నాబార్డు నిధులతో పోలవరం : సుజనా
నాబార్డు నిధులతో పోలవరం : సుజనా
Published Mon, Sep 26 2016 6:36 PM | Last Updated on Fri, Oct 19 2018 7:14 PM
ఢిల్లీ : నాబార్డు నిధులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని కేంద్ర మంత్రి సుజనాచౌదరి చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నాబార్డు రుణం వచ్చే నెల 15వ తేదీ తర్వాత విడుదలవుతుందన్నారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని సుజనా తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2014 అంచనా వ్యయం ప్రకారం నిధులు విడుదల చేయనున్నట్టు సుజనా చౌదరీ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం భరించనుండడంతో ఈ మొత్తాన్ని కేంద్రం.. నాబార్డు నుంచి రుణంగా పొందనుంది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో అందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం నాబార్డు నుంచి రుణంగా పొంది.. కేంద్ర సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)æ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వనుంది.
ఈ మేరకు నాబర్డ్–పోలవరం ప్రాజెక్టు డెవలెప్‌మెంట్ అథారిటీకి మధ్య ఒప్పదం కుదిరింది. ప్రాజెక్టుకు నిధుల విడుదల, వినియోగ పత్రాల సమర్పన తదితర అంశాలపై సోమవారం ఢిల్లీలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరీ సమక్షంలో నాబర్డ్– పోలవరం అథారిటీ– రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. నాబర్డ్ చైర్మన్ హర్షకుమార్ భన్వాల్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేష్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇతర‡ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను కేంద్ర మంత్రి సుజనా చౌదరీ మీడియాకు వెల్లడించారు.
Advertisement
Advertisement