పేదల చదువుతో..ఆటానమస్
- పీఆర్ కాలేజీలోచీటికీ మాటికీ ఫైన్లు
- బడుగు విద్యార్థులపై కొరవడ్డ కనికరం
- పెద్దల సిఫారసులకు జీ హుజూర్
- ప్రిన్సిపాల్, అధ్యాపకులు తమ బిడ్డల్ని వేధిస్తున్నారంటున్న తల్లిదండ్రులు
భానుగుడి (కాకినాడ) : దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన పీఆర్ అటానమస్ ప్రభుత్వ కళాశాల బోధనా సిబ్బంది వైఖరితో అపకీర్తి పాలవుతోంది. విద్యార్థులకు అపరాధ రుసుము (ఫైన్) విధింపులో మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి నుంచి సిఫారసులు వస్తే ఉదారంగా స్పందిస్తున్న వారే.. అలాంటివి తేలేని పేదలపై భారం మోపుతున్నారు. ఈ కళాశాలలో అనేకమంది విద్యార్థులు ఏటీఎం సెంటర్లు, హోటళ్లు, క్యాటరింగ్ సంస్థల్లో పని చేస్తూ, కూలి పనులు సైతం చేస్తూ చదువుకుంటున్నారు.
తాము ఫీజు చెల్లించడం ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా, హాజరు కొరత పడ్డా, ఇతర సాకులు చూపి రూ.500 నుంచి రూ.1000 వరకు ఫైన్ వేస్తున్నారని అలాంటి విద్యార్థులు వాపోతున్నారు. కోర్సులను బట్టి ఓసీలకు రూ.5 వేల నుంచి రూ.6 వేలు, బీసీ, ఎస్సీలకు రూ.3 వందల నుంచి రూ.4 వందల మధ్యలో ఫీజులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాటిని కట్టేందుకే కటకటలాడుతున్న వారెందరో ఉన్నారు. అదనంగా ఫైన్లు విధిస్తే ఎక్కడ నుంచి తేవాలని వాపోతున్నారు. పైగా కించపరుస్తూ మాట్లాడడంతో ఆత్మన్యూనతకు గురవుతున్నారు. ఫీజుల పేరుతో వేధింపుల్ని తట్టుకోలేక ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే ప్రిన్సిపాల్, అధ్యాపకులు బాధ్యత వహిస్తారా అని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు.
కన్నీరు పెట్టినా కరగరు..
పరీక్ష ఫీజులు ఆలస్యమైతే అటానమస్ కళాశాలల్లో రూ.100 నుంచి రూ.200 వరకు ఫైన్ నిర్ణయిస్తున్నారు. పేదవిద్యార్థుల నుంచి ఫైన్లు వసూలు చేయడం ఏ జీవోలో లేదని పలువురు అంటున్నారు. క్రమశిక్షణ పేరుతో పీఆర్ కళాశాలలోనే వేలల్లో ఫైన్లు నిర్ణయిస్తున్నారని, కన్నీరు మున్నీరరుునా ఇక్కడ అధ్యాపకులు కరగడం లేదని విద్యార్థులు మొర పెడుతున్నారు.కళాశాలలో ప్రస్తుతం ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల్లో 20 మార్కుల వరకు వెయిటేజి నిర్ణయించి వాటిని సెమిస్టర్‌ల 80 మార్కులకు కలుపుతారు.
ఇంటర్నల్‌లో ఫెయిలయిన విద్యార్థులు సెమిస్టర్‌లో పూర్తిస్థాయి మార్కులు సాధించాలి. కళాశాలలో ప్రస్తుతం ఇంటర్నల్ పరీక్షలకు 40 మందికి పైగా విద్యార్థులను ఫీజులు సకాలంలో చెల్లించలేదనో, హాజరు తక్కువనో అనుమతించనట్లు తెలుస్తోంది. వీరంతా సెమిస్టర్లలో పూర్తిస్థాయి మార్కులు సాధించకుంటే వచ్చే ఏడాది మళ్లీ అవే పరీక్షలను మళ్ళీ రాసుకోవాల్సిందే.
కలెక్టర్ గారూ! న్యాయం చేయండి!
ఈ కళాశాలలో సీటు కావాలన్నా, ప్రాక్టికల్ మార్కులు వేయాలన్నా, ఇతర పనులేమైనా ఏ ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా వారి పీఏల నుంచో, ప్రముఖుల నుంచో సిఫార్సు తెచ్చుకుంటే ఆగమేఘాల మీద పని జరుగుతుంది. సామాన్యులు చిన్నపనులపై వెళ్ళినా చేదుఅనుభవమే ఎదురవుతుంది. కళాశాల అటానమస్ కావడం, ప్రాక్టికల్‌తో సహా, అన్ని మార్కులూ వారి చేతుల్లో ఉండడమే దీనికి ప్రధాన కారణమని విద్యార్థులంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే కళాశాలకు దూరం కాకతప్పదని జంకుతున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులో లేరు. పేద విద్యార్థులకు అన్యాయం జరగకుండా కలెక్టర్ విచారణ జరపాలని, ఫైన్ల విధింపును రద్దు చేయూలని తల్లితండ్రులు కోరుతున్నారు. పైరవీలకు కాకుండా పేదలకు విద్యాదానం చేయూలన్న దాతల మూల ఆశయం నెరవేరేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు.