ప్రజాదర్బార్‌కు సమైక్య సెగ
Published Tue, Aug 6 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
సమైక్య సెగ ప్రజాదర్బార్‌ను తాకింది. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ఉదయం మొదలైన కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అడ్డుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డితో పాటు పలువురు జిల్లా అధికారులు సునయన ఆడిటోరియానికి చేరుకున్నారు. సమైక్య ఉద్యమం జిల్లా నలుమూలల ఉద్ధృతమవడంతో రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు కూడా తక్కువగానే చేరుకున్నారు. వీరి వినతులను కలెక్టర్ స్వీకరిస్తుండగా జేఏసీ చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి, నగర అధ్యక్షుడు లక్ష్మన్న, జేఏసీ నాయకులు కృష్ణుడు, రాజు తదితరులు వెళ్లి అడ్డుకున్నారు. ‘‘తెలుగు వారిని విభజించే కుట్ర జరుగుతోంది. రాష్ట్ర విభజనపై అందరం కలసికట్టుగా పోరాటం సాగించాలి.
ఇందులో జిల్లా అధికారులు కూడా భాగస్వాములు కావాలి. పాలనను స్తంభింపజేయాలి. ప్రజాదర్బార్ నిర్వహించకుండ వెళ్లిపోవాలి’’ అని జేఏసీ చైర్మన్ కోరారు. జేఏసీ ప్రతినిధులు కలెక్టర్ ఎదుట నేలపై బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత కలెక్టర్‌తో సహా జిల్లా అధికారులంతా కార్యక్రమం నుంచి బయటకు వచ్చేశారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది నుంచి జిల్లా రెవెన్యూ అధికారి వినతులు స్వీకరించారు.
Advertisement
Advertisement