Visakhapatnam: టూరిజం.. ఆమెదే ఏకఛత్రాధిపత్యం | - | Sakshi
Sakshi News home page

Visakhapatnam: టూరిజం.. ఆమెదే ఏకఛత్రాధిపత్యం

Published Sun, Mar 10 2024 7:25 AM | Last Updated on Sun, Mar 10 2024 12:14 PM

- - Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాణి తలచుకుంటే.. దెబ్బలకు కొదువా..? అదేంటి రాజు తలచుకుంటే కదా..? ఇక్కడ రాణే పవర్‌ఫుల్‌.. కానీ ట్విస్ట్‌ ఏంటంటే.? ఆ రాణికి పవర్స్‌ లేవు. కానీ.. ఆమెదే ఏకఛత్రాధిపత్యం. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ విశాఖ డివిజన్‌ పరిధిలో ఉప్పు పప్పు కొనే దగ్గర నుంచి.. సాగర జలాల్లో విహరించే వరకూ అంతా ఆమె కనుసన్నల్లోనే సాగుతోంది. ఆమె ఆగడాలు ఇంకాస్తా శృతిమించి.. ఎలాంటి అధికారాలు లేకపోయినా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా ఏకంగా 29 మంది సిబ్బందిని డివిజన్‌ పరిధిలో బదిలీలు చేసేశారు. ఇలా ప్రతి విషయంలోనూ మేడం చేస్తున్న అతిపై పర్యాటక సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా పరిధిలో ఏపీటీడీసీ డివిజన్‌ కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ నుంచే డివిజన్‌ స్థాయి అధికారులు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ఈ విభాగంలోనే దిగువ స్థాయి నుంచి ఎదిగి డివిజన్‌ స్థాయి అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ మహిళ చేస్తున్న పెత్తనం పర్యాటక శాఖలో కలకలం రేపుతోంది. నేనే మోనార్క్‌ అనే రీతిలో సాగిస్తున్న కార్యకలాపాలు.. పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఆ మహిళా అధికారికి ఎలాంటి అధికారాలు లేకపోయినా ఇటీవల ఏకంగా 29 మంది ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేసేశారు. తనకు నచ్చిన వారిని తన కోటరీగా ఏర్పాటు చేసుకునేలా ఈ బదిలీలు సాగించేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఏ మాత్రం సమాచారం లేకుండా.. తనకు అధికారాలు లేకపోయినా చేయడంపై ఏపీటీడీసీలో చర్చనీయాంశమైంది. తమని అకారణంగా.. అధికారాలు లేని ఓ అధికారి బదిలీ చేయడంపై పర్యాటక సిబ్బంది విజయవాడలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఆది నుంచీ అదే స్వభావం
ఏపీటీడీసీలో చేరినప్పటి నుంచి ఆ మహిళా అధికారి అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు. డీవీఎంలు ఎందరు వచ్చినా.. ఆమెదే సామ్రాజ్యమంతా అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే హరిత హోటళ్లు, రెస్టారెంట్లకు అవసరమయ్యే నిత్యావసరాలు, సబ్బులు, ఇతర సామగ్రి ఏం కొనాలన్నా.. ఆమె కనుసైగ చేయనిదే ఫైల్‌ కదలదు. ఎవరికి టెండర్లు ఇవ్వాలి? ఎంతకు ఇండెంట్‌ ఇవ్వాలి.. టెండర్‌ కావాలంటే.. ఎంత పర్సంటేజీ ఫిక్స్‌ చేయాలి? ఇలా ప్రతి ఒక్కటీ ఆమె చేతుల్లోనే సాగుతోంది.

సర్ఫింగ్‌ జరుగుతున్నా..
రుషికొండ సమీపంలోని ఓ బీచ్‌ను నెల రోజుల కిందట పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పరిశీలన చేయగా.. అక్కడ సర్ఫింగ్‌ యాక్టివిటీ నిర్వహిస్తుండటం గుర్తించారు. ఎవరు అనుమతులు ఇచ్చారని నిర్వాహకులను ప్రశ్నించగా.. ఆ మహిళా అధికారి తమకు పర్మిషన్‌ ఇచ్చారని సమాధానమివ్వడంతో అనుమానం కలిగింది. సర్ఫింగ్‌ యాక్టివిటీతో ఏపీటీడీసీకి ఎంత ఆదాయం వస్తుందో చూద్దామని భావించిన అధికారులు.. దానికి సంబంధించిన ఫైల్‌ కనిపించకపోవడంతో ఆమెను అడిగినట్లు సమాచారం.

వాళ్లకు అనుమతి ఇవ్వలేదని చెప్పడంతో కంగుతిన్న అధికారులు.. సర్ఫింగ్‌ నిర్వాహకులతో పాటు ఆమెనూ విచారించారు. ఆమె అనుమతితోనే నిర్వహిస్తున్నట్లు ఈ విచారణలో తేలినట్లు సమాచారం. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. ఇలా ప్రతి విషయంలోనూ తానే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ఏపీటీడీసీపై పెత్తనం చెలాయిస్తున్న మహిళా అధికారి అక్రమాలపై విజయవాడలో వరస ఫిర్యాదులు అందుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement