సాక్షి, ఒంగోలు : రాష్ట్ర రాజధాని అమరావతిలోని శాసనసభలో బుధవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన వారు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారులో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు మరో 10 మంది శాసన సభ్యులతో బుధవారం వెలగపూడి సభలో ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం వీరంతా శాసనసభ వ్యవహారాల సలహాసంఘ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 12 మందిలో ఇద్దరు అత్యధికంగా 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయిన వారుండగా మరో ఇద్దరు ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడోసారి ఒకరు, రెండో సారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా తొలిసారిగా నలుగురు శాసనసభకు ఎన్నికయినవారున్నారు.
ఒంగోలు నుంచి ఐదు సార్లు విజయం..
బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను... అంటూ ఒంగోలు అసెంబ్లీ నుంచి 5వ సారి శాసన సభకు ఎన్నికైన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన బాలినేని 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. తిరిగి 2019 ఎన్నికల్లో అదేపార్టీ నుంచి పోటీ చేసి ఐదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు.
మూడు స్థానాలు ఐదు సార్లు..
- 1978 అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం కృష్ణమూర్తి తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985లో మార్టూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచే అద్దంకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సారి 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు.
ఈ ఇద్దరూ 4వ సారి..
- 1989లో కందుకూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహీధర్‌రెడ్డి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు.తర్వాత 2004,2009 లలో కాంగ్రెస్ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు.2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 4వ సారి ఎన్నికయ్యారు.
- 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి శాసన సభకు ఎన్నికైన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నిక కాగా 2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి టీడీపీ తరుపున శాసన సభకు ఎన్నికయ్యారు.
3వసారి ఆదిమూలపు సురేష్ :
- 2009లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. 2014లో సంతనూతలపాడు నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో తిరిగి యర్రగొండపాలెం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు.
ముగ్గురు 2వసారి..
- 2009 ఎన్నిలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసిన అన్నా రాంబాబు తొలిసారి శాసన సభకు ఎన్నిక కాగా 2019లో వైఎస్సార్ సీపీ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోమారు రికార్డు మెజారిటీతో శాసన సభకు ఎన్నికయ్యారు.
- 2014 ఎన్నికల్లో కొండపి, అద్దంకి నియోజకవర్గాల నుంచి టీడీపీ తరుపున పోటీ శాసన సభకు ఎన్నికైన డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావులు 2019 ఎన్నికల్లోనూ అదే స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా మరో మారు ఎన్నికయ్యారు.
తొలిసారి ఎమ్మెల్యేలుగా..
2019 ఎన్నికల్లో మార్కాపురం, దర్శి, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కుందురు నాగార్జునరెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూదన్‌యాదవ్, టీజేఆర్ సుధాకర్‌బాబులు తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment