- బ్యారేజీ ఎత్తు, పలు సమస్యలపై చర్చించనున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా ఉన్న ప్రాణహిత-చేవెళ్ల, లెండి, పెన్‌గంగ ప్రాజెక్టుల్లో నెలకొన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు గతంలో ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలు అమలయ్యేలా చూడాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఈ నెల 17న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవిస్‌తోకేసీఆర్ ముఖాముఖి చర్చలు జరపనున్నారు.
ఈ నెల 15న ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ రెండు రోజుల అనంతరం అటునుంచి నేరుగా మహారాష్ట్రకు వెళ్లి ఫడ్నవిస్‌తో భేటీ కానున్నారు. ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలోని తుమ్మిడిహెట్టిలో నిర్మించదలిచిన బ్యారేజీలో ఎత్తిపోసేలా రాష్ట్రం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. దీనికోసం బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా తెలంగాణ నిర్ణయించ గా మహారాష్ట్ర దాన్ని తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది.
బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేసిన కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) తెలంగాణ చెబుతున్న వాదనను సమర్థిస్తూ 152 మీటర్ల బ్యారేజీ ఎత్తుకు పూర్తి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో నివేదికను ప్రామాణికంగా తీసుకొని బ్యారేజీ ఎత్తుకు సమ్మతం తెలపాలని కేసీఆర్ కోరే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాలకు ఆ రాష్ట్ర చట్టాల మేరకు పరిహారం ఇచ్చేం దుకు సీఎం సుముఖత వ్యక్తం చేసే అవకాశాలున్నాయి.
ఇక లెండి పనులను వేగిరం చేసే చర్యల కోసం కేసీఆర్ విన్నవించునున్నారు. దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు కింది కాల్వల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియకు మహారాష్ట్ర ముందుకు రావాలని కోరనున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఫడ్నవిస్‌తో భేటీలో చర్చించాల్సిన అంశాలపై కేసీఆర్ శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ప్రాణహిత హైడ్రాలజీ లెక్కలను పరిశీలించేందుకు త్వరలోనే కేంద్ర జల సంఘం అధికారులు రాష్ట్రానికి రానున్నట్లు తెలిసింది.