కనిగిరి : ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత వర్గపోరు కేంద్రమంత్రి సుజనాచౌదరి సాక్షిగా భగ్గుమంది. కనిగిరిలో శనివారం ఏర్పాటు చేసిన ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్రమంత్రి సుజనాచౌదరి హాజరయ్యారు. కాగా, దారపనేనికి ఏఎంసీ చైర్మన్ పదవి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు వ్యతిరేక వర్గీయులు మూకుమ్మడిగా కార్యక్రమాన్ని బహిష్కరించారు. మాజీ ఎంపీపీ, టీడీపీ కనిగిరి మండలాధ్యక్షుడు బేరి పుల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిషలు కష్టపడ్డ తమను ఎమ్మెల్యే బాబూరావు పట్టించుకోవట్లేదని, ఏఎంసీ ప్రమాణస్వీకారానికి తమను కాదని ఇతర జిల్లాలు (గుంటూరు, నెల్లూరు, విజయవాడ) నుంచి నుంచి మనుషులను తీసుకొచ్చుకున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తమ నిరసన తెలిపేందుకే కేంద్ర మంత్రి పాల్గొన్న కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పుల్లారెడ్డి తెలిపారు. పార్టీ కనిగిరి పట్టణ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ వీవీఆర్ మనోహర్‌రావు, కౌన్సిలర్ల ఎస్‌కే ఫయాజ్, జాళ్లపాలెం సుబ్బారెడ్డి, పువ్వాడి వెంకటేశ్వర్లు, రాంబాబు, మోపాడు రిజర్వాయర్ చైర్మన్ అడుసుమల్లి ప్రభాకర్‌లు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బాయికాట్ చేసినవారిలో ఉన్నారు. మరో ఇద్దరు పార్టీ మండల అధ్యక్షులు సొంతపనుల సాకుతో ప్రమాణస్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు. అసమ్మతి వర్గంలోని వారు ఎక్కువ మంది ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరులే కావటం గమనార్హం. ప్రమాణస్వీకారోత్సవ సభలో కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలంటూ హితబోధ చేశారు.
కేంద్రమంత్రి సాక్షిగా టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు
Published Sat, Jan 23 2016 10:29 PM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM
Advertisement
Advertisement