పీపీపీతో విశాఖ టూరిజం అభివృద్ధి | PPP Visakhapatnam Tourism Development | Sakshi
Sakshi News home page

పీపీపీతో విశాఖ టూరిజం అభివృద్ధి

Published Thu, Sep 25 2014 12:51 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

PPP Visakhapatnam Tourism Development

  • మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి
  • విశాఖపట్నం : పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) విశాఖ టూరిజం అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రుషికొండ ఏపీ టూరిజానికి చెందిన హరితా రిసార్ట్స్‌లో బుధవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏపీ టూరిజం అధికారులు, కలెక్టర్, జీవీఎంసీ అధికారులతో విశాఖ టూరిజం అభివృద్ధిపై సమీక్షించారు. ముందుగా టూరిజం శాఖ ఎండీ చందన్‌ఖాన్ విశాఖలో చేపట్టనున్న ప్రాజెక్టులు, వాటికి ఎంతెంత నిధులు కేటాయించనున్నారో వివరించారు.

    విశాఖ రీజియన్‌లో సింహాచలం, లంబసింగి, పాడేరు, తొట్లకొండ, అరకువేలీ, మత్స్యగుండం, కొండకర్ల తదితర ప్రాం తాల అభివృద్ధికి రూ.183 కోట్లు కేటాయించామన్నారు. మరో రూ.51 కోట్లతో విశాఖ-భీమిలి బీచ్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నామన్నారు. రూ.300 కోట్లతో మధురవాడలో టూరిజం పార్కు, పాడేరులో రూ.55 కోట్లుతో బొటానికల్ గార్డెన్స్, రూ.3 కోట్లతో ఆర్కే బీచ్‌లో 26 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు.

    హైదరాబాద్‌లో గల రవీంద్రభారతి తరహాలో రూ.50 కోట్లతో విశాఖలో కూడా ఆడిటోరియం నిర్మిస్తామన్నారు. విశాఖ ఉత్సవాలను డిసెంబర్ 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నామని తెలిపారు. ఈనెల 27న మధురవాడ జాతరలో రాత్రి బజార్‌ను ప్రారంభించనున్నామని చెప్పారు. మంత్రి గంటా మాట్లాడుతూ సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులను ఆకట్టుకోవాలన్నారు.
     
    హైదరాబాద్‌లో అధికారులుంటే ఎలా?
     
    హైదరాబాద్‌లో టూరిజం అధికారులుంటే విశాఖలో అభివృద్ధి ఎలా జరుగుతుందంటూ ఎంపీ కంభంపాటి హరిబాబు అధికారులను నిలదీశారు. టూరిజం అధికారులు విశాఖను నిర్లక్ష్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన నిధులు ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, అందుకే టూరిజం అభివృద్ధి పనులు జరగడంలేదని అనడంలో అర్థంలేదన్నారు. పాడేరులో టూరిజం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించగా, రూ.4.5 కోట్లు మాత్రమే ఖర్చుచేశారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు.
     
    చిరంజీవి అన్నే నిధులు కేటాయించారు : గత ప్రభుత్వం హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మం త్రిగా ఉన్న చిరంజీవి అన్న విశాఖ బీచ్ అభివృద్ధికి కృషి చేశారని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ మంత్రులు పదేళ్లగా విశాఖలో పర్యాటకం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇదే  వేదికపై చెబుతుంటే, అవంతి మాత్రం గత ప్రభుత్వంలో అన్న చిరంజీవి పర్యాటకం అభివృద్ధికి కృషి చేశారనడం విశేషం. సమీక్షలో మంత్రి కామినేని శ్రీ నివాసరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, గణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార కలెక్టర్ యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ, టూరిజం విభాగం అధికారులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement