‘పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది !’
► కేంద్ర మంత్రి సుజనాచౌదరి వ్యాఖ్య
► గర్ల్స్ ఇన్‌టెక్ కరికులమ్ ఆవిష్కరణ
విశాఖ సిటీ: ప్రస్తుత రాజకీయాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పదవులు భార్యలకు ఉన్నప్పటికీ.. భర్తలే అక్కడ పెత్తనం చలాయిస్తున్నారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. గర్ల్స్ ఇన్‌టెక్ ఫౌండేషన్, యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో ‘స్మార్ట్‌సిటీలో మహిళా హ్యాకథాన్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లల్ని తరగతి గదిలో బంధించేటట్లుగా బట్టీ విధానం సాగుతుందనీ, ఈ తరహా విద్యా విధానంలో మార్పు రావాలన్నారు.
గతేడాది ఐఐటీలో బాలికలు కేవలం 8 శాతం, ఎన్‌ఐటీలో 13 శాతం మాత్రమే చేరడం శోచనీయమన్నారు. ఆడపిల్లల చదువులపై పెట్టుబడి పెట్టేందుకు తల్లిదండ్రులు వ్యతిరేకత చూపించే ధోరణి మారాలని సూచించారు. మహిళలకు సరైన విద్య, సామర్ధ్య నిర్వహణ, ప్రోత్సాహం అందిస్తే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, దీనికి ఒక విజన్, కార్యచరణ రూపొందించుకుంటే భవిష్యత్తు బావుంటుందని సూచించారు.
మహిళలకు అవకాశం కల్పించేందుకే హ్యాకథాన్
గర్ల్స్ ఇన్‌టెక్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ శ్రీదివ్య మాట్లాడుతూ స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖలో మహిళలకు సరైన అవకాశాలు కల్పించేందుకే ఈ హ్యాకథాన్ ప్రారంభించామన్నారు. మహిళాసాధికారతతోనే దేశ భవిష్యత్తు సాధ్యమవుతుందని విశ్వసించి ఈ గర్ల్స్ ఇన్ టెక్ ప్రారంభించానని తెలిపారు. ఈ సందర్భంగా గర్ల్స్ ఇన్‌టెక్‌కు చెందిన కరికులమ్‌తో పాటు రెండు పుస్తకాలను మంత్రి సుజనా చౌదరి ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఎంపీలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్, యూఎస్ కాన్సొలేట్ గాబ్రియల్, ఏఐసీటీఈ డైరెక్టర్ మన్‌ప్రీత్ సింగ్ మన్నా, దక్షిణాసియా యూఎస్ ఎంబసీ మెహనాజ్ అన్సారీ, ఏయూ వీసీ జి.నాగేశ్వరరావు, ధర్మపద సీఈవో రాజశేఖర్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థినులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.