
గ్లకోమా.. జాగ్రత్త సుమా
బీచ్‌రోడ్డులో
అవగాహన ర్యాలీ
ఏయూక్యాంపస్: ప్రజలు గ్లకోమా వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్య శాల వైద్యుడు టి.సాయి యశ్వంత్ సూచించారు. ఎల్వీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కె బీచ్ నుంచి వైఎంసీఏ వరకు గ్లకోమా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ గ్లకోమా పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. మార్చి 8 నుంచి 16 వరకు ఆస్పత్రి ఆధ్వర్యంలో గ్లకోమా అవగాహన వారోత్సవాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలు, అవగాహన సదస్సుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గ్లకోమాను తొలి దశలో గుర్తించడానికి, మెరుగైన చికిత్సకు, అంధత్వాన్ని నివారించడానికి పలు సూచనలు చేశారు. జీఎంఆర్ వరలక్ష్మి ప్రాంగణంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించా రు. ఆస్పత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్ వీరేంద్ర సచ్‌దేవ మాట్లాడుతూ కుటుంబంలో ఎవరికై నా గ్లకోమా ఉంటే తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 40 ఏళ్లు పైబడిన ప్రతి 200 మందిలో ఒకరికి గ్లకోమా వచ్చే అవకాశం ఉందన్నారు. గ్లకోమా ముదిరే వరకు లక్షణాలు కనిపించకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, తొలి దశలో గుర్తిస్తే చూపును కాపాడుకోవచ్చన్నారు. డాక్టర్ శ్రావణి కొడాలి మాట్లాడుతూ 40 ఏళ్ల లోపు వారు 2–4 ఏళ్లకోసారి, 40–60 ఏళ్ల వారు 2–3 ఏళ్లకోసారి, 60 ఏళ్లు పైబడిన వారు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రపంచ గ్లకోమా సంస్థ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 7 మిలియన్ల మంది గ్లకోమా కారణంగా అంధులు అవుతున్నారు. వీరిలో 66 శాతం మంది మహిళలేనని, అవగాహన లేకపోవడం వల్ల 90 శాతం కేసులు గుర్తించలేకపోతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన ర్యాలీలో ప్లకార్డులు పట్టుకుని 200 మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment