తీరం కోతకు డ్రెడ్జింగ్ పూత
● పనులు ప్రారంభించిన డీసీఐ
● రూ.20 కోట్లు ఖర్చు
సాక్షి, విశాఖపట్నం: అలలు ఎగసిపడి తీరంపై దాడి చేయడం ప్రకృతి సహజం. ఈ దాడి కారణంగా తీరం క్రమంగా కోతకు గురవుతోంది. ఈ కోత తీవ్రం కావడంతో బీచ్ తన సహజ రూపాన్ని కోల్పోతోంది. ఈ నష్టాన్ని నివారించడానికి విశాఖ పోర్టు ఏటా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సహాయంతో ఈ ఏడాది కూడా సుమారు రూ.20 కోట్లతో కోత నివారణ పనులు చేపట్టింది. కాగా.. విశాఖ తీరంలో ఇసుక కోతకు సంబంధించి పదేళ్ల కిందట నెదర్లాండ్‌కు చెందిన డెల్టారిస్ అనే సంస్థ సర్వే చేసింది. అలల తాకిడి కారణంగా పెద్ద మొత్తంలో ఇసుక సముద్రంలోకి వెళ్లిపోతోందని గుర్తించింది. ఈ సమస్యకు ఇసుక మేటలను తిరిగి తీరానికి తరలించడం ఒక్కటే పరిష్కారమని సూచించింది. తీరం కోతకు గురవుతున్న విషయంపై ఆందోళన వ్యక్తం చేసిన విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) దాని నివారణ బాధ్యతను తన భుజానికెత్తుకుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్) జరిగిన నేపథ్యంలో 2016లో కోత నివారణకు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేసింది.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహాయంతో 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరానికి తీసుకొచ్చి.. కోత నివారణకు చర్యలు తీసుకుంది. ఏటా మాదిరిగానే ఈ సారి డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌తో విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.6 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వీపీఏ ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది 2.1 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున మొత్తం 6.3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను డీసీఐ డ్రెడ్జర్ ద్వారా తోడనుంది.
Comments
Please login to add a commentAdd a comment