పిలుపే ప్రభం‘జనం’ | Prabham call for 'People' | Sakshi
Sakshi News home page

పిలుపే ప్రభం‘జనం’

Published Tue, Aug 27 2013 1:13 AM | Last Updated on Fri, Jul 26 2019 5:49 PM

Prabham call for 'People'

 సాక్షి ప్రతినిధి, విజయవాడ : కోట్ల మందికి సమన్యాయం కోసం ఒకే ఒక్కడు గొంతువిప్పితే సింహనాదమై మార్మోగుతోంది. అతని పిలుపే జన ప్రభంజనమైంది. అతని మాట, బాటే శ్రీరామరక్ష అంటూ లక్షలమంది అనుసరిస్తున్నారు. జనం కోసమే అతను.. అతని బాటలోనే జనం అని మరోమారు స్పష్టమైంది. సమన్యాయం చేస్తారా.. లేదా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచుతారా అంటూ తేల్చాలంటూ చంచల్‌గూడ జైలు నుంచే జననేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజులుగా చేస్తున్న ఆమరణ నిరశనదీక్షకు సంఘీభావంగా ఆ పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టడం ప్రజల పట్ల వైఎస్సార్‌సీపీకి ఉన్న నిబద్ధతను మారోమారు చాటిచెబుతోంది. ఆయనను అనుసరిస్తూ జిల్లాలో సోమవారానికి ఐదుగురు ఆమరణ దీక్షలు చేపట్టగా, పలుచోట్ల నిరసన దీక్షలు, ఆందోళనలు, ర్యాలీలు జరిగాయి. మంగళ, బుధవారాల్లో ఈ దీక్షలు మరిన్ని చోట్లకు విస్తరించే అవకాశం ఉంది.
 
కొనసాగుతున్న జోగి, జ్యేష్ఠ దీక్షలు..

 మైలవరంలో తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు తనయుడు శ్రీనాథ్‌లు చేపట్టిన ఆమరణ దీక్షలు సోమవారం రెండో కొనసాగాయి. జోగి రమేష్‌బాబు దీక్షాశిబిరం వద్దకు తరలివచ్చిన యువత ఆ ప్రాంగణంలోనే కబడ్డీ ఆడారు. ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులు, మైలవరం బార్ అసోషియేషన్ సభ్యులు, ఉపాధ్యాయ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు దీక్షాశిబిరాలకు వచ్చి జోగి రమేష్, జ్యేష్ఠ శ్రీనాథ్‌లకు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన ఈ దీక్షలకు పోటీగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆ పార్టీకి చెందిన ఇద్దరు యువకులతో ఆమరణదీక్ష చేయించడం గమనార్హం.

 పెడ నలో ఉప్పాల రాము..

 పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము సోమవారం స్థానిక బంటుమిల్లి రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. దీక్షకు ఎస్పీ అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి బాటలోనే అవసరమైతే జైలుకు వెళతానేగానీ దీక్ష ఆపేదిలేదని రాము స్పష్టంచేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన అనుకున్న సమయానికి దీక్షను ప్రారంభించారు. దీక్షకు అభ్యంతరం పెట్టవద్దని, ఎస్పీతో తాను మాట్లాడతానని వైఎస్సార్‌సీపీ నాయకుడు, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు పోలీసులకు స్పష్టంచేశారు.

 నగరంలో జవ్వాది రుద్రయ్య..

 కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లో కార్పొరేషన్ స్టాడింగ్ కమిటీ మాజీ చైర్మన్ జవ్వాది సూర్యనారాయణ(రుద్రయ్య) ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో పలువురు డివిజన్ కన్వీనర్లు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. కుమ్మరపాలెం సెంటర్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ పాల్గొన్నారు. పార్టీ కృష్ణాజిల్లా, విజయవాడ నగర డాక్టర్స్  విభాగం ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శివభరత్‌రెడ్డి, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి, డాక్టర్స్ సెల్ జిల్లా కన్వీనర్ మహబూబ్ షేక్, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 జయంతిలో గుంజి సుందర్రావు..

 నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమాని గుంజి సుందర్రావు సోమవారం ఆమరణదీక్షను చేపట్టారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పెనుగంచిప్రోలులో జగన్‌మోహన్‌రెడ్డి మాస్క్‌లు ధరించి ర్యాలీ నిర్వహించారు. పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు పడమటి సురేష్‌బాబు గంగూరులోను, తాతినేని పద్మావతి పెనమలూరులోను ర్యాలీలు నిర్వహించారు. పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్రదర్శన చేశారు.

పార్టీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరులో రెండో రోజు కూడా 20మంది రిలే నిరహారదీక్షలో పాల్గొన్నారు. రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడలో పార్టీ మండల కన్వీనర్ పెయ్యల ఆదాము ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పార్టీ గుడివాడ పట్టణ కన్వీనర్ ఎం.కృష్ణమూర్తి, నూజివీడులో లాకా వెంగళరావు యాదవ్, పెనుగంచిప్రోలులో వూట్ల నాగేశ్వరరావు, తిరువూరులో పిడపర్తి లక్ష్మీకుమారి మంగళవారం నుంచి ఆమరణదీక్షలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇలా జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ దీక్షలు, ధర్నాలు, ర్యాలీలతో తమ నాయకుడికి మద్దతుగా సమైక్య సమరసేనానులై కదులుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement