గత ఏడాది జూన్ 12న రోడ్డు–కమ్–రైలు వంతెనపై నుంచి రాజమహేంద్రవరంలోకి వస్తున్న ప్రజా సంకల్ప యాత్ర
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): గతేడాది జూన్ 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్డు కమ్ రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా జననేతకు జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. లక్షలాది మంది తరలివచ్చి ‘తూర్పు’లోకి జననేతను తోడ్కొని వచ్చారు. అక్కడి నుంచి ఏకధాటిగా అలుపెరగని విధంగా పాదయాత్రగా ఆయన ముందుకు సాగారు. కోనసీమలోని పచ్చని పల్లెల మీదుగా మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మధ్య పాదయాత్ర సాగించారు.
ఏజెన్సీకి సమీపంలో ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అరుదైన మైలురాళ్లు అధిగమించారు. 2,400, 2,500, 2,600, 2,700 కిలోమీటర్ల మైలురాళ్లను దాటి చరిత్ర సృష్టించారు. 200వ రోజు కూడా ఇక్కడే పూర్తి చేసుకున్నారు. ఇది జిల్లా చరిత్రలో అరుదైన ఘట్టంగా లిఖితమైంది. జిల్లాలోని 17 నియోజకవర్గాల పరిధిలోని 32 మండలాల్లో ఉన్న 232 గ్రామాల్లో పాదయాత్ర సాగించిన జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. 412 కిలోమీటర్ల మేర నడిచి జిల్లాలో చరిత్ర సృష్టించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 15 బహిరంగ సభల్లో పాల్గొని జిల్లాలోని అనేక వర్గాల వారికి పలు హామీలిచ్చారు.
అడుగడుగునా పూల వర్షం
అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ...నుదుట తిలకం దిద్ది మంగళహారతులిస్తూ...దిష్టి తీస్తూ ఎక్కడికక్కడ మహిళలు జననేతకు ఘన స్వాగతం పలికారు. రాజన్న బిడ్డను చూసేందుకు వృద్ధులు సైతం ఓపిక తెచ్చుకుని రోడ్లపైకి వచ్చారు. యువకుల సందడి, విద్యార్థినుల హడావుడి... రాఖీలు కట్టిన అక్కా చెల్లెమ్మల ఆనందం మాటల్లో చెప్పలేనిది.. ఓ వైపు ఘన స్వాగతం పలికిన జనం...మరోవైపు సమస్యలు వినే నాయకుడు వచ్చాడంటూ తరలివచ్చిన బాధిత ప్రజలు... ఇలా ఎక్కడికొచ్చినా జన కోలాహలమే. సమస్యలతో సతమతమవుతున్న వారందరూ జగన్‌కు తమ బాధలను చెప్పుకున్నారు.
అందరి సమస్యలూ ఓపిగ్గా విన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనందరి ప్రభుత్వం రాగానే అన్ని విధాలుగా మేలు చేస్తానని, నవరత్నాలతో అందర్ని ఆదుకుంటానని , రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పి వారికి భరోసా ఇచ్చారు. అధికారం అండతో పేట్రేగిపోతున్న పాలకుల దుర్మార్గాలను, అవినీతిని, నిర్లక్ష్య పాలనను నడిరోడ్డుపై జగన్ నిగ్గ దీసినప్పుడు జనం పెద్ద ఎత్తున ఈలలు వేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు...మంత్రులు,..ముఖ్య నేతల వరకు ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో పూర్తి ఆధారాలతో చెప్పినప్పుడు ఔనంటూ నినదించారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోయిన బాధితులు అన్నొడొచ్చాడు...అండగా ఉంటానని హామీ ఇచ్చారని ఊరట చెందారు. ఇసుక వేస్తే రాలనంతగా బహిరంగ సభలకు జనం పోటెత్తారు.
జిల్లా వ్యాప్తంగా జననేతకు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర పొడవునా ప్రజలు బారులు తీరడంతో రహదారులు జన గోదారులయ్యాయి. గోదారమ్మలా జనాభిమానం పొంగి పొర్లింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లిన ప్రతిచోటా జనసంద్రమయ్యింది. ప్రజలతో మమేకమై....ప్రజా సమస్యలు తెలుసుకుని....వారికి భరోసా ఇచ్చి....ముందుకు సాగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఒక ప్రభంజనంలా సాగింది. పాదయాత్ర ఆద్యంతం మహిళలు, రైతులు, విద్యార్థు«లు, నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారు పాదయాత్రలో జననేతను కలిసి తమ బాధలు చెప్పుకుని భరోసా పొందారు. మండుటెండలను లెక్కచేయలేదు. జోరున వర్షం కురిసినా వెనక్కి తగ్గలేదు. పాదయాత్రను ఏకధాటిగా కొనసాగించారు. జిల్లాలో అనేక వారధులను దాటుకుని పాదయాత్రను సాగించారు.
జిల్లాలో పాదయాత్ర సాగిన కిలోమీటర్లు | 412 |
నియోజకవర్గాలు | 17 |
మండలాలు | 32 |
గ్రామాలు | 232 |
మున్సిపాలిటీలు | 8 |
కార్పొరేషన్లు | 2 |
బహిరంగ సభలు | 15 |
ఆత్మీయ సమావేశాలు | 2 |
పాదయాత్ర జరిగిన రోజులు | 50 |
అధికారమిచ్చారు
సుదీర్ఘ యాత్రలో వైఎస్ జగన్ వెంట వేలాదిగా కదిలారు. అడుగులో అడుగేసి నడిచారు. ‘మీ వెంటే ఉం టామని’ చెప్పారు. ‘మాకు అండగా ఉంటున్న మీకు మద్దతిస్తామంటూ’ అభి మానం చూపారు. మాట ఇస్తే మడమ తిప్పని వంశం నుంచి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయ చేస్తారని అప్పుడే భావించారు. ఎన్నికలెప్పుడు వస్తాయా? ఎప్పుడు ఓటేసి గెలుపిద్దామా? అని నాడే శపథం పూనారు. అన్నట్టుగానే సార్వత్రిక ఎన్నికల్లో కసిగా ఓటేశారు. మాట మీద నిలబడే నేత కోసం అర్ధరాత్రి వరకు బారులు తీరి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జననేతను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. 14 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను గెలిపించి పాదయాత్ర చేసిన వైఎస్ జగన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు.ఆ రోజులు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయి.
ఆ అడుగుల సవ్వడి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఆ జన ప్రవాహం కళ్లల్లో కదులుతూనే ఉంది. పరవళ్లు తొక్కే గోదారమ్మలా సాగిన యాత్ర....జనదారులుగా మారిన రహదారులు... నేల ఈనిందా...ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్టుగా జరిగిన సభలు ఇంకా కళ్లెదుటే కదలాడుతున్నాయి. ఆ మహత్తర ప్రజా సంకల్పయాత్ర జిల్లాలో అడుగు పెట్టి అప్పుడే ఏడాదైంది. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర గతేడాది జూన్ 12న జిల్లాలో అడుగుపెట్టింది. ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో ఎన్నో సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల ఇబ్బందులను కళ్లారా చూశారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. బాధలను విన్నారు. అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను నెరవేరుస్తున్నారు. మాట ఇస్తే మడమ తిప్పనని చేసిన వ్యాఖ్యలను కార్యరూపంలో పెట్టారు. ఊహకందని విధంగా ‘సంక్షేమ’ సంతకాలు చేస్తున్నారు.
నెరవేర్చుతున్న హామీలు
పాదయాత్రలో ప్రజలు తమ కష్టాలను చెప్పుకొన్నారు. వ్యక్తిగత ఇబ్బందులు తెలియజేశారు. బాధలు చెప్పుకుని ఉపశమనం పొందారు. అన్నీ వింటూ నేనున్నానంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి కన్నీళ్లు తుడిచి అధికారంలోకి వసే తానేం చేస్తానో చెప్పి ఊరట కల్పించారు. అక్కడికక్కడే అనేక హామీలిచ్చారు.
► ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ స్థలమిచ్చి, ఇళ్ల నిర్మాణం చేపడుతామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు నిన్న జరిగిన కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
► సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని కూడా కార్యరూపంలోకి తెచ్చారు.
► దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నిషేధం అమలుకు అడుగులు వేశారు.
► గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతానని చెప్పిన జగన్ కార్యాచరణ ప్రారంభించారు. గ్రామ వలంటీర్ల నియామకానికి ఆయన ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు.
► యానిమేటర్లకు ప్రతి నెలా రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అధికారిక ప్రకటన చేశారు.
► నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన పథకాలన్నింటినీ అమల్లోకి తెస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment