అన్నా వచ్చి ఏంచేస్తారు?
- మీడియాతో మంత్రి ప్రత్తిపాటి, కుటుంబరావు
హైదరాబాద్: అంతా అయిపోయాక రాజధాని ప్రాంతంలో సామాజిక ఉద్యమనేత అన్నా హజారే వచ్చినా ఏం లాభం లేదని, రైతుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆయనొచ్చి ఏం చేస్తారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. మేథాపాట్కర్, అన్నా హజారేలు రాజధాని ప్రాంతానికి రావడం వల్ల భూముల రేట్లు పడిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు తమ భూములకు ఏడాదికి కౌలు తీసుకున్నారని, ఇప్పటికి రూ.20 కోట్లు కౌలు కింద చెల్లించామని తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో కలిసి మంత్రి పుల్లారావు గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
కృష్ణా జిల్లాలో రైతులు కూడా తమకు భూ సమీకరణ చేపట్టాలని కోరుతున్నారని, భూ సమీకరణ కృష్ణా జిల్లాలో జరపడం లేదని బాధ పడుతున్నందునే అక్కడ కూడా సమీకరణ చేపడుతున్నామన్నారు. రుణమాఫీపై రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈనెల 27 (సోమవారం) నుంచి మే 15 వరకు అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు చెప్పారు. జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు వచ్చే ఫిర్యాదులను కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు పంపి పరిష్కారానికి సచివాలయంలోని హెచ్ బ్లాకులో 40 మందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వారు వివరించారు.
రుణమాఫీకి సంబంధించి 53 లక్షల ఖాతాల్లో నిధులు జమ చేసినట్టు చెప్పారు. 53 లక్షల రైతులకు రుణమాఫీ లేఖలు పంపుతామని, అలాగే పంచాయతీల్లో ఎంత రుణం మాఫీ అయ్యిందో జాబితాలు, హోర్డింగులు పెడతామన్నారు. రుణమాఫీ బాండ్లను కూడా డిజైన్ చేస్తున్నామని, సీఎం చంద్రబాబు పరిశీలన తర్వాత రైతులకు బాండ్లు అందిస్తామన్నారు.
ఇప్పటి వరకు రుణమాఫీ కోసం 80 వేల ఫిర్యాదులు వచ్చాయని, వీటిల్లో 14వేలకు పైగా ఈ - మెయిల్ రూపంలో వచ్చాయన్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు 13 వేల ఖాతాల్లో నిధులు జమ చేశామని, మరో 8 వేల ఖాతాల పరిశీలన జరుగుతోందని, 16 వందల ఖాతాలకు రేషన్‌కార్డులు లేవన్నారు. అయితే రెండు రోజుల్లోగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు.
బ్యాంకు మేనేజర్ల సస్పెన్షన్‌కు సిఫారసు : కుటుంబరావు
బ్యాంకుల్లో తప్పుల వల్లే చాలా ఖాతాలకు నిధులు వెళ్లడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. బ్యాంకుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రతి రోజూ తమ దృష్టికి వస్తున్నాయని, ఆయా బ్యాంకుల మేనేజర్ల సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తామన్నారు. రాజధాని ప్రాంతం ధాన్యాగారం కాదన్నారు. ఈ వ్యవహారమై శివరామకృష్ణన్ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందన్నారు. రాజధాని ప్రాంత భూముల్లో రకరకాల పంటలు పండిస్తారనడంలో అర్థం లేదని, అంత సారవంతమైన భూములైతే రైతులు ఎందుకిస్తారని ఎదురు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, కడప, ఉభయ గోదావరి జిల్లాల నుంచి తప్ప మిగిలిన ప్రాంతాల నుంచే రుణమాఫీ ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని కుటుంబరావు వివరించారు.