ్రీనివాసులరెడ్డి వారికి జత కలవడంపై ఆపార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement