Visakhapatnam tourism
-
Visakhapatnam: టూరిజం.. ఆమెదే ఏకఛత్రాధిపత్యం
సాక్షి, విశాఖపట్నం : రాణి తలచుకుంటే.. దెబ్బలకు కొదువా..? అదేంటి రాజు తలచుకుంటే కదా..? ఇక్కడ రాణే పవర్ఫుల్.. కానీ ట్విస్ట్ ఏంటంటే.? ఆ రాణికి పవర్స్ లేవు. కానీ.. ఆమెదే ఏకఛత్రాధిపత్యం. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విశాఖ డివిజన్ పరిధిలో ఉప్పు పప్పు కొనే దగ్గర నుంచి.. సాగర జలాల్లో విహరించే వరకూ అంతా ఆమె కనుసన్నల్లోనే సాగుతోంది. ఆమె ఆగడాలు ఇంకాస్తా శృతిమించి.. ఎలాంటి అధికారాలు లేకపోయినా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా ఏకంగా 29 మంది సిబ్బందిని డివిజన్ పరిధిలో బదిలీలు చేసేశారు. ఇలా ప్రతి విషయంలోనూ మేడం చేస్తున్న అతిపై పర్యాటక సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా పరిధిలో ఏపీటీడీసీ డివిజన్ కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ నుంచే డివిజన్ స్థాయి అధికారులు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ఈ విభాగంలోనే దిగువ స్థాయి నుంచి ఎదిగి డివిజన్ స్థాయి అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ మహిళ చేస్తున్న పెత్తనం పర్యాటక శాఖలో కలకలం రేపుతోంది. నేనే మోనార్క్ అనే రీతిలో సాగిస్తున్న కార్యకలాపాలు.. పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆ మహిళా అధికారికి ఎలాంటి అధికారాలు లేకపోయినా ఇటీవల ఏకంగా 29 మంది ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేసేశారు. తనకు నచ్చిన వారిని తన కోటరీగా ఏర్పాటు చేసుకునేలా ఈ బదిలీలు సాగించేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఏ మాత్రం సమాచారం లేకుండా.. తనకు అధికారాలు లేకపోయినా చేయడంపై ఏపీటీడీసీలో చర్చనీయాంశమైంది. తమని అకారణంగా.. అధికారాలు లేని ఓ అధికారి బదిలీ చేయడంపై పర్యాటక సిబ్బంది విజయవాడలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆది నుంచీ అదే స్వభావం ఏపీటీడీసీలో చేరినప్పటి నుంచి ఆ మహిళా అధికారి అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు. డీవీఎంలు ఎందరు వచ్చినా.. ఆమెదే సామ్రాజ్యమంతా అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే హరిత హోటళ్లు, రెస్టారెంట్లకు అవసరమయ్యే నిత్యావసరాలు, సబ్బులు, ఇతర సామగ్రి ఏం కొనాలన్నా.. ఆమె కనుసైగ చేయనిదే ఫైల్ కదలదు. ఎవరికి టెండర్లు ఇవ్వాలి? ఎంతకు ఇండెంట్ ఇవ్వాలి.. టెండర్ కావాలంటే.. ఎంత పర్సంటేజీ ఫిక్స్ చేయాలి? ఇలా ప్రతి ఒక్కటీ ఆమె చేతుల్లోనే సాగుతోంది. సర్ఫింగ్ జరుగుతున్నా.. రుషికొండ సమీపంలోని ఓ బీచ్‌ను నెల రోజుల కిందట పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పరిశీలన చేయగా.. అక్కడ సర్ఫింగ్ యాక్టివిటీ నిర్వహిస్తుండటం గుర్తించారు. ఎవరు అనుమతులు ఇచ్చారని నిర్వాహకులను ప్రశ్నించగా.. ఆ మహిళా అధికారి తమకు పర్మిషన్ ఇచ్చారని సమాధానమివ్వడంతో అనుమానం కలిగింది. సర్ఫింగ్ యాక్టివిటీతో ఏపీటీడీసీకి ఎంత ఆదాయం వస్తుందో చూద్దామని భావించిన అధికారులు.. దానికి సంబంధించిన ఫైల్ కనిపించకపోవడంతో ఆమెను అడిగినట్లు సమాచారం. వాళ్లకు అనుమతి ఇవ్వలేదని చెప్పడంతో కంగుతిన్న అధికారులు.. సర్ఫింగ్ నిర్వాహకులతో పాటు ఆమెనూ విచారించారు. ఆమె అనుమతితోనే నిర్వహిస్తున్నట్లు ఈ విచారణలో తేలినట్లు సమాచారం. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. ఇలా ప్రతి విషయంలోనూ తానే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ఏపీటీడీసీపై పెత్తనం చెలాయిస్తున్న మహిళా అధికారి అక్రమాలపై విజయవాడలో వరస ఫిర్యాదులు అందుతున్నాయి. -
పీపీపీతో విశాఖ టూరిజం అభివృద్ధి
మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి విశాఖపట్నం : పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) విశాఖ టూరిజం అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రుషికొండ ఏపీ టూరిజానికి చెందిన హరితా రిసార్ట్స్‌లో బుధవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏపీ టూరిజం అధికారులు, కలెక్టర్, జీవీఎంసీ అధికారులతో విశాఖ టూరిజం అభివృద్ధిపై సమీక్షించారు. ముందుగా టూరిజం శాఖ ఎండీ చందన్ఖాన్ విశాఖలో చేపట్టనున్న ప్రాజెక్టులు, వాటికి ఎంతెంత నిధులు కేటాయించనున్నారో వివరించారు. విశాఖ రీజియన్‌లో సింహాచలం, లంబసింగి, పాడేరు, తొట్లకొండ, అరకువేలీ, మత్స్యగుండం, కొండకర్ల తదితర ప్రాం తాల అభివృద్ధికి రూ.183 కోట్లు కేటాయించామన్నారు. మరో రూ.51 కోట్లతో విశాఖ-భీమిలి బీచ్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నామన్నారు. రూ.300 కోట్లతో మధురవాడలో టూరిజం పార్కు, పాడేరులో రూ.55 కోట్లుతో బొటానికల్ గార్డెన్స్, రూ.3 కోట్లతో ఆర్కే బీచ్‌లో 26 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో గల రవీంద్రభారతి తరహాలో రూ.50 కోట్లతో విశాఖలో కూడా ఆడిటోరియం నిర్మిస్తామన్నారు. విశాఖ ఉత్సవాలను డిసెంబర్ 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నామని తెలిపారు. ఈనెల 27న మధురవాడ జాతరలో రాత్రి బజార్‌ను ప్రారంభించనున్నామని చెప్పారు. మంత్రి గంటా మాట్లాడుతూ సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులను ఆకట్టుకోవాలన్నారు. హైదరాబాద్‌లో అధికారులుంటే ఎలా? హైదరాబాద్‌లో టూరిజం అధికారులుంటే విశాఖలో అభివృద్ధి ఎలా జరుగుతుందంటూ ఎంపీ కంభంపాటి హరిబాబు అధికారులను నిలదీశారు. టూరిజం అధికారులు విశాఖను నిర్లక్ష్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన నిధులు ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, అందుకే టూరిజం అభివృద్ధి పనులు జరగడంలేదని అనడంలో అర్థంలేదన్నారు. పాడేరులో టూరిజం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించగా, రూ.4.5 కోట్లు మాత్రమే ఖర్చుచేశారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. చిరంజీవి అన్నే నిధులు కేటాయించారు : గత ప్రభుత్వం హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మం త్రిగా ఉన్న చిరంజీవి అన్న విశాఖ బీచ్ అభివృద్ధికి కృషి చేశారని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ మంత్రులు పదేళ్లగా విశాఖలో పర్యాటకం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇదే వేదికపై చెబుతుంటే, అవంతి మాత్రం గత ప్రభుత్వంలో అన్న చిరంజీవి పర్యాటకం అభివృద్ధికి కృషి చేశారనడం విశేషం. సమీక్షలో మంత్రి కామినేని శ్రీ నివాసరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, గణబాబు, వాసుపల్లి గణేష్కుమార కలెక్టర్ యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ, టూరిజం విభాగం అధికారులు పాల్గొన్నారు.