central minister sujana chowdary
-
‘పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది !’
► కేంద్ర మంత్రి సుజనాచౌదరి వ్యాఖ్య ► గర్ల్స్ ఇన్‌టెక్ కరికులమ్ ఆవిష్కరణ విశాఖ సిటీ: ప్రస్తుత రాజకీయాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పదవులు భార్యలకు ఉన్నప్పటికీ.. భర్తలే అక్కడ పెత్తనం చలాయిస్తున్నారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. గర్ల్స్ ఇన్‌టెక్ ఫౌండేషన్, యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో ‘స్మార్ట్‌సిటీలో మహిళా హ్యాకథాన్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లల్ని తరగతి గదిలో బంధించేటట్లుగా బట్టీ విధానం సాగుతుందనీ, ఈ తరహా విద్యా విధానంలో మార్పు రావాలన్నారు. గతేడాది ఐఐటీలో బాలికలు కేవలం 8 శాతం, ఎన్ఐటీలో 13 శాతం మాత్రమే చేరడం శోచనీయమన్నారు. ఆడపిల్లల చదువులపై పెట్టుబడి పెట్టేందుకు తల్లిదండ్రులు వ్యతిరేకత చూపించే ధోరణి మారాలని సూచించారు. మహిళలకు సరైన విద్య, సామర్ధ్య నిర్వహణ, ప్రోత్సాహం అందిస్తే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, దీనికి ఒక విజన్, కార్యచరణ రూపొందించుకుంటే భవిష్యత్తు బావుంటుందని సూచించారు. మహిళలకు అవకాశం కల్పించేందుకే హ్యాకథాన్ గర్ల్స్ ఇన్‌టెక్ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీదివ్య మాట్లాడుతూ స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖలో మహిళలకు సరైన అవకాశాలు కల్పించేందుకే ఈ హ్యాకథాన్ ప్రారంభించామన్నారు. మహిళాసాధికారతతోనే దేశ భవిష్యత్తు సాధ్యమవుతుందని విశ్వసించి ఈ గర్ల్స్ ఇన్ టెక్ ప్రారంభించానని తెలిపారు. ఈ సందర్భంగా గర్ల్స్ ఇన్టెక్కు చెందిన కరికులమ్‌తో పాటు రెండు పుస్తకాలను మంత్రి సుజనా చౌదరి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్, యూఎస్ కాన్సొలేట్ గాబ్రియల్, ఏఐసీటీఈ డైరెక్టర్ మన్‌ప్రీత్ సింగ్ మన్నా, దక్షిణాసియా యూఎస్ ఎంబసీ మెహనాజ్ అన్సారీ, ఏయూ వీసీ జి.నాగేశ్వరరావు, ధర్మపద సీఈవో రాజశేఖర్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థినులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. -
నాబార్డు నిధులతో పోలవరం : సుజనా
ఢిల్లీ : నాబార్డు నిధులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని కేంద్ర మంత్రి సుజనాచౌదరి చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నాబార్డు రుణం వచ్చే నెల 15వ తేదీ తర్వాత విడుదలవుతుందన్నారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని సుజనా తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2014 అంచనా వ్యయం ప్రకారం నిధులు విడుదల చేయనున్నట్టు సుజనా చౌదరీ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం భరించనుండడంతో ఈ మొత్తాన్ని కేంద్రం.. నాబార్డు నుంచి రుణంగా పొందనుంది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో అందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం నాబార్డు నుంచి రుణంగా పొంది.. కేంద్ర సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)æ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వనుంది. ఈ మేరకు నాబర్డ్–పోలవరం ప్రాజెక్టు డెవలెప్మెంట్ అథారిటీకి మధ్య ఒప్పదం కుదిరింది. ప్రాజెక్టుకు నిధుల విడుదల, వినియోగ పత్రాల సమర్పన తదితర అంశాలపై సోమవారం ఢిల్లీలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరీ సమక్షంలో నాబర్డ్– పోలవరం అథారిటీ– రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. నాబర్డ్ చైర్మన్ హర్షకుమార్ భన్వాల్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేష్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇతర‡ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను కేంద్ర మంత్రి సుజనా చౌదరీ మీడియాకు వెల్లడించారు. -
కేంద్రమంత్రి సాక్షిగా టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు
కనిగిరి : ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత వర్గపోరు కేంద్రమంత్రి సుజనాచౌదరి సాక్షిగా భగ్గుమంది. కనిగిరిలో శనివారం ఏర్పాటు చేసిన ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్రమంత్రి సుజనాచౌదరి హాజరయ్యారు. కాగా, దారపనేనికి ఏఎంసీ చైర్మన్ పదవి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు వ్యతిరేక వర్గీయులు మూకుమ్మడిగా కార్యక్రమాన్ని బహిష్కరించారు. మాజీ ఎంపీపీ, టీడీపీ కనిగిరి మండలాధ్యక్షుడు బేరి పుల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిషలు కష్టపడ్డ తమను ఎమ్మెల్యే బాబూరావు పట్టించుకోవట్లేదని, ఏఎంసీ ప్రమాణస్వీకారానికి తమను కాదని ఇతర జిల్లాలు (గుంటూరు, నెల్లూరు, విజయవాడ) నుంచి నుంచి మనుషులను తీసుకొచ్చుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తమ నిరసన తెలిపేందుకే కేంద్ర మంత్రి పాల్గొన్న కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పుల్లారెడ్డి తెలిపారు. పార్టీ కనిగిరి పట్టణ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ వీవీఆర్ మనోహర్‌రావు, కౌన్సిలర్ల ఎస్కే ఫయాజ్, జాళ్లపాలెం సుబ్బారెడ్డి, పువ్వాడి వెంకటేశ్వర్లు, రాంబాబు, మోపాడు రిజర్వాయర్ చైర్మన్ అడుసుమల్లి ప్రభాకర్‌లు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బాయికాట్ చేసినవారిలో ఉన్నారు. మరో ఇద్దరు పార్టీ మండల అధ్యక్షులు సొంతపనుల సాకుతో ప్రమాణస్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు. అసమ్మతి వర్గంలోని వారు ఎక్కువ మంది ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరులే కావటం గమనార్హం. ప్రమాణస్వీకారోత్సవ సభలో కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలంటూ హితబోధ చేశారు. -
విద్యతోనే సామాజిక ప్రగతి
కేంద్రమంత్రి సుజనాచౌదరి తిరువళ్లూరు : విద్యతోనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని వేల్‌టెక్ వర్సిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 5 వార్షికోత్సవ వేడుకలు, డిగ్రీలను ప్రదానం చేసే కార్యక్రమం వర్సిటీ చైర్మన్ డాక్టర్ రంగరాజన్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి హాజరైన వారిని వైస్‌చైర్మన్ శకుంతలారంగరాజన్ ఆహ్వానించగా, డెరైక్టర్ కిషోర్‌కుమార్ అతిథిలను ఆహ్వానిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. కళాశాల వైస్‌చైర్మన్ మహలక్ష్మీరంగరాజన్ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి సుజనాచౌదరి హాజరై 719 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ డిగ్రీలను తీసుకున్న విద్యార్థులు తమ మెదడుకు మరింత పదును పెట్టడంతో పాటు జీవితంతో స్థిరపడడానికి తమ వంతు ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు. అయితే ఇంజినీరింగ్ విద్యార్థులు తమ చదువును డిగ్రీ అనంతరం నిలిపివేయకుండా భవిష్యత్తులో మరింత సాగించాలని ఆయన సూచించారు. విద్యార్థులను నూతన పరిశోధనలవైపు సాగేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అయితే ఇంజినీరింగ్ విద్యార్థులు చేసే నూతన పరిశోధనలు దేశానికి ప్రయోజనం చేకూరేలా ఉండాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.